Thursday, January 19, 2017

“స్త్రీ” జీవన విధానంలో నేను అన్వేషించిన కొన్ని సంఘటనలు ...




“స్త్రీ” జీవన విధానంలో నేను అన్వేషించిన కొన్ని సంఘటనలు ... 
*********************************************

వివాహంతో “స్త్రీ” తన సర్వశక్తులు, ఇష్టాఇష్టాలను పూర్తిగా భర్తకు ఎందుకర్పిస్తుంది ?? 
అసలు వివాహం అనేది “స్త్రీ” లకు మాత్రమే అవసరమా ?? పురుషులకు ఇది వ్యాపారమా ?? లేక వినోదమా ??
ప్రేమానురాగాలపై ఆధారపడాల్సిన ఆ బంధంలో హింస, దౌర్జన్యము, అసమానత్వము, పురుషాధిపత్యము, “స్త్రీ” ల అణిచివేత ఎందుకు చోటుచేసుకున్నాయి ??
“స్త్రీ”ల హత్యలు, ఆత్మహత్యలు ఎందువల్ల పెరుగుతున్నాయి ??
కన్నవారి కడుపు కోతకు, అబలల అకాల మరణాలకు కారణం నేటి సమాజమా ?? 
“స్త్రీ” లా ?? పురుషులా ?? అనేవి నేడు మన ముందువున్న శేష ప్రశ్నలు... 
ఈ దుస్థితి మారాలంటే “స్త్రీ” నడవడి, ఆమె జీవిత విధానంలో మార్పులను అన్వేషించవలసిన ఆవశ్యకత కొంతమేర ఉందనిపించింది.. 


వివాహానంతరం “స్త్రీ” జీవన సంరక్షణ ఎలా జరగాలి అన్నప్పుడు వివాహానికి పూర్వమే “స్త్రీ” విజ్ఞానవతి అయివుండాలి.. ప్రపంచ జ్ఞానాన్ని పొందివుండాలి.. సామాజిక దౌష్ట్యాలను అర్ధం చేసుకొని ఉండాలి..కుటుంబ వ్యవస్థ గురించి, పాత ఆచారాలను గురించి, ముఖ్యంగా గృహిణిగా తన స్థానాన్ని గురించి, భార్యల కర్తవ్యాన్ని గురించి, తల్లిగా ఆమె భాద్యతల గురించి, భర్తల అధికారాన్ని ఇలా ఎన్నో విషయాలు నవగతం చేసుకున్న “స్త్రీ” మాత్రమే దాంపత్య జీవిత రంగంలో తన సంరక్షణను, తన స్థాయిని, తన స్వేచ్ఛను నిలుపుకోగలుగుతుంది .... ఆ ధైర్య స్థైర్యాలు లేని “స్త్రీ” హతాశురాలై ఆత్మార్పణకు గాని, హత్యకు గాని, “శాడిజా”నికి గాని గురి అవుతోంది.. బాల్య వివాహాలు నశించిన ఈ రోజుల్లో వయస్సుతోపాటు సామాజిక అవగాహన, వివాహ వ్యవస్థా, కుటుంబ సంక్షేమం, ఆర్ధిక, రాజకీయ పరిస్థితుల లాంటి ఎన్నో విషయాలను తమ విద్యలద్వారా, వివేకం ద్వారా గ్రహించగల పరిస్థితి ఈనాటి మహిళలకు దక్కింది.. కనుక “స్త్రీ”లు స్వతంత్రాలోచనను ముందుగా నేర్చుకోవాలి... 


