Sunday, January 1, 2017

SOCOTRA (The Mysterious Island) from Bobby... 1st Part

SOCOTRA
                                        -The Mysterious Island-


జోరున వాన,
కంటిముందు ఓ పెద్ద మెరుపు.. 
కాసేపు కళ్ళకు అంతా చీకటిమయం…
ఈ లోపలే కర్ణభేరి పగిలేంతలా ఆకాశ గర్జన. ఒక్క క్షణం ఆ, ఆకాశం విరిగి నెత్తిన పడుతుందేమో అన్న సందిగ్ధం…అప్పటివరకు కురుస్తున్న వర్షం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి, తారాస్థాయికి చేరుకుంది.. దేదీప్యమానంగా వెలుగుతున్న ఎలక్ట్రిక్ దీపాలు ఒక్కసారిగా ఆరిపోయాయి.. అంతా అంధకారం వ్యాపించింది ..అప్పుడు సమయం పావు తక్కువ రాత్రి 9 గంటలు కావస్తుంది.. 
ఉదయంనుంచి ఎడతెరిపిలేకుండా వర్షం పడుతూనే ఉందండి సమయం గడిచేకొద్దీ ఎక్కువ అవుతుంది … ఇంతకీ మీరు ఇంతటి వానలో ఎక్కడికి బయలుదేరారు ???… 
అంటూ ముందు నుంచి సన్నని స్వరంతో వాహనం నడిపే ఓ వ్యక్తి.. 



ఒక ముఖ్యమైన పనిమీద వెళ్తున్నాను... మీరు ముందు నేను చెప్పిన ఆ చిరునామా దగ్గరకు నన్ను తీసుకెళ్ళండి.
సమయం లేదు అని వెనుక కూర్చున్న వ్యక్తి కొంచం ఒత్తిడికి లోనౌతున్నట్లుగా సమాధానమిస్తాడు … 
రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళాక వాహనం పక్కన ఆపి ఇదిగోండి సర్ మీరు అడిగిన ఆ క్లాసికల్ రోడ్ … ఆ రోడ్డు ఆవల కనిపిస్తున్న 9 అంతస్తుల భవనములోకే మీరు వెళ్ళాల్సిన చోటు అని వివరిస్తాడు ఆ వాహనం నడిపే వ్యక్తి.. 
ధన్యవాదములు చెప్తూ రెండు వంద రూపాయల నోట్లు ఇచ్చి … అక్కడనుంచి రోడ్డు ఆవలకు వెళ్ళుటకు సిద్దం అవుతూ ఎదురుగా కనపడుతున్న ఎత్తైన భవనం వైపు ఒకసారి చూడసాగాడు….. ఆ భవనం మీద ఎరుపు వర్ణం గల అక్షరాలతో “వొలిని” అని వ్రాయటం చూస్తూ రోడ్ దాటే ప్రయత్నం చేస్తున్నాడు.. పాదం మునిగే లోతులో కింద వర్షపు నీరు ప్రవహిస్తున్నాయి… 


ఏమి వర్షం రా భగవంతుడా ! 
అనుకుంటూ ముందుకు అడుగులు వెయ్యగా …. వరుసగా ఒకదానివెంట మరొకటి మూడు వాహనాలు రయ్యి రయ్యి మంటూ ఆ పారుతున్న పులక నీరుని సర్రుమని చిమ్మి కొడుతూ రెప్పపాటు వేగంతో దూసుకుపోయ్యాయి.. ఆ రెప్పపాటు క్షణంలోనే సగం తడిచిన అతను పూర్తిగా తడిసి ముద్దైపోయాడు.. 

నిండా మునిగినోడికి చలేంది అనుకుంటూ మొఖానికి టపి టపి మని ఈడ్చి కొడుతున్న వర్షపు తుంపరులకు తన అరచెయ్యి అడ్డం పెట్టుకొని ఆ ఎత్తైన భవనంలోకి ప్రవేశించాడు.. 

