మహానగరాలలో యదేచ్చగా జరుగుతున్న కొన్ని పరిణామాలలో .. ఈ సిటీ బస్సుల స్వైర విహారం కూడా ఒకటి.. ప్రతీ ఏటా వేల ప్రాణాలు ఈ భారీ చక్రాల కింద నలిగిపోతున్నాయి.. నల్లని రోడ్లు నెత్తురోడుతున్నాయి.. మధ్యతరగతి వాడి వెన్నును విరుస్తూ, అవినీతి, లంచం అనే రెండూ పురుగులు రాజ్యమేలుతున్నాయి..ఆలోచించే నాధుడు, ఆచరించే మాధవుడు ఇద్దరూ కనుమరుగే.. !
కొన్ని రోజుల క్రితం కళ్ళముందు జరిగిన ఓ సంఘటన యధాతధంగా అక్షరాలుగా మలిచాను.. ఒక్కరైనా ఈ నిర్లక్ష్య ధోరణిని మారుస్తారేమోనని ..!!
నల్లశాలువా
*********
చలికి సూర్యుడికి కప్పిన ఎర్ర శాలువా
తూర్పు సంధ్య తొలగించి మేల్కొలిపింది..
తను లేవకమునుపే నిద్రలేచి నడుస్తున్న
లోకాన్ని చూచి
జాలిపడ్డాడు సూర్యుడు
విద్యుక్త కార్యానికి ఉద్యుక్తుడయ్యాడు
దేశ సంపద అరవై కుటుంబాలకే హస్తగతమైనట్లు
నగర వాసుల ప్రాణాలు
సిటీ బస్సుల చక్రగతమై పరిభ్రమిస్తున్నాయి
చక్రాలే కానీ బ్రేకుల్లేని బస్సుల మధ్య
ప్రాణాలు ఇనప్పెట్టెలో దాచుకున్నా
ఫలితం దక్కకుండా ఉంది..
భవిష్యత్తును బ్యాగులో దాచి
మరణ మృదంగాల మధ్య
అక్షరాభ్యాసం కోసం జనారణ్యంలో
అడుగులు వేస్తున్న బాలుని బ్రతుకు
అదుపుతప్పిన బండికింద
అర్ధాంతరంగా ముగిసి
నల్లని తారురోడ్డు మందారంలా మారింది..!!
జన నియంత్రనే లక్ష్యమై రవాణాధికార్లు
నగరాన్ని నేరస్తులకు అంకితం చేసిన పోలీసు యంత్రాంగం
తప్పొప్పుల పట్టికలో,
ఒప్పుల కిరీటం తప్పులకు కట్టబెట్టి మెల్లిగా జారుకుంది..!!
మనఃక్లేశాన మరణించిన సూర్యుడిపై నల్లశాలువా కప్పి
పడమటి సంధ్య గుక్కపెట్టి రోధిస్తూ ఉంది..
చనిపోయిన బాలుని శవం
అంతిమ యాత్రకు బయలుదేరగా
చిదిమేసిన బస్సు
స్వైర విహారానికి కదిలి ఎదురైంది...!!
Written by : Bobby Nani
No comments:
Post a Comment