నెల్లూరు లో పెన్నానది ఒడ్డున నిలబడి చూస్తే చాలా బాగుంటుంది.. ఎదురుగా మహోన్నతమైన శ్రీ తల్పగిరి రంగనాధస్వామి వారి కోవెల గోపుర ముఖద్వారము కనిపిస్తుంది.. వేకువన భానుని కిరణాల తాకిడికి ఆ నది బంగారు వర్ణం లా మారి మరింత శోభాయమానంగా కనులకు కనువిందుగావిస్తుంది.. మహా మహులకు సైతం ఆ దృశ్యం వర్ణింప శక్యము కాదు .. ఓ చిన్న భావన నన్నావరించిన ఆ సమయాన నా మునివేళ్ళ నుంచి రాలిన అక్షరాలే ఇవి.. :)
ఓ అందమైన సంధ్యా కాంత
నీలిగాజు పలకవోలె
నిర్మల పెన్నా వాహిని
ఆకసంపు టందాలను
తనలో చూపిస్తూ
అలుపెరుగక నాతో చెలిమి
ముచ్చట లాడుచున్న సమయాన..!!
పై పైకొచ్చి వాలింది
వగలాడి వర్షధరము
చిటపట మను చిరు జల్లులతో
అణువణువునా కురుస్తూ,
తనువంతా తడిపి వేసింది..!!
చిరు జల్లుల తాకిడికి
కట్టు వస్త్రాలు విడిచి
నూతన వస్త్రాలు ధరించిన
ఆమని కనుచూపుమేర
ఆకుపచ్చని తివాచీలా మారి
శోభాయమానమై నిలిచింది.. !!
వరిపైరుల ఊయల లూగి
విరుల పరిమళాలు మధురముగ గ్రోలి
మలయ మారుతాలు నేడు
మా మధ్యన సవితి పోరై తచ్చాడుతున్నాయి..!!
పచ్చిక బయళ్ళు
పచ్చ కంబళ్ళను పరచి
వచ్చి వాలండని
ముచ్చటగ పిలుచుచుండే ..!!
గున్నమావి చివురులు తిని
కోయిల అరగక తెగ కూస్తున్నది
మా ఏకాంతానికి
తెర దించాలని..
తొంగి తొంగి చూస్తుంది
నల్లని కళ్ళ నిశీధి
తెలవారు ఎప్పుడు ముగిసిపోతుందా
వచ్చి వాలుదామా అని..!!
మదువులు పిండే తేనెటీగ
వ్యధామయ జీవితాన్ని,
మధురంగా మలుచుకోమంటున్నది
అణువణువునా కొత్తదనం తొణికిసలాడే
ఈ ఆమని నాలో నాంది గీతం పల్కుతూ ఒదిగిపోయింది..!!
Written by : Bobby Nani
No comments:
Post a Comment