పెళ్లి కుదరగానే ఆ అమ్మాయి పెళ్ళికొడుకు ఆస్తిగా మారిపోతుంది.. అందుకే చదువు, పెళ్లి, ఉద్యోగాలకు నేటి అమ్మాయిలు ఆహుతి అయిపోతున్నారు.. ఉద్యోగిని కావాలని కొందరు వరులు “డిమాండ్” చేస్తున్నారు.. అంటే కట్నమే కాకుండా పాడి ఆవు లాంటి “స్త్రీ” కావాలని వారి వాంఛ .. ఆమె అందించే డబ్బుపై మక్కువే కాని ఆమె వ్యక్తిత్వం, సమానత్వం కోరి కాదని ఇక్కడ మనం గమనించాలి... విద్యార్ధినులు సైతం వివాహం అనే రధం కొరకు నిరీక్షిస్తూ వుంటున్నారు.. చదువు అంటే చదవడం, వద్దు అంటే మానెయ్యడం వారి కర్తవ్యంగా భావిస్తూ తలవంచి తాళి కట్టించుకుంటున్నారు ... వారికి ఒక ధ్యేయం కాని, లక్ష్యం కాని ఉండట్లేదు.. “ఆడది పుట్టింది పెళ్లి కొరకే.. బిడ్డల్ని కనటానికొరకే” అని అమ్మమ్మ చెప్పే మాటలు విని మురిసిపోతున్నారు... కొందరు అమ్మాయిలు అయితే కాబోయే భర్త అందంగా వుండాలని, గొప్ప ఉద్యోగస్తుడు, ధనవంతుడు అయి వుండాలని వాంఛిస్తూ వుంటారు.. తనని అమితంగా ప్రేమిస్తాడని, ఆరాధిస్తాడని కలలుకంటూ వుంటారు.. ఆ కోరికలు నిరాశలైనప్పుడు మానసిక వ్యవధితో కుమిలిపోతారు... మరో అసభ్య విషయం ఏంటంటే.. పెళ్ళిచూపుల తంతు... వరుడికి అమ్మాయి నచ్చితే చాలు .. అంటే ఏకపక్ష నిర్ణయానికి మన అమ్మాయిలు ఆనందపడి పోతున్నారు.. ఆ మైకంలో రేపు యెంత ఘోరం జరుగుతుందో, ఈనాడు వున్న కొద్ది స్వేఛ్చ పెళ్లికాగానే ఎలా అపహరిస్తాడో ఊహించుకోరు.. పైగా ఎలాగోలా ఆ అమ్మాయిని వదిలించుకోవాలనుకునే తల్లితండ్రులు కాస్తంత సర్దుబాటు చేసుకొని సాఫీగా జీవితాన్ని వెళ్లబుచ్చుకో తల్లీ !!! అంటారు.. అంటే భర్త పెడితే తిను, కొడితే పడూ అనే నీతి అందులో ఉంటుంది.. పైగా ఉత్తమ గృహిణి (పూర్తిగా లొంగిపోయిన) ఆదర్శ మహిళలు అంటూ, సీతా, సావిత్రి, ద్రౌపది లాంటి మహిళల జీవితాలను వల్లెవేస్తారు.. ఆనాడు వారు అలా వున్నారంటే వారి భర్తలు ఉత్తములు కాబట్టి ... నేటి భర్తలు ఉత్తములు కాదు “ఉత్తర కుమారులు” అందరూ అని చెప్పే ఉద్దేశం నాది కాదు.. ఇలా కూడా మన మధ్య ఉన్నారని చెప్పే చిరు ఉద్దేశం మాత్రమే ఇది.. 

ఈ నాటి పెళ్ళికి ప్రధాన పాత్ర వహించేది వరకట్నం .. ఆ దుర్నీతిపై “స్త్రీ” లే తిరగబడాలి ,.. కులం, మతం, వ్యాపార దృక్పథంతో నిమిత్తంలేని భాగస్వామ్యాన్ని ఇద్దరూ వాంఛించాలి.. వివాహాల్లో దుబారా, ఆడంబరాలు, తలకు మించిన ఖర్చులు, హోదాలు, వ్యతిరేకిస్తూ యువతులు పోరాటాలు సాగించాలి.. విద్యావిధానంలో వివాహంలో సమస్యలు, భార్యాభర్తల అనుబంధం, “స్త్రీ”, “పురుష” సమానత్వాన్ని సూచించే విధానాలను నేర్పించాలి.. అలాగే కట్న సమస్యలు, “స్త్రీ”లపై భర్తల అత్యాచారాలు, అత్తా, మామల హింసలు లాంటివి వివరించాలి. అప్పుడే యువతీ యువకులిద్దరూ పెళ్లి అంటే ఏమిటో, దాంపత్యం అంటే ఏమిటో కుటుంబ వ్యవస్థ ఎందుకో గుర్తిస్తారు.. లోపాలను సరిదిద్దుకుంటూ కుటుంబ లోపాలను సవరిస్తూ సహజీవనం సాగించగలరు.. 

