Tuesday, January 2, 2018

ఒకమనిషి నుంచి ఇష్టాన్ని కాని, ప్రేమను కాని, స్నేహాన్ని కాని తీసుకోవాలంటే వందేళ్ళు కావాలా.. ??



ఒకమనిషి నుంచి ఇష్టాన్ని కాని, ప్రేమను కాని, స్నేహాన్ని కాని తీసుకోవాలంటే వందేళ్ళు కావాలా.. ??

ఒక్క క్షణం చాలదా.. ?? 

ఆ ఒక్క క్షణం వారున్నా, లేకున్నా వందేళ్ళ జ్ఞాపకంగా పదిలమవ్వడం సరిపోదా.. !!

అలాంటిదే ఓ ఇద్దరి మిత్రుల స్నేహం.. 

ఆకాశం సూర్యుణ్ణి తాకగలదా ?? 

రవి కిరణం వెలుగును చూడగలదా .. ??

ఒకరికొకరు చూడకుండానే ఇన్నేళ్ళ వారి స్నేహం నభూతోనభవిష్యతి ... !!

2002 వ సంవత్సరం యాహు మెసింజర్ ఓ ఊపు ఊపుతున్న రోజులవి.. అనుకోకుండా ఓ మెసేజ్ వారి ఇద్దరి మధ్య స్నేహమనే వారధిని నిర్మించింది.. అది ఓ అమ్మాయి నుంచి వచ్చిన మెసేజ్... ఎవరా అని ఆలోచించే లోపే.. మరో మెసేజ్ "పొరపాటుగా పంపానండి ఏమనుకోకండి" అంటూ... 
అసలు మీరు ఎవరండి..?? 

ఎవరనుకోని నాకు పంపారు అంటూ వారి మధ్య మాటలు కలిసాయి.. అలా వారి స్నేహానికి కొన్ని నెలల వయస్సు ఏర్పడింది.. అప్పట్లో మొబైల్ వాడకం చాలా తక్కువగా వుండేది.. అలాంటి సమయంలోనే రిలయన్స్ ఫోన్లు మార్కెట్ లో అడుగు పెట్టాయి... ఇక వాటికి అడ్డు, ఆపు లేకుండా హాల్ చల్ చేస్తుండేవి.. 

నీ నెంబర్ ఉంటే ఇవ్వు .. ?? ఓ సారి మాట్లాడుతాను అంటూ అవతలివైపు నుంచి ఆ అమ్మాయి మెసేజ్.. 

నిజానికి వీడిదగ్గర ఎలాంటి మొబైల్ లేదు.. కానీ మాట్లాడాలి..!! తను పనిచేసే సంస్థలోని తోటి స్నేహితునికి ఓ నోకియా 1100 మొబైల్ వుండేది.. వాడది సెకండ్ హ్యాండ్ అని కొన్నాడు.. కాని పదో హ్యాండ్ అని ఆ మొబైల్ చూస్తేనే అర్ధమయ్యేది ... గట్టిగా చేతులతో ఎవరన్నా పట్టుకుంటే ఎక్కడివి అక్కడ ఊడిపోయే పరిస్థితి ఆ మొబైల్ ది.. ఎవ్వరినీ తాకనిచ్చేది కాదు.. మహా సాధ్వి.. దాన్ని చాలా సున్నితంగా డీల్ చెయ్యాల్సిన గత్యంతరం వారిపై ఎప్పటికప్పుడు పెనుభారంగా పడుతూ వుండేది.. 

దానికి ఆ ఫోన్ గల్లోడు ఇచ్చే బిల్డ్అప్ అంబాని కూడా ఇవ్వడేమో ...
ఎలాగోలా వాడిని ఒప్పించి ఆ నెంబర్ ఆమెకు ఇచ్చాడు... 

