మా సింహపురిలో వేసవి ముచ్చట్లు..
అదేనండి మా నెల్లూరు, మన నెల్లూరు..!!
మేఘాల్లేని ఆకాశాన్ని దులపాల్సిన పనిలేనందువల్ల
తలలకు పాత దుమ్ముని పులుముకున్న
బూజుకర్రల్లా ఉన్నాయి కొబ్బరిచెట్లు.. !!!
యుద్ధం లేకపోయినా అనుక్షణం అప్రమత్తంగా
విన్యాసాలిచ్చే సైనికుల్లా..
నిర్దిష్టమైన వరుసల్లో,
రెప్పపాటు లేనట్లు ఆకుకదలని స్థితిలో నిలబడి ఉన్నాయి..!!
ఊరి నించి మరోఊరికి ప్రవహించే పిల్ల కాల్వల
నాలుకలు పిడచ కట్టుకుపోయి,
వెల్లికిలాపడి ఏడ్చినా నీళ్ళు రాని,
కనుగుడ్లు లేని,
మట్టి గుంతల్లా మిగిలాయి.. !!
వేసవి పిండేయ్యగా మిగిలిన పల్లెలమ్మ గుండెల్లోకి,
కాకులు కూడా ముట్టని బురదనీరు,
ఈ విసర్జన శరీరాన్ని శుభ్రం చేసుకునేందుకు,
ఏదో నీటిలో బతుకు పిండుకునే రజకులకు,
మాత్రమే పనికొస్తుంది.. !!
కడుపునిండకపోయినా కాన్పుల క్రమం తప్పకుండా,
సగటు అమ్మల్లా,
ఎండు కొబ్బర్ల స్థానంలో పూల పిందెల హారాల్తో,
గుండె లోతుల్లోని నీటి ఊటల సారంతో,
నిలబడి ఉన్నాయి కొబ్బరిచెట్లు..!!
కొబ్బరి చెట్ల కొంగు చాటు బిడ్డల్లా,
నీడల్లో పాదాలానుకొనే కంద మొక్కలు..
నరికిన స్థానం పక్కనే పిలకల మొలకల్తో కిలకిల్లాడుతూ,
వృద్దాప్యం, బాల్యం, ఏక కాలంలో అనుభవానికొచ్చే,
గెలల అరటి చెట్లు,
సోమశిల, కండలేరు పాయల పొడవుకి గడ్డి గెడ్డాల పచ్చని గట్లు..!!!
బోరకడుపుని దాచుకుని బస్టాండుకు,
బుట్టలతో పరిగెత్తుకొచ్చే రుచికర దోర జామకాయలు..!!
ఒంటె కడుపులోని నీరులా ఎక్కడ తవ్వినా పైకి ఎగదన్నే,
బోరునీళ్ళతో కలకల్లాడే రెండో పంట కూరల పైర్లు..!!
సింహపురుల కంటి తుడుపులు.. !!
వేసవి జ్వరం తగిలి మూల్గుతున్న పొదలకూరు,
ఇటుక బట్టీల్తో చెవులు పట్టేసిన కోవూరు,
ఆకాశాన్నంటే మల్లెపూల ధరల్తో బుచ్చిరెడ్డిపాలెం,
జల జలమను లంఘించే మా పెన్నాను కలుపుకోవడానికి నీళ్ళు లేక
వెనక్కి పరుగెత్తుకొచ్చే సముద్రం,
పట్టణ మాలిన్యంతో కన్నె సొగసును కోల్పోయిన సింహపురి పల్లెలివే....!!
మా సింహపురి కంటి నులుసులు...!!
దేన్నీ వదలని వేసవి సింహపురిని పట్టుపట్టింది..!!
కాలువల్ని తాగి, ఊటల్ని మింగినా,
భూమి లోపలిసారం కాలి చిటికెన వ్రేలు కూడా కదపలేక
వెర్రి మొహం వేసింది..!!!
పుట్టిపెరిగిన ఊరు కాదండి.. కూసంత మమకారమేక్కువ..
Written by : Bobby Nani
No comments:
Post a Comment