తనను చూసి ఎన్నాళ్లైందో..
తన నోటినుంచి మాటల ద్రాక్షపండ్లు రాలి,
ఆ రాలిన నవ్వుల ద్రాక్ష రసంలో నే మున్కలేసి ఎన్నాళ్లైందో
తనముందెప్పుడూ నేను నెలల బాలుణ్నే
తన ఒడిలో నే తలవాల్చినప్పుడు నా
ఛాతిమీద పడు ఆ కురులతోనే నేనాటలాడేది
అమాసనాటి చిమ్మచీకట్లలో పండువెన్నెలలా
ఆ నల్లని కురుల మధ్య ఆమె మోము
ఉదయించే రవి బింబంలా దేదీప్యమానమై కనపడుతుంటుంది..!!
తన తలంపు తగిలితే చాలు
అలా సంద్రం వెంట ఇద్దరం నడిచివెళ్తున్న అనుభూతి
నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది .. చంటి పిల్లాడి చేతిలో
పీచుమిఠాయిలా ఎదురుగానున్న సంద్రం మమ్ము చూచి
కేరింతలు కొడుతూ కనిపించింది
మా వెనగ్గా సూర్యుడు ముద్దమందారమై ఎర్రగా నవ్వుతున్నాడు..
ఒక్కసారిగా నాలో వేయి వోల్టుల విద్యుల్లత మెరిసింది..!!
సంద్రంలోంచి అకస్మాత్తుగా నడిచి వచ్చిన
కాంతి ద్వీపంలా ఆమె నాకు కనిపించింది.
నా ఎదురు చూపుల్ని చీల్చుకొచ్చినట్లు అనిపించింది..
ఇసుకలో గూళ్ళు కట్టుకుంటూ,
ఒకరినొకరం ఆవేశంగా హత్తుకున్నాం..
మా ఇద్దరికోసమే అన్నట్లు
ఈరోజు సంద్రం నిర్మానుష్యంగా వుంది..
ఒకరి పరుగులో మరొకరం వొగురుస్తున్నాం
ఒకరి నవ్వులో మరొకరం శ్వాసిస్తున్నాం
సంద్రాన్ని జారుడుబండ చేసుకొని
కెరటాల మీద జర్రున జారుతున్నాం
బద్దకంగా ఆవలిస్తూ,
బరువు కళ్ళతో చేర బిలుచుకుంటున్నాం
ఒకళ్ళనొకళ్ళు చూచుకుంటూ ఒళ్ళంతా కళ్ళు చేసుకుంటున్నాం
తను సంద్రంలా నురగలు కక్కుతూ వుంది
నేను సూర్యునిలా ఎరుపెక్కిపోతూ ఉన్నాను
మబ్బులు కమ్మకపోయినా
చీకటి మాత్రం ఆకాశం మీదకు ఒరిగిపోయింది..
ఇద్దరం అమాంతం చంద్రుణ్ణి ప్రసవించినట్లున్నాం
అతగాడు మెల మెల్లగా అడుగులు వేస్తున్నాడు
దొర్లించిన రూపాయి నాణేల్ని తన చుట్టూ విసిరేసుకొని
అదే పనిగా ఆడుకుంటూ..!!
Written by : Bobby Nani
ఇద్దరం అమాంతం చంద్రుణ్ణి ప్రసవించినట్లున్నాం. -,��
ReplyDelete