Friday, November 24, 2017

నీ అందం ...


నీ అందం 
నా కళ్ళ వెనుక మెదుల్తున్నంత సేపూ 
నీ కంటి చూపు నా పెదవులపై జల్లై కురుస్తున్నంత సేపూ 
ఆ రెండు నేత్రాల మధ్యా లంగరేసుకున్న పడవలా పడున్నాను.. 
ఏమా అందం.. 
ఏమా లావణ్యం.. 
రెండు చకోరాల రెక్కల మధ్యన, 
రెండు విశాల ప్రపంచాల బాహువుల మధ్యన, 
వినీలాకాశాల నేత్రాంచలాల మధ్యన, 
విశ్వ రహస్యాల్ని గుప్పిట పట్టిన రెండు పాలరాతి భరిణుల మధ్యన, 
నీ నఖశిఖ పర్యంతాల మధ్యన, 
నాకు నేనే స్వహస్తాలతో సంకెళ్ళేసుకున్నాను.. 
ఏ నారింజ తొనల్ని వొలిచి వచ్చిందో ఆ మేలిమి వర్ణం.. 
ఏ క్షీర నదిలో మునకలేస్తే వచ్చిందో.. ఆ శ్వేత వర్ణం.. 
ఎన్ని చాపములను వంగదీస్తే వచ్చిందో .. ఆ నవనీత నడుము.. 
కళ్ళు విట్టార్పి అనేక పర్యాయములు పరికించి, తిలకించినా 
ఎప్పుడూ నీ అణువణువునా నవీనత్వమే.. నూతనత్వమే.. 
మదిని దోచే మధుకము లా, 
వన మయూరములా.. 
చెంగు చెంగుమనుచు గెంతు ఆ 
కాలి అందియలలో ఒకే ...ఒక్క మువ్వనైనా నే 
కాకుంటినే... !!

Written by : Bobby Nani

No comments:

Post a Comment