ఇకపోతే ప్రేమ వివాహం ... “లవ్ ఎట్ ఫస్ట్ సైట్” అనే మాట నా దృష్టిలో అర్ధరహితం... మనస్సులో ఆకర్షణే ప్రేమ అని భావించడం పెద్ద పొరపాటు.. తాత్కాలిక ఆకర్షణ ప్రేమ కిందకు రానేరాదు.. మోహానికి, ప్రేమకు చాలా తేడా ఉంది.. ఒక వ్యక్తి యొక్క నడకను, సంభాషణా చాతుర్యాన్ని, హాస్య ధోరణిని తిలకించి, శారీరక సౌందర్యాన్ని గమనించి మరో వ్యక్తి ఆకర్షణకు లోను అవుతారు .. అది ప్రేమ కాదని తెలియకపోవడం వల్ల జీవితంలో చాలా పెద్ద దెబ్బ తింటున్నారు.. 

భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు నిండుగా వున్నప్పుడు చుట్టూ వున్న సమాజాన్ని పట్టించుకోనక్కరలేదు.. వివాహ సంబంధాన్ని పెంచి పోషించేది ఆలు, మగల అనురాగమే.. వారి జీవితాలను మమేకం చెయ్యగల శక్తి ప్రేమకు ఉంది.. అది ఎలా ఉండాలంటే .. ఇటుకను మరో ఇటుకతో కలిపే సిమెంట్ లాంటిది లా ఉండాలి.. ఒకరిమీద మరొకరికి మక్కువ వున్నప్పుడు వారిద్దరూ అవతలి వారికోసం ఎంతటి త్యాగానికైనా నడుంకడతారు.. అలాంటి ప్రేమ చాలామందిలో మొదట్లో ఉండటం గమనించాను.. ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది.. కొందరిలో సంవత్సరం ఉంటుంది.. మరికొందరిలో 5 ఏళ్ళు ఉంటుంది.. ఇంకొందరిలో 50 ఏళ్ళు కూడా ఉంటుంది.. అది సన్నగిల్లినప్పుడే అసలైన రూపాలు బయటకు వస్తున్నాయి.. “స్త్రీ” లలో కాని, “పురుషులలో” కాని ఇలాంటి భావాలను గమనించాను.. ప్రేమించేటప్పుడు నచ్చిన అలవాట్లు, అభిప్రాయాలు పెళ్లి అనే బంధానికి వచ్చేసరికి పూర్తిగా మరిపోతున్నాయి.. ఇద్దరూ ఒకేదగ్గర కలిసి మెలిసి జీవించేటప్పుడు కలిగే భావాలే ఇందుకు గల కారణం.. 

ఇద్దరిలో ప్రేమ సమాంతరంగా, అనుసంధానంగా ఒక గిన్నెలో నుంచి మరో గిన్నెలోకి.. వెళ్తూ వస్తూ ఉండే నిరంతర తేనే ధారలా కురుస్తూ ఉండాలి.. ఆ ధార ఏవైపు ఆగినా మరోవైపు ఆగినట్లే .. అక్కడితో వారి అనుసంధానం తెగినట్లే లెక్క.. సర్దుకు పోవడం అన్నది ఒక్కరి విషయంలో జరగని పని...అది బ్రతికి ఉండగానే నిర్జీవ శవంతో సమానం.. 

కొంతమంది భర్తలకు.. భార్య అక్కర్లేదు.. పిల్లలు కావాలి.. మరికొందరికి భార్యా, పిల్లలు ఇద్దరూ అక్కర్లేదు..

అక్కర్లేదు అని అనుకున్నప్పుడు ఇంత దూరం ప్రయాణించాల్సిన అవసరం ఏముంది ?? అనేది నా ప్రశ్న ..

ఏది ఏమైనా “స్త్రీ” కాని, “పురుషుడు” కాని తమ తమ విధి నిర్వహణ, కర్తవ్య భాద్యత, ప్రేమానురాగాల విశిష్టత, కష్ట, సుఖ, దుఃఖాల విలువలు, బాధ, సంతోషాల భావాలు, త్యాగం, సర్దుకుపోయే గుణం, మొదలగు ముఖ్య విషయాలను తెలుసుకొని తీరాలి.. 

రెండు చేతులు జోడిస్తేనే అద్బుతాలు జరుగుతాయి.. ఆలోచించండి.. 


స్వస్తి __/\__

Written by : Bobby

No comments:

Post a Comment