ఈ మధ్య కొందరి వాదన చూసాను..
భార్య, భర్తలు అలా ఎందుకు వుంటున్నారు, ఇలా ఎందుకు వుండకూడదు అని..!!
ఆ వాదన చేసినోళ్ళు పరిపక్వత పొందివుంటే నేను ఈ వివరణ వ్రాయాల్సి వచ్చేది కాదు..
ఇందులో ద్వందాభిప్రాయాలు కాని, లింగ వివక్షతలు కాని లేవు.. ఏ ఒక్కరినో ఉద్దేశించి ఇక్కడ వ్రాయలేదు.. స్త్రీ, పురుషుడు ఇద్దరిలో ఎవరు లేకున్నా సృష్టిఆవిర్భావమే లేదు.. కనుక ఇద్దరినీ ఉద్దేశించి మాత్రమే రాసాను.. సావధానుడవై అధ్యయనించు..!!
యజమాని, బానిస సంబంధాలే భార్యాభర్తలను జడుఁల్ని చేస్తున్నాయి..అందుకే రసస్పందన కోసం ఒకరికొకరు తడుముళ్ళాడవలసి వస్తోంది.. ముందు ఈ వైఖరిని విడిచి పెట్టాలి.. మీ ఇద్దరిలో ఎవరూ ఎవరికీ బానిసా కాదు యజమానీ కాదు..ఉభయులూ ఒకరికొకరు క్షణం ఎడబాటు కూడా సహించలేని స్నేహితులు కావాలి. స్నేహమే మధురమైన సంబంధం.. స్నేహమే ఒకరిలో ఒకరిని లీనం చేసే సాధనం..
సహృదయులే, స్నేహశీలత్వం, నిత్య సంతోషం, దయ, అనురాగం ప్రదర్శించగలిగిన మగవాణ్ణి స్త్రీ ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే వుంటుంది.. అతని కౌగిట్లో వెన్నలా కరిగిపోతుంది.. అతని స్పర్శతో పులకరిస్తుంది..సౌందర్యజిజ్ఞాసువులైన భార్యాభర్తల గాఢపరిష్వంగములో మరే ఆర్తనాదాలు వినపడవు.. కిలకిల ధ్వనులు తప్ప..
ప్రతీ పురుషుడూ స్త్రీ కోసమే సృష్టించబడ్డాడు.. అలానే ప్రతీ స్త్రీ పురుషుని కోసమే సృష్టించబడింది .. యవ్వనం వారి కలయిక కోసమే నిర్దేశించబడింది.. ఈ సత్యం తెలియని వాడు దుఃఖ భాగుడు, అసంతృప్తజీవుడు .. తను అనుభవించలేని, ఆఘ్రాణించలేని పుష్పాన్ని భగవదార్పితం చేసినట్లు కొందరు భార్యాభర్తలు వారి యవ్వనాన్ని వ్యర్ధం చేస్తున్నారు.. అందుకు గల కారణం అహం అనే చీడ పురుగు వారిని మోహించి ఉండటమే..
నవ జీవనం, నవ భావం, నవ దర్శనం మానవుల పవిత్ర శృంగార రసనిష్పన్నతలోంచే పుట్టుకొస్తాయి.. జీవితం పూల పాన్పు కాదు.. దుఃఖభూయిష్టమైనది.. ఎన్నో బాధలు, శ్రమలూ పడనిదే రోజు గడవదు నేడు.. అయినా ప్రతీరోజు ప్రతీ పురుషుడూ తన భార్యలో కొత్తదనాన్ని చూడనేర్వాలి.. అలానే ప్రతీ స్త్రీ తన భర్త నుంచి కొత్త అనుభూతిని గ్రహించాలి. ఆ స్త్రీ పురుషులిద్దరూ ఏకమైన ప్రతీ దఫా వారి మనసిక నిషేదాలు తొలగిపోవాలి.. ప్రశాంతమూ, ప్రగాఢమూ, అయిన కొత్త వ్యక్తిత్వం పొటమరించాలి..
