ఎవరు నీవు?
**********
అస్తమించే సూర్యబింబాన్ని
ఆనందం విడిచే ఆకాశాన్ని
అవలోకించే సమయాలలో
నా కనులలోకి తొంగి చూస్తూ
మౌనంగా నీడ బొమ్మవై
నిల్చుంటావు ఎవరు నీవు.. ?
ఉదయించే చంద్రబింబాన్ని
విషాదం విడిచే ప్రవాహాన్ని
అవలోకించే సమయాలలో
నా కనులముందు రెక్క విప్పిన
మల్లె పూలపై తుమ్మెదలవలె
పరిభ్రమిస్తుంటావు ఎవరు నీవు ..?
వెలిగే తారా దీప శిఖలు
నీలాకాశాన్ని విడిచిపోయే వేళ
వృక్ష వర్షీయసి, పండిన
ఆకులు కోర్కెలు విడుచువేళ
కాలాన్ని మ్రింగిన చీకటిలా
శైశిర విచార వాయువులా
నెమ్మదిగా వచ్చి వెళ్తుంటావు .. ఎవరు నీవు ..?
గాలిలో ఎగిరే పావురం లా
నా పాటలు వినిపిస్తుంటే
భూమిలో దాగి పోదామని
అనుక్షణం ఆరాటపడే నదీ
తరంగాల్లా శబ్ధిస్తూ, వేగంతో
అసహనంతో పరుగిడుతుంటావు.. ఎవరు నీవు ..?
నిన్ను చూడగానే నా గుండెలో
పూలు పూచి, కనులనుండి రాలి
కొంతసేపు గాలిలో ప్రయాణించి
అంతలో చీకటిలో కలిసిపోతాయి
గగన వీధి విరిసిన పాలవెల్లిలా
నా మస్తిష్కములో, మేల్కొని వున్న
ఊహలు అల్లే కలలు, చలించడం
మాని, ఒక్కమారు నిదురపోతాయి
దీనతాభావం రూపుగొన్న
చీకటి, అందులో సగం వెలుగు
దెయ్యమా ?
లేక దేవతా ??
ఎవరు నీవు..
ఎంతకూ చెప్పవేం..??
భూమ్మీద ఎక్కడో నివసించే
నా కంటికి కన్పించే, సూర్య
చంద్ర బింబాలు, చీకటి ముద్దలా
మబ్బుముక్కల్లా నీకు కనిపిస్తున్నాయా ?
అయితే నా కళ్ళతో చూడు..
దీపానికి నీడ ఎంత దూరమో
నాకు అంత దగ్గరలో, వెలుగు
మేడ క్రింద చీకటి మబ్బుల
నిచ్చెనవలె, నిల్చిన నీకు
నా మాటలు వినిపించడం లేదా ?
నా ఆంతర్యం కనిపించడం లేదా ?
పెహ్ ..నీకన్నా శిలే నయం..!!
Written by: Bobby Nani
మాటల్లేవు!! ఆశ్వాదించడమే !! అంతే :)
ReplyDelete