//// భారతమ్మ ప్రసవవేదన \\\\
***********************
అలసిన కళ్ళు అద్ది,
పుండైన కాళ్ళు కడిగి,
బడలిన ఒళ్ళు రుద్ది,
“భారతదేశ”మనే ఓ పుణ్యస్త్రీ
అభ్యంగనస్నాన మాచరిస్తూ వుంది..!!
ఊచల్లోంచి చూడొద్దు..
ఊచల్లోపల ఉండొద్దు..
“సమ్మెల” తలనీళ్ళు ఒత్తి,
“తగాదాల” తడివొళ్ళు తుడిచి,
“వివాదాల” చేతులు విదిల్చి
“భారతదేశ”మనే మంగళాంగిణి
కోక మార్చుకుంటూ వుంది..!!
అటు తిరగొద్దు ..
ఆ వైపు లేకుండా పోవద్దు..
ఎండే “పొలాల పెదవులు” తడిసి
తడబడే అడుగులు నిలిపి
గర్భంలో పంటల కాంతులు దాల్చి
“భారతదేశ”మనే పవిత్రాత్మ
సిగ్గు శరీరంలో అదుముకుంది.. !!
నవ్వొద్దు..
నవ్వులపాలు కావద్దు..
“కాశ్మీర” ముఖం చిట్లించి..
“ఉత్తరప్రదేశ్” కంఠం ఉబ్బించి..
“బీహార్, బెంగాల్” చేతులు బిగపట్టి
“ఆంధ్ర, తెలంగాణా” ఉదరమును నొక్కుతూ..
“కేరళ, తమిళనాడు” నిగిడ్చిన కాళ్ళు పగలదీసి..
“భారతదేశ”మను ఓ గర్భిణీ స్త్రీ
ప్రసవవేదన పడుతూ వుంది.. !!
పరాచికాలు ఆడొద్దు..
పరాభవం పొందోద్దు..
“దారిద్ర్యం” ఒళ్ళు తిమ్మిరెక్కి
“కుల, మతాల” రక్త నాళాలు మంటపుట్టి
“అసహనం, అశాంతి” నరాలు పోటెత్తి
అల్లాడిన పుత్రవతి
కొత్త నెత్తురు పట్టి
గుండె ఊటలు పుట్టి
ఆనందంలో పరవశించింది..!!
మోసం చెయ్యొద్దు..
మోసమై పోవద్దు..
“భారతదేశము” పచ్చి బాలింత
తీసుకురండి
సహనము, శాంతియను పళ్ళూ, పుష్పాదులు..!
ధర్మం, న్యాయమను పసుపు, కుంకుమలు.. !
స్వతంత్ర భారతికి
కట్టండి నీతి భవనాలు, నిజాయితీ తోరణాలు..
నాటండి సమైక్య బీజాలు, స్వేచ్ఛాంకురాలు ..
వెలిగించండి సహజీవన దీపాలు, సామాన్యుల జీవితాలు..
ఆకలైన పసితండ్రి
ఆక్రందనలు విన్నారా..??
ఆనందంతో పిచ్చి కన్న
కేరింతలు చూశారా ??
ఈ శబ్దం హిమగిరి ఒడిలో జారి
వింధ్య చెక్కిలి తాకి
తూర్పు పడమర కనుమల్లో
మార్మ్రోగుతూ వుంది..
ఈ శబ్దం
కృష్ణ నుంచి యమునకు
గంగానుంచి గోదావరికి
తుంగభద్ర నుంచి కావేరికి
బ్రహ్మపుత్ర నుంచి పెన్నకు ప్రాకి
నాల్గు దశల్లో తీరాల్లో
సముద్ర ఘోషా శంఖంలో
ప్రతిధ్వనిస్తూ ఉంది..
ఈ శబ్దం
సింధూ లోయలో మొలచి
గంగ మైదానంలో పండి
డక్కను పీఠభూమిలో మర్పిడై
దేశమంతా పాతరయింది ..
ఈ శబ్దం కుంభవృష్టిగా కురిసి
చెత్తా, చెదారం
ఆకులు, అలములు తోసుకుపోతే
దేశమంతా తోమిన రాగిపత్ర వలె
తళ, తళమని అగుపించాలి
గొంగళి సీతకోకలా మారాలి.. !!
ఆ ధ్వని ఆర్తుల గుండె ధ్వనై మారాలి..!!
ఆ శబ్దం చైతన్య పునఃప్రారంభమై మారాలి..!!
Written by : Bobby Nani
No comments:
Post a Comment