Friday, January 26, 2018

మిత్రులకు “గణతంత్ర దినోత్సవ” శుభాకాంక్షలు...



మిత్రులకు ముందుగా “గణతంత్ర దినోత్సవ” శుభాకాంక్షలు...

“N - న్యూస్” అనే చానల్ సర్వే చేసిన వీడియో ఒకటి చూసాను.. ఆ సర్వే ఏంటంటే అసలు “గణతంత్ర దినోత్సవం” అంటే ఏంటి ?? ఈ విషయాన్ని ఎంతమంది విద్యార్ధులు చెప్తారు ??

నిజానికి ఆ వీడియో చూసాక ఎవరైనా ఓ డబల్ బ్యారల్ గన్ తీసుకుపోయి ఆ సమాధానాలు చెప్పేవాళ్ళను కాల్చిపారేయ్యాలనిపిస్తుంది ..

ఒకడేమో జనవరి 26 ప్రేమికుల రోజు అంటున్నాడు.. 
ఇంకొకరేమో జనవరి 26 గాంధీ జయంతి అంటున్నారు.. 
మరొకరేమో జనవరి 26 హాలిడే కాబట్టి ఎంజాయ్ చేసే రోజు అంట..

ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా చాలా దారుణంగా సమాధానాలు ఇస్తుంటే .. 
నిజంగా వీళ్ళు మన భారతీయులేనే ?? అనిపిస్తుంది ...

ఇదేనా మనం గొప్పగా చూస్తున్న సువిశాల భారతదేశం ... 
అంతెందుకు ఇది చదువుతున్న మీరే మీ మనసాక్షిని అడగండి.. ఎంతమందికి “గణతంత్ర దినోత్సవం” అంటే ఏంటి ?? అన్న విషయం తెలుసు..

ఒక సినిమాకు ఇచ్చే విలువ కూడా మనం మన దేశానికి ఇవ్వలేకపోవడం శోచనీయం..

స్కూల్స్ లో “గణతంత్ర దినోత్సవం”నాడు జెండా పట్టుకొని, చాక్లెట్స్ తీసుకొని, కాసేపు గీతాలు పాడుకొని, ఏవైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ వుంటే అవి చూసి ఇంటికి రావడమే మనం తెలుసుకున్నాం.. ఆ స్కూల్స్ లో ఒక్క ఉపాధ్యాయుడు అయినా ఒక చిన్న ప్రసంగాన్ని చేసి అసలు “గణతంత్ర దినోత్సవం” అంటే ఏంటి ఎప్పుడొచ్చింది ? .. 
ఎందుకొచ్చింది ? .. 

ఈరోజుకు ఎన్ని సంవత్సరాలు అయింది అనే విషయాలను తెలియజేసి వుంటే నేడు విద్యార్ధులకు ఈ దుస్థితి పట్టేది కాదు.. 

దయచేసి ఇకనుంచి అయినా విద్యార్ధులకు ఒక స్పష్టతను, అవగాహనను కలిగించమని ప్రార్ధిస్తున్నాను..

ఇకపోతే మన భారతదేశ చరిత్రలో జనవరి 26, 1950 అనేది గుర్తుపెట్టుకోదగ్గ ముఖ్యమైన రోజు ఈ “గణతంత్ర దినోత్సవం” ... . భారత దేశానికి స్వాతంత్ర్యం ఆగస్టు 15, 1947 లోనే వచ్చింది.. కానీ, ఈ జనవరి 26, 1950 న భారత రాజ్యాంగం నిర్మించబడి, డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు తొలి రాష్ట్రపతిగా భాద్యతలు స్వీకరించి మన దేశం పూర్తి గణతంత్ర దేశం అయిన రోజు ఈ రోజు.. 
ఈ రోజు నుండి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వం అయింది.. ఎందరో మహానుభావుల త్యాగఫలం వలన మనకు ఈ 'గణతంత్ర రాజ్యం' ఏర్పడినది. 'గణతంత్ర రాజ్యం' అంటే ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు....

"ఏ దేశమేగినా,ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము"

అని ఎలుగెత్తి కీర్తించిన రాయప్రోలు సుబ్బారావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ...

మన ముందు తరాల త్యాగ ఫలాలు భోంచేస్తున్న మనం ఇప్పుడు కొత్తగా త్యాగాలు చేయాల్సిన అవసరమేమీ లేదు. ప్రతి ఏటా ఈ గణతంత్ర దినోత్సవమును జరుపుకోడానికి కాస్త తీరిక చేసుకుంటే చాలు అని మనవి చేసుకుంటూ ..

దేశం కోసం నాటి నుంచి నేటి వరకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన అమరవీరులకు అశ్రునివాళులు అర్పిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడను ప్రార్దిస్తూ..

మిత్రులకు మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ...

జైహింద్ ___/\___

Written by : Bobby Nani

No comments:

Post a Comment