మనమింతే..
మన బ్రతుకులింతే..
***************
ప్రత్యూషవేళలు అనేకం వికసిస్తూ ఉంటాయి..
ససంధ్యమ సమయాలు అనేకం ముగుస్తూ ఉంటాయి..
కానీ
మనసెప్పుడూ భావాల పల్లకిని మోస్తూనే ఉంటుంది..
శ్వాసెప్పుడూ ఉత్ప్రేక్షాపరిమళాలను వెదజల్లుతూనే ఉంటుంది..
కలమెప్పుడూ అవిశ్రాంతంగా కదులుతూనే ఉంటుంది.. !!
అందుకే నేను ..
ఉల్లము చెప్పే మాటల్ని,
పుష్పము వదిలే పరిమళాన్ని,
మేఘము వర్షించే తుంపర్లను,
హృదయాన్ని మీటే రాగాన్ని,
వెలుగును ప్రసరించే ఉషోదయాన్ని,
నిశీథము రాల్చే చీకట్లను,
ఎప్పటికప్పుడు నా సిరాలో పోగేస్తూ ఉంటాను.. !!
భ్రూణము భరించే బాధను,
తల్లి పడే ప్రసవ వ్యధను,
గొంగళి చిలుకయ్యే క్షణమును,
సూరీడు అస్తమించే ప్రొద్దును,
కాడెద్దు దేహపు పుండ్లను,
ఎప్పటికప్పుడు నా అంతరింద్రియములో భద్రపరుస్తూ ఉంటాను..!!
నా చుట్టూ వున్న లక్ష మంది సంతోషాలు నాకు కనిపించట్లేదు..
వేల మంది వేదనా కన్నీరే కనిపిస్తున్నాయి..
నవ్వడం మర్చిపోయాను...
ఏడవడం చేత కావట్లేదు...
కానీ
నిరంతర కన్నీటి ధార
నా చెంపపై చారను ఎర్పరించింది..
కల్తీ నవ్వులతో..
ముఖానికి రంగులను పులుముకుని ..
బ్రతికేస్తున్నా..!!
స్వేదాన్ని చిందించి,
రక్తంతో పండించి,
ఎండిన డొక్కతో నిల్చున్న రైతన్న
పదే పదే కంటతడి పెట్టిస్తున్నాడు..!!
కడుపున బడిన శిశువును
కన్న ప్రేగుకు దూరం చేసి
వ్యర్ధ, మాలిన్యముల మధ్యన
విసురుతున్నారు.. !!
కాకులు పొడవని,
కుక్కలు కరవని
ఆ చిన్నారి రోదనములు
నా హృదయాన్ని రక్తపు గాయాలు చేస్తున్నాయి.. !!
వరకట్నపు జ్వాలలు..
అవినీతి పాలనలు..
నీతి లేని రాజకీయాలు..
కుల, మత, ప్రాంతీయ విభేదాలు..
నన్ను, నా దేశాన్ని
చెద పురుగుకన్నా దారుణంగా తినేస్తున్నాయి..
ఇంకెక్కడి సంతోషాలు..
అరువు ఇచ్చేవాళ్ళు కనుమరుగయ్యారు..
గొంగళి సీతాకోకగా మారే సూచనలే కావరావట్లేదు..
ఓటుకు నోటును తీసుకున్న వేశ్యా పరులం..
మనమింతే..!!
మన బ్రతుకులింతే ..!!
Written by : Bobby Nani
Good Post బాగానే ఉంది సర్.
ReplyDeleteమరిన్ని పోస్టులు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.@ K.S.చౌదరి