Saturday, August 19, 2017

నా అనుభవాలను, జ్ఞానాన్ని రంగరించి మీకోసం రాస్తున్నాను మీకు ఉపయోగపడతాయేమో చూడండి ..



ముందుగా కవయిత్రులకు, కవులకు సంస్కారవంతమైన సత్కార నమస్కారములు... ఈ ముఖపుస్తకం ద్వారా ఎందరో కవులు, కవయిత్రులను కలుసుకున్నాం.. ఇది ఒక వేదికలా మారి ఎందరినో పాఠకులను ఉర్రూతలు ఊగిస్తోంది .. అన్నివర్గాల వారిని ముఖ్యంగా యువతను కవితా హృదయ మకరంధములో అభ్యంగనస్నానమాచరించేలా నేటి కవులు, కవయిత్రులు చెయ్యడం నభూతోన భవిష్యతి.. 

కవిత్వం అంటే ఏంటి.. ??
దాని గురించి వివరణ, రాయడంలో వున్న లోటుపాట్లుపై ఓ అవగాహన.. 
ఎలా రాయాలి ?? అనేదానిపై ఓ మార్గదర్శకత్వాన్ని తెలియజెప్పడం.. 
కవిత్వ గొప్పతనాన్ని, ముఖ్యంగా కవి గొప్పతనాన్ని చెప్పే ఓ ప్రక్రియ వగైరాలు ఇందులో నేను ముఖ్యంగా వ్రాయడం జరిగింది.. 
చిన్నవాడినే.. అనుభవం లేని వాడినే.. 
కాని నా వుగతెలిసిన దగ్గరనుంచి వ్రాస్తున్నాను.. షుమారు 20 సంవత్సరములనుంచి అని చెప్పొచ్చు.. ఈ 20 సంవత్సరముల అనుభవాన్ని తెలిపే చిన్న టపా నే... నా ఈ వ్యాసం.. 

కవిత్వం వ్రాయడం అంటే చాలా కష్టం అని కొందరు భయపడి రాయాడానికి వెనకాడుతున్నారు.. నిజమే కవిత్వం రాయడం ఆషామాషీ కాదు.. దానికో సంకల్పం ఉండాలి.. అన్నిటికన్నా నీలో శ్రద్ధ ఉండాలి.. అలా అని అసాధ్యం కూడా కాదు.. ఒక పదానికి పది రకములైన అర్ధాలు నీకు తెలిసినప్పుడే నువ్వు కవిత్వం రాయగలవు.. ఇది చాలా ముఖ్యం.. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని నా అనుభవాలను, జ్ఞానాన్ని రంగరించి మీకోసం రాస్తున్నాను మీకు ఉపయోగపడతాయేమో చూడండి .. 

అందరికీ కుతూహలాలు చాలా ఉంటాయి.. కవి కావాలనే కుతూహలం కూడా ఒకటి.. అసలిలాంటి కుతూహలం పుట్టడమే ఒక అదృష్టం.. కాని ఇల్లలకగానే పండుగైపోదు .. వీణ పట్టుకోగానే వాయించడం రాదు.. సహజంగా వుండే ప్రతిభ సాధన వల్ల, అభ్యాసం వల్ల రాణిస్తుంది.. రోజుకు పది కాగితాలను నలుపు చేస్తూ చెత్త బుట్టలోకి గిరాటు వెయ్యడం మాత్రమే అభ్యాసం కాదు.. రాసిన పద్యాలు, గేయాలు, కవితలు, కావ్యాలు పత్రికలకు పంపించి అవి తిరిగి వచ్చేసినా, ప్రచురించకున్నా సంపాదకున్ని తిట్టిపోయడం గొప్ప కాదు.. రచయితకు పరిశీలన కావాలి.. నిరంతరాధ్యయనం కావాలి.. పదిమందిలో తను వ్రాసిన రచనలు చదివి వినిపించే అలవాటు ఉండాలి. తనకన్నా పెద్ద రచయితల స్నేహం సంపాదించుకుంటూ వారి ఉపదేశాలను, అక్షరాలను గ్రహిస్తూ ముందుకు సాగిపోవాలి.. అప్పుడప్పుడు తన సమవయస్స్యులైన సహరచయితలతో కలిసిమెలిసి సభలూ, సమావేశాలు, ఏర్పాటు చేసుకొని అందులో చదివిన రచనలన్నింటినీ (గ్రంధ రూపంలోకి తేవడానికి కృషి చెయ్యాలి.. )

మీ సమతవ్వాలి.. 
మీ ఆశయం కవితవ్వాలి.. 
మీ ఆశయం నవతవ్వాలి.. 