ఆమె చెప్పిన ప్రకారం ఆ సమయానికి కాల్ లో మాట్లాడేందుకు ఈ అబ్బాయి సిద్దంగా ఉన్నాడు... ఇన్నిరోజులుగా చాట్ చేస్తున్నా కలగని అలజడి తనతో మాట్లాడబోతున్నాను అనే భావన ఆ అబ్బాయిని ఏంతో అలజడికి గురి చేస్తూ వుంది.. ఆ అమ్మాయిలో కూడా అదే భావన కలుగుతూ వుంది.. ఎన్నోసార్లు ఒక్క రూపాయి కాయిన్ బాక్స్ లో కాయిన్ వేసి తన నెంబర్ కొట్టి కాయిన్ ను కిందకు కొట్టేస్తుంది ... అలా కాయిన్ వెయ్యడం మళ్ళి తీసుకోవడం .. ఇలా పలుమార్లు చేసిన తరువాత .. కొన్ని నిమిషాలకు ధైర్యం తెచ్చుకొని ఎట్టకేలకు కాల్ చేసింది... 

మొబైల్ రింగ్ అవుతోంది... ఈ అబ్బాయి గుండె వేగం తారాస్థాయికి చేరుకుంది... బొటనవేలు కాల్ ఎత్తేందుకు సహకరించక పోగా కాస్త వణుకుతూ ఇతడిని మరింత చిక్కుల్లో పడేసింది... !!

ఊపిరి కాస్త గట్టిగా తీసుకొని బొటనవేలుపై పట్టు సాధించి కాల్ చివరికి ఎత్తాడు.. 

అవతలనుంచి ఎలాంటి శబ్దం కూడా లేదు.. ఈ అబ్బాయి కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు... 

ఆమె ఊపిరి స్పష్టంగా వినపడుతోంది.. 

ఇతడే ధైర్యం చేసి "నువ్వేనా" అంటూ ఓ వణుకుతున్న స్వరంతో అడిగాడు.. 
ఇంకా అవతలనుంచి మౌనం అలానే వుంది.. ఈలోపు కాయిన్ వెయ్యమని ఒకటే సౌండ్ ... 

చివరి క్షణంలో ఆమె మరో కాయిన్ వేసింది... అలా మరికొన్ని క్షణాలు గడిచిన తరువాత "హా" అనే పదం మాత్రమే ఆమె నోటినుంచి రాలింది.. 

అలా మొదటి మాట వారు కలిపాక .. ఇక మాటలకు కొదవేలేకుండా పోయింది.. మంచి సన్నిహితులు అయ్యారు.. ఇద్దరూ ఒకరి అడ్రెస్ లు మరొకరు తీసుకున్నారు... ప్రతీ సంవత్సరం వచ్చే రాఖీ పౌర్ణిమ రోజున ఓ ఖరీదైన రాఖీ ఈ అబ్బాయికి తను పంపేది.. అలానే ప్రతీ సెప్టెంబర్ మాసంలో తన జన్మదినం నాడు ఆ అమ్మాయికి ఓ మంచి గిఫ్ట్ ఇతడు పంపేవాడు.. కొన్ని సంవత్సరములు గడిచాయి ... 

ఇద్దరూ ఎవరి చదువుల్లో, కెరియర్ లతో బాగా బిసీ అయిపోయారు ... ఒకరికొకరు మాట్లాడక, చాట్ చెయ్యక కొన్ని ఏళ్ళు గడిచినా కూడా ప్రతీ సంవత్సరం ఒకరికొకరు గిఫ్ట్ లు మాత్రం పంపించుకునేవారు.. మరి కొన్ని సంవత్సరములకు అది కూడా జరగలేదు..ఇద్దరిలోనూ ఒకరి గురించి మరొకరు మర్చిపోయారనే ఆలోచన వుండేది.... కాని అది నిజం కాదు అని తెలిసేసరికి ఆర్కుట్ అనే సోషల్ నెట్వర్క్ లో ఆమెనుంచి మరో మెసేజ్... 
ఇప్పటికి గుర్తొచ్చానా అంటూ ఈ అబ్బాయి ప్రశ్న... 

మళ్ళి మొదలు... 

అలా కొన్ని రోజులు గడిచాక .. నాకు పెళ్లి కుదిరింది అని తన సంతోషాన్ని ఈ అబ్బాయితో పంచుకుంది... అందుకు ఆ అబ్బాయి కూడా ఎగిరి గంతులేస్తూ కనీసం పెళ్ళిలో అయినా నిన్ను చూడాలి అని తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు.. 

