Thursday, March 28, 2019

తరళేక్షణ



ఈ వర్ణన మీకు అర్ధం అవుతూనే అర్ధం కాకపోవచ్చు.. ప్రతీ పదాన్ని నిదానించి చదవండి తప్పక అర్ధం అవుతుంది.. అర్ధం చేసుకోగలిగితే మీ మనసుకు నచ్చే మధుర పరిమళముగా ఉండిపోతుంది.. రాధ మాధవులను ఉద్దేశించి కాబట్టి పూర్వపు పదాలతోనే వ్రాయడం జరిగింది.. ఆ పదాల అల్లికలే అత్యంత మధురిమలుగా, నవనీతములుగా వారి అజరామర ప్రేమకు, ప్రణయానికి తార్కాణమై నిలుస్తాయి.. అప్పుడప్పుడు వాడుక భాషనే కాదు ఇలాంటి పాత పదజాలాన్ని కూడా గమనిస్తూ వుండండి.. అందరూ వెళ్ళే దారిలో మీరూ వెళ్తే ఎలా.. భిన్నముగా ఉండొద్దూ ..!! 

తరళేక్షణ
*******


ఏమి లావణ్యమో 
మేమి తారుణ్యమో 
ఎన్నెన్ని లోకాలలో 
ఎంతెంత వెదకినా 
ఇంతటి అందాన్ని చూడగలమా .. !
ఈ అందమును వర్ణింపగలమా..!


కబరీభరమ్మును చూచి
కవి కన్నీరొలుకు 
చారు ముఖమును చూచి 
శశి మబ్బు మాటుగొను 
తళ తళమ్మని మెరయు 
దవళ దంతపు పంక్తి 
చుక్కలనే చుల్కనగ 
వెక్కిరించుచునుండే ..!!
అందాల చెక్కిలిని 
ముద్దాడగ లేక 
చెవిప్రక్క రోమాళి 
సిగ్గుతో మెలిదిరిగి కూర్చొనే ..!!
ఎవరీమె?
రతియా లేక 
పార్వతియా లేక 
శ్రీ సతి యా..!!


మల్లె మొగ్గలవంటి 
తెల్లనగు పలువరుస 
చిరునగవు లొల్కు 
బోసెడు చిగురు పెదవులు 
నిండు పున్నమి శశిని 
నిరశించు నెమ్మొగము 
నల్ల కలువల మించు 
నయనాల సోయగము 
స్తనమండలముపై 
సయ్యాడు మణిహార మది 
దాని భాగ్యమే సఖీ..!!


ఏమని పొగడగలను 
మేమని వర్ణించను 
క్రొంజెక్కుటద్దాల కుండలంబుల 
ధగధగలతో నీ నేత్రములు 
మిరిమిట్లు గొనె..!!


కఠినమై వట్రువై 
గట్లవలె ఎత్తు ఎదిగి 
ఒత్తుకొని యెండొరుల 
యొరసికొని బరువుతో 
కొంచముగ కదలాడు 
గురుకుంభకుచయుగము..!!


పుడమినే తలదన్ను 
వెడల్పైన జఘనమ్ము 
విల్లులా నీల్గి వంగిన 
అర్ధ పిడికెడు నడుము 


ముద్దారు నునుపైన 
అద్దాల చెక్కిళ్ళు 
చెంగలించుచు నొసట 
చెన్నారు ముంగురులు 
తళతళమ్మని మెరయు 
సంపెంగ మొగ్గతో 
సరితూగు నాసికయు 
పక్వబింబ ఫలంబు 
వంటి బింబాధరము 
అబ్బబ్బ ఏమని వర్ణింప 
మేమని ఆరాధింప..!!

Written by: Bobby Nani

1 comment:

  1. చిన్న వయసులోనే ఇంత పాండిత్యం ఎలా సంపాదించావు బయ్యా. అయితే ఆ విద్వత్తు స్త్రీ అంగాంగా వర్ణనకు ఉపయోగించడం బాగాలేదు బయ్యా.

    ReplyDelete