పప్పు, నెయ్యి వేయించి భోజనం పెట్టమని అడిగితే అది కవిత్వం కాలేదు.. అప్పుడూ కాలేదు.. ఇప్పుడూ కాలేదు.. రేపూ కాబోదు.. కాని శరత్కాలపు వెన్నెల లాంటి తెల్లని చిక్కని మీగడ పెరుగుపోసి అన్నం పెట్టించండి.. అది కవిత్వం అవుతుంది.. ఏ చమత్కారవేశమూ, ఏ సౌందర్యస్పర్శా లేని వాక్యాలు ఎవరినీ ఆకర్షించవు.. కనుక వాటిని కాదంటాం.. అంటే వర్ణన కవి సహజలక్షణమన్నమాట. ఇదే ప్రతిభ, కవిచేత కవిత్వం పలికించే సరస్వతి కూడా ఇదే.. 

కవిత్వం వ్రాయం ఎంత గొప్పదో దాన్ని ఆస్వాదించడం కూడా అంతే గొప్పది.. కవికీ, అన్వాదకుడికీ కూడా భావనాశక్తి ఉండాలి.. ఆ భావనా శక్తి ఒక ఆల్కెమీ. అది అన్నీ వస్తువులను సువర్లీకరిస్తుంది.. 

“You will kind poetry nowhere unless you bring some with you” అంటాడొక సహృదయుడు... ఆలోచనలకు అనుభూతులతో రంగులు వేసి చూపించడమే కవిత్వం.. మబ్బులుపట్టి మెరుస్తున్న, కురుస్తున్న ఆకాశమూ కవిత్వమే.. ఇంద్రచాపం విరిసిన కారుమెయిళ్ళవంటివి కవి రచియించే కవితలు.. వాటిని చదవగలిగిన హృదయం నీకుండాలి.. ఆ హృదయంతో పాటు చెప్పగల వాక్కు నీకు వశమయితే నువ్వూ ఓ కవివే.. లేకుంటే పాఠకుడిగానే మిగిలిపోతావ్.. 

“The best words in the best order” అనేది కవితాశిల్పానికి సంబంధించిన పరమరహస్యం. దీనివల్లనే పదాల్లోనించి సంగీతం పుడుతుంది.. Music of Words ద్వారా కవిత్వం ఎన్నో అద్బుతాలను సృష్టిస్తుంది.. ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.. కవిత్వం అనేది కవి రాసినప్పుడు పాఠకుడిని కదిలించగలగాలి.. కవిత్వం కవిగారి స్వంత వ్యాపారం కాదు. కవి దాన్ని జాతీయం చెయ్యాలి.. అప్పటివరకూ కవి ఒక గొంగళిపురుగు.. అంతవరకూ కవికి సమాధి తప్పదు .. అజ్ఞాత వాసమూ తప్పదు.. రేపనే రోజున తనే ఓ సీతాకోకచిలుక. 

కవిత యెంత చిన్నదైనా పర్వాలేదు.. అది ఒక వాక్యమే కావచ్చు.. అందులోనే కవి తన ప్రతిభను చూపాల్సిన ఆవశ్యకత ఉంది.. అరచేతిలోనే అనంత విశ్వాన్ని ఇమిడించి చూపడానికి కవి నిరంతరం ప్రయత్నించాలి.. 

గులాబీ పువ్వు కాదు కవిత్వం అంటే.. దాని నిజాంతర తాజా సువాసనే కవిత్వమంటే.. కనిపించేది కాదు కవిత్వం అంటే.. హృదయానికి తాకేది, ఆస్వాదించేది కవిత్వం అంటే.. సముద్ర భీకరం కాదు కవిత్వం అంటే ఆ సముద్రం చేసే మోతే కవిత్వం అంటే.. 

ఆధునిక కవిత్వం అంటే ఆధునిక కాలానికి చెందిన వస్తువు గలది.. అంతేగాని ఈ కాలంలో కల్లువిప్పిందంతా నవ్య కవిత్వం కాజాలదు. ఆధునిక జీవితం ఎదుర్కొంటున్న సమస్యలూ, సంఘర్షలూ వీరి కలాల్లో, గళాల్లో సిరాలుగా వరాలుగా ప్రవహిస్తున్నాయి.. ఈ జీవితాపుటాశలు, నిరాశలూ వ్యక్తమవుతున్న ఖండికలివి.. ఇన్ని రహస్యాల రమణీయ భవనం తలుపులు తెరుచుకుని ప్రవేశించాలని మన యువకులమంతా పరమ కుతూహలాన్ని పప్రదర్శించాలని కోరుకుంటున్నాను.. 

స్వస్తి ___/\___

Written by : Bobby Nani

No comments:

Post a Comment