అతను వెళ్ళాల్సిన అంతస్తు ... 6 వ అంతస్తు … లిప్టు ఎక్కుదామని దగ్గరకు వెళ్ళబోతూ ఒక్కసారి అలా కిందకు చూస్తాడు… తన మీదనుంచి కాలికి వేసుకున్న బూట్లు వరకు ప్రవాహధారలా కారుతున్న నీటిని చూసుకొని ఈ పరిస్థితిలో లిప్ట్ ఎక్కితే బాగోదు అనుకోని, చచ్చాను రా భగవంతుడా ! అని అనుకుంటూ మెట్లను ఎక్కడం మొదలుపెట్టాడు… 

మెట్లకు ఆనుకొని పెద్ద పెద్ద గాజుపలకలు అమర్చివున్నాయి .. వాటిల్లోనుంచి అవతల రహదారి చాలా చక్కగా కనిపిస్తుంది.. ఆహా యెంత అందంగా, రూపొందించారు ఈ భవనాన్ని అనుకొంటూ నిదానంగా తను చేరవలసిన ఆ అంతస్తుకు రానే వస్తాడు.. 

అక్కడే ఒక చిన్న రిసెప్షన్ కనిపిస్తుంది.. అక్కడ నుంచి చూస్తే చాలా దూరంలో వున్న వాహనాల కాంతి ఆ గాజుపలకల మీద పడి బంగారు వర్ణంలా మెరిసిపోతోంది ఆ ప్రాంతం అంతా ..

ఆ రిసెప్షన్ లో ఒక 22 ఏళ్ళ వయస్సు గల ఒక అందమైన అమ్మాయి కూర్చుని వుంది.. 



అక్కడ ఏర్పాటు చేసివున్న క్రొవ్వొత్తి వెలుగులో ఆమెముఖం శోభాయమానంగా ప్రకాశిస్తూ, ప్రజ్వలిస్తోంది... చూడ చక్కని మోము…కూతురు వరుస అయిన ఆ లక్షణమైన అమ్మాయితొ తన గొంతును సరిచేస్తూ, అమ్మా ! అంటూ తన దగ్గర వున్న తడిచి ముద్దైన ఒక రసీదును ఆమెకు అందిస్తాడు.. 

ఆమె దాన్ని ఇబ్బందిగా, చిరాకుగా తీసుకుంటూ తనవద్ద వున్న కాగితాల కట్టలోనుంచి ఒక చిన్నని అంటించి వున్న కవర్ని తీసి అందులో వున్న “ప్రసన్న కుమార్ భాటియా” అనే పేరు చదువుతుంది.. 

ఆ నేనే అమ్మా అని అంటాడు ప్రసన్న కుమార్ భాటియా.. 

ఇదిగోండి ఈ కవర్ లో లాయర్ గారు మిమ్మల్ని ఎప్పుడు కలుస్తాడో వివరంగా పొందుపరిచి వుంటుంది.. ఆ సమయానికి మీరు తప్పక కలవండి అని చెప్తుంది.. సరే అమ్మ అంటూ వెనుతిరిగి వెళ్తాడు ప్రసన్న కుమార్ భాటియా… ఇంటికి వెళ్ళాక ఎన్నో ఆలోచనలు చేదు జ్ఞాపకాల పరంపర .. తన భార్య, తండ్రి, తల్లి ముగ్గురూ ఒకేసారి ప్రమాదవశాత్తు అకాలమరణం పొందుతారు.. 

ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ.. 

నా పేరు ప్రసన్న కుమార్ భాటియా, నేను విజ్ఞాన శాస్త్ర అధ్యాపకుడను .. 

నాకు ముగ్గురు కుమారులు.. 

మొదటి వాడు మహాతుంటరి వాడు.. వాడి పేరు ఆకాష్.. 

రెండవ వాడు వాగుడుకాయ్ వాడిపేరు లోకేష్.. 

మూడవ వాడు అమాయక చక్రవర్తి వాడిపేరు సంతోష్.. 

ఈ ముగ్గురే నా జీవితం... 

నా కంటూ మిగిలిన నా కుటుంబం .. 

ఈ ముగ్గురు పిల్లలు చిన్న వయస్సులో వున్నప్పుడు ఒక ఘోర వాహన ప్రమాదం జరిగింది.. ఒక్కసారిగా వొంటరి వాడిని అయిపోయాను..అప్పటివరకు అందంగా కనిపించిన నా ప్రపంచం ఒక్కసారిగా అందవిహీనంగా కళా, కాంతి లేకుండా పోయింది.. అప్పుడు వీరి ముగ్గురి భవిష్యత్తు నా కళ్ళముందు కదులాడుతూ కనిపించింది.. వెంటనే ఆ సంఘటన నుంచి తేరుకొని వీరికోసమే బతకడం అలవరుచుకున్నాను .. నన్ను నేను మార్చుకున్నాను… 

నాకు కొన్ని కొన్ని ప్రయోగాలు చెయ్యడం అలవాటు.. విజ్ఞానాన్ని వినోదంగా భావించాలనే దృక్పధం కలవాడిగా ఒక మంచి గుర్తింపును నా పాఠశాల శిష్యులు నాకు అందించారు.. ఆ వినోదాన్ని ప్రతీ నిత్యం ఆస్వాదించే గుణం నా సుపుత్రులు నాకు కలిగించారు.. ఇదే నా అందమైన కుటుంబం.. 

