Wednesday, August 15, 2018

ఆమె సామాన్య స్త్రీ కాదు...



ప్రతీ స్త్రీ మూర్తిలోనూ ధర్మత్వం, దైవత్వం, మాతృత్వం, రసికత్వం, వ్యక్తిత్వం ఇలా ప్రతీ కోణంలోనూ ఆమె వికసిస్తూ ఉంటుంది.. ఆమె అంతరంగాన్ని చూడగలగాలే గాని తనని మించిన దైవం ఉండదనిపిస్తుంది .. అందుకే ఓ కవి ఇలా అన్నాడు బ్రతుకు ముల్లబాటలోన్ జతగా స్నేహితురాలవయితివి ....కన్నీళ్ళు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లెవైతివి....వెనక ముందు రాలినప్పుడు వెన్నుతట్టిన బార్యవైతివి....పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లివైతివి.. కష్టంలో ముందుండి.... సుఖంలో క్రిందుండి....విజయంలో వెనకుండి ....ఎల్లప్పుడు పక్కనుండేదే స్త్రీ... వారిని వర్ణించడం, సత్కరించడం తుదకు నమస్కరించడం కూడా మనకు తెలిసుండాలి అని విన్నవిస్తూ, ఈ చిరు సత్కారం..!!

ఆమె సామాన్య స్త్రీ కాదు
బ్రహ్మచే పంపబడిన ఒకానొక సౌందర్య శక్తి 
ఆమె మేను ఎర్రని లేత చిగురు కాంతి లా, 
చక్కగా వికసించిన మోదుగు పువ్వులా
ఎర్రనైన వంపుతిరిగిన ఆమె అధరములు 
కుంకుమ కాంతిని వర్షిస్తుంటాయి..!!

కుచముల మొదలు నాభి సరస్సు వరకు 
ఆమె నూగారులు నల్ల త్రాచు పిల్లలవలె, 
చలిచీమల బారుల వలె నాచుతీగలవలె 
అత్యంత రసికత్వాన్ని రంగరిస్తూ 
లోకోత్తర లావణ్యరూపిణిలా 
మధుకము వంటి నడకలతో, 
పూర్ణవికసిత బంగారు పద్మముల వంటి పాదాలతో, 
కోకిల స్వర మాధుర్యాన్ని అధిగమిస్తూ, 
ఒక్కింత గర్వమును, 
ఒక్కింత సరస రసమును 
కటీరములపై ఒలకబోస్తూ, 
తుమ్మెద వరుసల వంటి శిరోజాలను 
లయబద్దముగా నాట్యము గావిస్తూ 
నర్తించు ఆమె సొగసులు 
సాధువునికి సైతం మనఃపలకముపై 
చెరగని ముద్రను చిందించగలవు...!!

ఆమె నడుముకు చుట్టిన గంటల మొలనూలు, 
ఆ పాదాలకు అంటిన రత్న భూషణములు, 
ఆమె వక్షఃస్థలముపై ముక్తాహార విందములు, 
నాభిన వ్రేళ్ళాడు సౌందర్య ముత్యపు పుట,
పాదాలకు అంటిన అందియల హారములు, 
ఆమె నఖశిఖ పర్యతము మైనపు పూత పొదిగిన
కనకాంబరపు కాంతులను వేవేల వర్ణములు గావించినా 
తనివితీరదెందుకనో..!!

Written by : Bobby Nani

2 comments:

  1. సార్ మీరు అభినవ కాళిదాసే.
    సందేహం లేదు.
    చాలా చక్కగా ఉంది పదాల కూర్పు.

    ReplyDelete
  2. సత్కారం అంటూ అంగాంగా వర్ణన చేయడమేమిటి బయ్యా

    ReplyDelete