Thursday, June 7, 2018

రాలుతున్న చినుకు చెప్పే ఏకాంత కావ్యం..


రాలుతున్న చినుకు చెప్పే ఏకాంత కావ్యం..
*******************************


మట్టికీ, వర్షానికి వున్న అనుబంధం ఎంతో గొప్పది 
పురుడుపోసే మంత్రసాని వలె మట్టి మారగా... 
వాడిపోతున్న పచ్చదనానికి వన్నె తెచ్చే సంజీవనిలా 
వర్షం మారుతుంది.. !!


తల్లికి బిడ్డకు వున్న ఓ వారధిలా 
ఆకాశానికి నేలకు మధ్యన వర్షపు ధారలు… 
ధారులుగా వెండి జలధారగా 
కన్నులకు కనపడే ఓ అద్బుత దృశ్యమాలిక అది..!!


వర్షపు చినుకులు ఒక సమతా సూత్రం లా 
ఆకాశాన్ని, నేలను కలిపి కుట్టే 
నీటి దారాల కండెలా కళ్ళకు కనపడుతూ 
వర్షపు చినుకులు ఆకాశ గుండెను చింపుకుని 
నేల మీద నీటి దీపాలుగా జలజలమని 
రాలుతున్న ఆ కమనీయ దృశ్యాన్ని చూస్తే ఎవరైనా 
పసి హృదయంగా మారిపోవాల్సిందే..!!


పాయ పాయలుగా పారుతున్న నీటిపై 
ఒక్కసారిగా పడిన వర్షపుచినుకులతో ఏర్పడే 
నీటి బుడగలను ఊహించడం, 
వాటిని అక్షరీకరించడం 
కోవిదునికి కూడా అసాధ్యమే..!!


బీద, ధనిక, గుడిసెలపైన, 
భవంతులపైనా, 
సముద్రము మీద, 
బీడు భూమి మీద, 
చండాలుడి మీద, 
మహా జ్ఞాని మీద కూడా వర్షం ఒకేలా కురుస్తుంది...!!
ఇలాంటి సమాంతర వ్యవస్థ మనుషుల్లో 
ఎప్పుడు వస్తుందో అనే ఆలోచన 
ఈ వర్షాన్ని దర్శించిన ప్రతీ సారి 
నాలోలోన ఉదయిస్తూనే ఉంటుంది..!!


వర్షాన్ని ఈ వేడి తాపపు వేసవిలో 
ఆస్వాదించడం ఒక వరమనే చెప్పుకోవాలి.. 
మట్టి పరిమళాన్ని శ్వాసిస్తూ,
ఒకే గొడుగు క్రింద బసచేసి, 
గుండె బాసలు విప్పుకుంటున్న 
నేటి యువ జంటలకు రాయబారి ఈ వర్షం … !!


“చిటపట చినుకులు పడుతూవుంటే” 
అనే పాట దశబ్దలుగా రంజింపచేస్తూనే ఉన్నా
ప్రేమ జంటలు, 
నవీన దంపతులు ఒకే గొడుగును పంచుకోవడంలో 
కలిగే తడితనమూ, చలితనమూ మధ్య 
స్పర్శతో పుట్టే వెచ్చదనముకు రాయబారిగా 
ఈ వర్షం మారుతుండటం మాత్రం నేటికీ కొత్తేం కాదు.. 
అయినప్పటికీ, 
ఆ తన్మయత్వం, 
ఆ మధురం ఎప్పుడూ క్రొత్తే..
మనలో ఎవరో ఒకరు...ఎప్పుడో ఒకప్పుడు 
తప్పక అనుభవించిన ఓ చిరు జ్ఞాపకమే కదా..!!
ఏమంటారు ?? 

Written by : Bobby Nani

No comments:

Post a Comment