Wednesday, May 22, 2019

ఓయ్ “లేక్షణా”




నా చేతులు చాచి 
కళ్ళుమూసుకునివున్నా 
కలలు కనడానికి కాదు 
గాల్లో ఎగురుతూ ఎక్కడినుంచో వస్తున్న 
నీ కబురును నా నుదిటిపై చుంబించుకునేందుకు..! 

నువు వీడిన తరువాత 
నాలోని భావ ఊపిరులు ఆవిరై పోతున్నట్లు 
నా భావుకత ప్రాణాలకోసం గిలగిల్లాడుతున్నట్లు 
నా కవిత్వ జల ఉడిగి పోతున్నట్లనిపిస్తుంది.. 
అయినా సముద్రానికి అటువైపు ఒడ్డున వున్న నీకు 
నా ఎడారి తహతహ అర్ధం కాదులే..! 

నా అరచేతుల్లో గుండెను పిండుకుంటే తప్ప 
ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలటంలేదు.. 
నా కళ్ళలో ఆర్ద్రత కనిపించట్లేదు 
ఓయ్ “లేక్షణా” 
కనుమరుగైపోయాయే నాలోనివన్నీ...! 

నా చుట్టూరా యాంత్రిక నేత్రాల నటనలే 
నా భావాల దీర్ఘిక లో 
ఎన్ని మాటలను తోడుతున్నా 
ఇష్టమైన మాట ఒక్కటీ కానరావట్లేదే 
ఆర్తిగా నన్ను హత్తుకునే మాట 
స్వచ్చమైన ప్రేమను కలిగిన మాట 
స్పటికంలాంటి మధురమైన మాట..! 
అయినా కూడా దారాల్ని పేనుతూ నా మాటల్ని తోడుతూనే వున్నా, 
ప్రాణాల్ని నిలబెట్టుకోవాలని, మధ్య మధ్యలో కాస్తంత కవిత్వాన్ని చప్పరిస్తున్నా, 
పద మధురిమల కోసం శబ్దాలను అధ్యయనం చేస్తున్నా, 
నీపై రాసిన అక్షరాల్ని వడబోస్తున్నా, వాటిని ధ్యానిస్తున్నా, 
మోక్షం కోసం మాత్రం కాదే .. 
ఒకే ఒక్క ... అక్షర బిక్ష కోసం.. 
నా మానసాకాశాన్ని చేతులు చాచి అర్ధిస్తున్నా, 
రేపటి నా కవితా ప్రస్థానాన్ని తిరిగి కొనసాగించేందుకు..!!

Written by : Bobby Nani

1 comment:

  1. కవిత్వాన్ని చప్పరించడం . ఈ ప్రయోగం తెలుగు సాహిత్యం లో ఒక విశిష్ట మైలురాయి గా నిలిచిపోతుంది.

    ReplyDelete