ఓయ్ బంగారం ...
నిను చూచిన జ్ఞాపకాలతో మనసంతా నింపేసుకుందామనుకున్నా..
కాని ..అదేంటే
మనిషిని మాత్రమే అలా వచ్చేసాను,
మనసును నీతో పంపేసాను.. !!!
ఆ కాటుక కళ్ళేంటే
నను చూసిన ప్రతీసారి
కోటి తారల కాంతులతో మిరిమిట్లు గొల్పుతున్నాయి..
ఆ వోర చూపులేమో నా బెత్తెడు గుండెకు
గుండుసూది మొనల్లా సూటిగా తాకుతున్నాయి .. !!!
నా మునివేళ్ళు నీ చెక్కిలిని మీటిన ప్రతీసారి
ఉదయకాలమున వికసించే నవ కుసుమం లా...మారి
ఆ ఎర్రెర్రని దోర పెదవులు లేలేత మకరందాన్ని స్రవిస్తుండగా ..
నీ దేహ పరిమళానికి వశం తప్పిన పిల్లగాలి నిను బిగుతైన పరిష్వంగములలో
చుట్టేసి ..... కైపెక్కి, కదలలేక, వదలలేక,
ఊగుతూ ...తూగుతూ నను తాకిన క్షణమున
ఏ జన్మ బాంధవ్యమో నను తియ్యఁగ ముద్దాడినట్లుగా తోచిందాక్షణమున
నిజమే ...
మన ఈ కలయిక దైవ నిర్ణయం.. నిస్సందేహంగా ఇది దైవ నిర్ణయమే..
నిను తాకిన ప్రతీ స్పర్శ నాకేదో గుర్తుచేస్తూనే ఉంది..
నిను ముద్దాడిన ప్రతీ ముద్దు నాకేదో చెప్తూనే ఉంది..
నీ హృదయ గోపురముల శయ్యపై తల ఆంచిన ప్రతీసారి
నా శ్రవణములకు, నే పారేసుకున్న శబ్ధమేదో మళ్ళి దొరికినట్లు వినిపించేది..
అప్పుడు తెలియలేదు నాకు
ఆ శబ్దం నీ హృదయ వేదికపై పరుచుకున్న
“ప్రేమ” అనే పొర నుంచి వస్తోందని.. !!
భగవంతుని “సన్నిధి”లో ..
నూట ఎనిమిదవ స్థానములో..
రెండు ఉల్లములు ఒకే “గాత్రము”గా ఏకమైన క్షణమున
అన్నీ మరిచి అలసి, తొలసి,
హృదయ గోపురములపై వాలితిని..!!!
యదాద్రి సన్నిధిలో మంత్రోచ్చారణ సూటిగా కర్ణములకు తాకుతోంది..
ఏదో నూతన శక్తిని శరీరం తిరిగి గ్రహిస్తోందని స్పష్టంగా అర్ధమౌతోంది..
అష్టోత్తర పూజతో చిగురించిన ప్రేమ మానుగా మారింది..
కొబ్బరికాయ నివేదనముతో ఆ కొబ్బరిపై వున్న దృఢత్వాన్ని సంతరించుకుంది..
అర్చకుని ఆశీస్సులతో రెండు శకముల ఇష్టాన్ని కైవసం చేసుకుంది..
చేతులు పట్టుకొని నడుస్తున్న ఇరువురి అడుగుల చప్పుళ్ళలో
చివరి వరకు వదలబోననే పరమార్ధం అర్ధమయ్యింది..
ఇప్పుడు చెప్పు బంగారం మన కలయిక యాదృచ్చికమా.. ??
Written by : Bobby Nani
No comments:
Post a Comment