పెళ్ళికి తనని పిలవలేదు..

ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు... అలా మరికొన్ని రోజులు గడిచిపోయాయి .. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి .. ఎవరి పాటికి వారు బిసీ బిసీ జీవితాలతో గడుపుతున్నారు... 

2016 వ సంవత్సరం ఆఖరులో అనుకోకుండా అదే పేరు హోమ్ టౌన్ ఊరు వున్న అమ్మాయి ఈ అబ్బాయికి ముఖపుస్తకంలో కనిపిస్తుంది... మెసేజ్ చెయ్యమని మనసు ఒకటే రుస రుస లాడింది.. ఇక తట్టుకోలేక మీరు పలానా వారేనా అంటూ ఓ మెసేజ్ పెట్టాడు.. 

వారం రోజుల తరువాత హా నేనే ఎలా వున్నావ్ అంటూ ఆమెనుంచి ఆప్యాయంగా ఓ మెసేజ్... మొట్ట మొదట తను చేసిన మెసేజ్ లో ఎలాంటి మాధుర్యం అయితే వుందో ఇన్ని సంవత్సరములు గడిచినా కూడా ఇంకా అదే మాధుర్యం కనిపించింది ఆ అబ్బాయికి.. కళ్ళల్లో ఒక్కసారి వెచ్చని నీటి బిందువులు బిర బిరా నేల రాలాయి... మసకబారిన కీబోర్డ్ అక్షరాలను వెతుక్కుంటూ టైప్ చేసిన ఈ అబ్బాయికి .. ఆశ్చర్య పరిచే మెసేజ్ ఆమెనుంచి వచ్చింది.. " ఏంటి ?? నువ్వు కూడా ఏడుస్తున్నావా ?? " అని ... 

సరేగాని ఇప్పటికైనా నన్ను చూడాలని అడగవా అని ఆ అమ్మాయి మెసేజ్... 
నువ్వు అడగలేదుగా నన్ను చూస్తానని .. మరి నేనెలా అడగనూ అంటూ ఆ అబ్బాయి సమాధానం... 

అలా అన్నాడో లేదో ఓ ఫోటో కళ్ళముందు ప్రత్యక్షమైంది... 

తను, తన భర్త, తన ఇద్దరు పిల్లలు కలిసి ఉన్న ఫోటో.. 

అలానే తన ఫ్యామిలీ ఫోటో కూడా ఇతడు పంపాడు.. ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకున్నారు... ఇన్ని సంవత్సరముల రూపంలేని వారి స్నేహానికి ఎట్టకేలకు తెర పడింది.. !!

ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు... !!

నిజంగానే ఒకరికొకరు చూసుకోకుండా ఈరోజుల్లో జరుగుతుందా అనే మీ ప్రశ్నకు ఇదే సమాధానం ... 

ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మంచి మిత్రులుగా ఉండగలరా అనే మీ సందేహాలకు ఇదే ఓ తార్కాణం .. 

ఏదో ఆశించి చేసేది స్నేహం కాదు.. .....కాకూడదు.. !!

ఎన్నో స్నేహాలు వికసిస్తుంటాయి.. వికటిస్తుంటాయి .. కాని స్వార్ధరహిత స్నేహం ఇలా ఎప్పటికీ నిలిచిపోతుంది.. వీరికి కావాల్సింది రూపం కాదు.. నాలుగు సోది మాటలూ కాదు.. వ్యామోహం అంతకన్నా కాదు.. ఒకరిపై మరొకరికి వున్న ఆత్మ గౌరవం, విలువలు, నిజాయితీ, కల్మషం లేని కబుర్లు.. అవే వారిని ఈ స్థాయికి చేర్చాయి.. శిఖరం అంచున నిలబెట్టాయి... నిజ స్నేహానికి అద్దం పట్టే ఇలాంటి వారిపై ఈ ఆర్టికల్ రాస్తున్నందుకు గర్విస్తున్నాను... 

Written by : Bobby Nani

No comments:

Post a Comment