అందరం మగరాయుల్లమే..

ఇంట్లో అన్నీ పనులు మేము నలుగురమే చేసుకుంటాం.. స్వంత ఇల్లు, నాకు నచ్చే, నేను ఇష్టపడే అందమైన ఉద్యోగం, అన్నిటికీ మించి నన్ను గౌరవిస్తూ, ప్రతీ విషయాన్ని నాతో పంచుకునే నా కుటుంబం.. ముగ్గురు పోయినా భగవంతుడు మరో ముగ్గురిని ప్రసాదించాడు.. కృతజ్ఞతలు ఆయనకు చెప్పి తీరాలి మరి.. 

నేను ఆలోచించే విషయం ఏంటంటే రేపు ఉదయాన లాయర్ గారిని కలవాల్సి వుంది.. 

మా తాత గారు అయిన చిన్మయానంద్ భాటియా.. ఒక సీల్డు కవర్ వీలునామా రాసివుంచారు .. 

సీల్డు కవర్ వీలునామా అంటే ఒక వ్యక్తి తన యావదాస్తులను, వగైరా తనకు సంబంధించిన చరాస్తి కాని, స్థిరాస్తి గాని ఎదైననూ ఆయన తదనంతరం ఎవరికి చెందాలో వారికి వ్రాసి ఒక మధ్యవర్తి అయిన లాయర్ గారికి లేదా కోర్ట్ వారికి అప్పగించి ఆ కవర్ని లక్కతో సీలు చేసి వారి సమక్షంలో వుంచుకోవడాన్ని సీల్డు కవర్ వీలునామా అంటారు.. రాసిన వారి తదనంతరం ఆ ఆస్తి ఎవరికి చెందాలో వారికి చెందుతుంది.. 

మరో ముఖ్య విషయం.. ఎవరికి రాసారో వారు మైనర్లు గా ఉన్నపక్షంలో ఆ సీల్డు కవర్ తీయడానికి అనుమతి లేదు.. మైనర్లు గా వున్నవారు మైనారిటీ తీరి మేజర్లు అగునంతవరకు ఆ వీలునామా అలానే వుంటుంది.. ఇప్పుడు ప్రసన్న కుమార్ భాటియా అయిన నాకు మరియు నాకు కలుగబోవు సంతానానికి ఆ సీల్డు కవర్ వీనునామ అందేలా మా తాత గారు అయిన చిన్మయానంద్ భాటియా గారు తిరకాసుగా రాసిపెట్టి పరమపదించారు.. నా కుమారులు ముగ్గురూ ఈ మధ్యనే మైనర్లు తీరి మేజర్లు అయినారు కనుక ఆ వీలునామాలో ఏం రాసుందో తెలుసుకునే సమయం ప్రస్తుతం ఆసన్నమైనది.. అది రేపే అని చాలా కుతూహలంగా వుంది.. ఇవే ఆలోచనలతో ఆ రాత్రి మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు ప్రసన్న కుమార్ భాటియా…


To be continued … 


Written by : BOBBY

12 comments:

  1. Good starting... very interesting.. bro... continue...
    Sriraga
    www.quotesgardentelugu.in

    ReplyDelete
  2. బాగుంది,కంటిన్యూ����

    ReplyDelete
  3. Starting bagundi gear vesi speed penchu

    ReplyDelete
  4. Starting bagundhi boby.. story mottham athani kalalo gadipelaa cheyyaku...aa voohalloki mammalni kooda theesukell..

    ReplyDelete
    Replies
    1. yaa ippude kada parichayam.. anduke ala vuntundi.. taruvatha meere chustharu kada.. thank u soo much sir..

      Delete
  5. Gud starting very interesting nice story sir

    ReplyDelete
  6. Good & nice anna garu
    Continue...

    ReplyDelete