Saturday, April 28, 2018

ఓ కస్తూరి పరిమళం...



చాలా రోజుల తరువాత ఓ కావ్యం వ్రాసాను.. కొన్ని పద ప్రయోగాలు అర్ధం కాకపోవచ్చు కానీ ఆ పద మాధుర్యముల తోనే ఈ కావ్యం మధురాన్ని సంతరించుకుంటుంది.. అందుకే తప్పలేదు.. చదివి అభిప్రాయాలను వెలిబుచ్చుతారని ఆశిస్తూ ... 


ఓ కస్తూరి పరిమళం నన్నాహ్వానించింది.. 
ఆ వాయువునంటి వెళ్ళాను .. 
అదో త్రిశంకు స్వర్గపు ముఖ ద్వారము.. 
బయటా, లోపలా ఉద్యానవనాలు ఏపుగా ఉన్నాయి.. 
వాటినిండా శుకపికాది పక్షి సమూహం సందడి చేస్తుంది.. 
పుష్పించిన లతా వృక్షాలపై వలయాకారంగా తుమ్మెదలు పరిభ్రమిస్తూ 
యెవ్వన మకరంధమును మధురముగా కోరిక తీర జుర్రుకుంటున్నాయి.. 
యోజన దూరంలో దిగుడుబావిలో కొన్ని స్వరములు నా 
శ్రవణమునకు మెల్లగా తాకుతున్నాయి .. !!

దగ్గరకు వెళ్తే ఓ సుందర దృశ్యం ..
పరస్పరం నీళ్ళు చల్లుకుంటూ 
స్త్రీ లు జల క్రీడలో మునిగి తేలుతున్నారు.. 
దీర్ఘికలోని తామర తూడుల్లా క్రీడలతో అలసిపోయిన
వారి చల్లని దేహపు సొగసులను ... 
పొంచివున్న నీటి బిందువులు మనసారా హత్తుకుని
స్పృశిస్తూ వారి తనువంతా ప్రాకుతున్నాయి.. 
అలసిన వారి హృదయ గోపురాల ఉచ్చ్వాస నిచ్వాసములకు 
ముగ్దుడనై వుండిపోయానలా.. !!

ఒకే ఒక్కరిపై దృష్టి ఆగింది.. 
ఇరువది ఏడు నక్షత్రములు ఏకమై కలిసిన కాంతిమయమై 
పసిడి పట్టు వస్త్రము ధరియించినట్లుండు ఆమె దేహపు పసిడి కాంతి 
కళ్ళకు మిరిమిట్లు గొల్పుతున్నది.. 
సాధువుని సైతం కామికుడిగా దహింప చేసే ఆమె 
సహజ సౌందర్య సింధూరం 
పుష్పించిన తామర మొగ్గలా ఉంది.. 
ఆమె యవ్వన బాహువులే తామర తూళ్ళు లా, 
లక్ష్మీ కళ ఉట్టిపడే ఆమె మోమే కమల సంపదలా, 
చంచలాలైన ఆమె సోగ కన్నులే బేడిస చేపల ప్రతిమను పోలి, 
ఆమె వాలు జడ అందాల శైవాలమై ముచ్చట గొల్పుచూ 
వట్రువలైన స్తనాలే ప్రేమకు ప్రతిరూపాలై, విహరించే చక్ర వాకాలై 
ఆరబోసినట్లున్న ఆమె ఆపాదమస్తక అందాలను చూస్తూ 
కలల లోకంలో విహరిస్తున్న నాకు 
ఓ వెచ్చని శ్వాస పదే పదే నను పలకరిస్తున్న అనుభూతి.. 
భారమైన కను రెప్పలను భారంగా తెరిచి చూచాను 
ఇరువది ఏడు నక్షత్రముల కాంతి శ్వాస తగిలేలా నా ముంగిట కొచ్చి నిల్చుంది..!!

ఏ స్వరూపమో, 
ఎక్కడి విశ్వరూపమో, 
సూర్య చంద్రుల్లా ప్రకాశిస్తున్న ఆ రెండు నయనములు 
శృంగార రస ప్రసార కేంద్రాలుగా ఉన్నాయి.. 
ఆర్తిగా నను చూచి తిరిగి వెళ్ళబోయింది.. 
కాస్త సాహసించి ఆమె మునివేళ్లను అందుకున్నాను.. 
చిలిపి కళ్ళు ఒక్కసారిగా భవ భయ రౌధ్రముతో ఎర్రబడి 
ఊపిర్లుతోనే శరములు సంధిస్తోంది.. !!


ఓ ముదితా...!! 
నీ చెక్కిళ్ళ మీది మకరికా పత్రాలు మాసిపోలేదు..
హృదయ గోపురములపై చందన లేపనం చెదిరిపోలేదు.. 
కళ్ళకు దిద్దిన కాటుక కాస్తైనా కరిగిపోలేదు.. 
పెదవుల మీది తాంబూలరాగం రంగు తగ్గలేదు.. 
వెన్నునంటిన నాగు వంపులు కరగలేదు.. 
కటీరముల సొగసు తిన్నెలు ఇసుమంతైనా తరగలేదు.. 
అరవై నాలుగు శృంగారపు అంగ విద్యలలో 
ఏ ఒక్క కళ కూడా నీపై ముద్రించలేదు.. 
అందుకే నీవు నిస్సందేహంగా కన్యకవేనని నా హృదయ సంకేతం
పదే పదే చెప్పిన మేరకు ఇందుకు నే సాహసించాను 
పరిణేతుడనై నీ పాణి ని అందుకున్నాను.. 
పాణి గ్రహీతవై నర్తిస్తావో, 
రౌద్ర స్వరూపిణివై దండిస్తావో,
అంటున్న లోపే మల్లె తీగలా అల్లుకుపోయింది.. 
ఎర్రబారిన నయనాలనుంచి అశ్రువుల వర్షం కురిసింది...
పాతికేళ్ళ కబుర్లన్నీ ఒక్క రేయిలో కరిగిపోయాయి.. 
సుతిమెత్తని ఆమె వెచ్చని స్తన బాహులతికల మధ్యన ఒదిగిపోయానలా ..!!

Written by : Bobby Nani

No comments:

Post a Comment