నేటి యువతరం దుర్గమకీకారణ్యంలోంచి పయనిస్తోంది.. దారిలో అక్కడక్కడా కొన్ని హెచ్చరికల సైనుబోర్డులు కనిపిస్తూనే వున్నాయి, తప్పుదారుల్ని సూచించే కూడలి సూచికలు కూడా కనిపిస్తూనే వున్నాయి.. అదే నిజమైన మార్గమని పంథా తప్పిన వాళ్ళు చాలామందే వున్నారు.. స్వజాతి సంపర్కం, వ్యభిచారం వంటి మార్గాలలోపడి దారి కానరాక కొట్టుకుంటున్నారు.. బూతుకథాసాహిత్యం చెలరేగి అతన్ని/ఆమెను ఉన్మాదిని చేస్తుంది.. చిత్రాలలో స్త్రీలను చెరిచే సన్నివేశాలు అతనిలో పాశ్వికకామాన్ని రెచ్చగొడుతున్నాయి.. వ్యభిచారిణులు మగడు చెయ్యి పట్టుకొని లాక్కేల్తున్నారు.. జులాయి మగవారు ప్రేమపేరుతో స్త్రీలను చెరిచి, లేవదీసుకుపోయి వ్యభిచార గృహాలకు అమ్మివేస్తున్నారు.. యవ్వనంలో ప్రవేశించే యువతీ, యువకుల మనస్సులపై ఈ బూతుకథాసాహిత్యం విషంలా పనిచేస్తుంది.. ఈ దురదృష్టకర వాతావరణాన్ని నిర్మూలించడం చాలా అవసరం.. లేకుంటే ఈ యువతరాని జీవితంపై సమగ్ర దృక్పథం ఏర్పడదు.. సౌందర్య జిజ్ఞాస అంకురించదు. వారి శరీరాలు, మనస్సులు ఆరోగ్యంగా ఉండవు.. ఆదర్శ దాంపత్యానికి సంబంధించిన విజ్ఞానాన్ని, నిర్భయంగా యువతరం చర్చించి, సరియైన వైఖరి అవలంబించేలా చేయడం సంఘసేవకులకు, వైద్యులకు బాధ్యత కలిగివుండాలి..
ఆలింగన, చుంబన, నఖక్షత, దంతక్షతాది బాహ్యరత విధానాలు, అంతరరతి విధానాలు చదువుకున్నంత మాత్రాన ఎవడూ రతిలో సమర్ధుడు కాలేడు ..
బ్రాహ్మణ బ్రహ్మచారి సోదరా ఒకటి గుర్తుపెట్టుకో..
ఈత ఎలా ఈదాలో చదివినంత మాత్రాన ఈదగలడా ?? ఈతను నేర్చుకోవాలి.
ఈతను నేర్చుకోవాలంటే చెరువూ, గురువూ వుండాలి. అలాగేరతి విషయంలో కూడా, భయబ్రాంతులైన భార్యాభర్తలు సఖ్యత మీద అనుభవం, అనుభవం మీద ఆస్వాదన కలుగుతాయి.. పెళ్ళికి ముందే కొందరు త్వరపడిపోవడం వల్ల నిజమైన ఆనందాన్ని, ఆస్వాదనను అందుకోలేక పెళ్లి అయిన తరువాత సహచారితో సఖ్యత లేక విడాకుల దాకా పోయిన కేసుల్ని, విడాకులు తీసుకున్న కేసుల్ని నేను నా యొక్క ఆఫీను నందు ఎన్నో చూసాను..
సారభూతమైన జీవస్పందనను గ్రహించగల శక్తి గల వాళ్ళు,
స్పందించే స్వభావంగల వాళ్ళు దాంపత్యజీవితకైవల్యాన్ని చేరుకోగలరు.. భూమ్యాకాశాలను రెండిటినీ ఏకం చేయగల అపూర్వానుభూతి దాంపత్య మాధుర్యాన్ని సమగ్రంగా చదివి చవిచూచినవారికే కలుగుతుంది,, స్పర్శద్వారా అస్పృశ్యమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని గ్రహించి స్త్రీల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అవసరాలను సంతృప్తిపరచగలిగిన వాడు దైవాన్ని సైతం మెప్పించగలడు ఇది సత్యం.. ఇదే సత్యం..
భార్యాభర్తల మధ్య కుళ్ళు జోకులు, సెటైర్లు , వెధవ పోస్టులు పెట్టె ప్రతీ వరాహ సౌందర్యులకు ఈ నా వివరణ ఓ చెంపపెట్టు కావాలి.. భిన్నమైన మనుషులు, విభిన్నమైన ఆలోచనలు, వేరు వేరు అలవాట్ల నుంచి వచ్చిన ఓ ఇద్దరు కడదాకా ఎన్నో కఠిన సమస్యలను శ్రమలను అధిగమిస్తూ ఒకే ఇంట్లో సహజీవనం చెయ్యడం అనేది మామూలు విషయం కాదు.. ఆ బంధానికి గౌరవం ఇవ్వండి..
ఇంకా చాలా రాయాలనుంది కాని ఇంతటితో స్వస్తి __/\__ పలుకుతున్నాను..
This Article Written by : Bobby Nani
Don't Copy this article copy rights are reserved
No comments:
Post a Comment