Saturday, January 21, 2017

SOCOTRA (The Mysterious Island) from Bobby... 7th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ...

అప్పటికే సమయం రాత్రి పదకొండుంపావు .. 
ఆ మంటకు దగ్గరౌతున్న కొద్ది గుండె వేగం పెరుగుతోంది.. 
చివరికి ఎలాగోలా దగ్గరకు చేరుకున్నాం .. 
కాని అక్కడ ఎవరూ లేరు..!!
ఆ అఘోరా కోసం మా కళ్ళు వెతుకుతున్నాయి.. 
ఎక్కడికి వెళ్ళాలో తెలియక అక్కడే నిలబడిన మాకు ఒక ఖఠిన స్వరం వినిపించింది … 
అది ఎక్కడనుంచి వినిపిస్తుందా అని చూస్తే ..! 
సరిగ్గా మాకు రెండు అడుగుల దూరంలో వున్న అప్పుడే పూడ్చిపెట్టినటువంటి గుంటలో నుంచి అని గ్రహించాము.. 
అంత చలిలో కూడా మాకు చెమటలు పడుతున్నాయి .... 
భయంతో కాళ్ళు, చేతులు వణికిపోతున్నాయి…. 

ఏంటి చాలా టెన్షన్ పడుతున్నారా .. . ?? మరెందుకు ఆలస్యం పదండి ...

7th Part

అలా చూస్తూ ఉండగానే ఆ గుంటలోనుంచి అవలీలగా ఒక వ్యక్తి బట్టలు లేకుండా పైకి లేచి నిల్చున్నాడు.. 
తన జుట్టు తలపై చుట్టలు, చుట్టలుగా చుట్టుకొని వెనుక భాగం నుంచి నేలను తాకుతూ చాలా పొడవుగా వుంది… 
ఆ అఘోరా కళ్ళు నిప్పు కణికలవలే వున్నాయి.. 
కనుబొమ్మలు చాలా పెద్దవిగా వున్నాయి.. 
అలానే చూస్తూ నిల్చున్న మాకు ఇలా రండి అని పిలిచాడు ఆ అఘోరా.. 
బెరుకుగా వెళ్లి వరుసక్రమంలో నిలబడ్డాం .. 


మొదటి వ్యక్తిని తీసుకువెళ్ళి చాలాసేపటికి వచ్చాడు.. అలానే నా ముందు నిల్చున్న నలుగురిని తీసుకువెళ్ళి తను ఒక్కడే వచ్చాడు. నాకేమో భయంతో చెమటలు పడుతున్నాయి.. 

మనిషి చూస్తే ఇంత వికృతంగా వున్నాడు వాళ్ళను అలా పక్కకు తీసుకెళ్ళి తినేస్తున్నాడా ఏంటి ? 
అసలే అఘోరాలు నరమాంస భక్షకులు అని విన్నాను.. అనుకుంటూ నాలో నేనే భయపడుతూ వుండగా..

అవును నేను నరమాంస భక్షకుడనే కాని బతికిన వారిని కాదు… లోకంలో అత్యంత పాపాలను చేసి మరణించిన వారిని మాత్రమే సేవిస్తాను అని మెల్లిగా చెవి దగ్గరకు వచ్చి చెప్పాడు ఆ అఘోరా … 

ఆశ్చర్యంతో, భయంతో చెమటలు పడుతున్న నాకు “నువ్వేం భయపడకు నీ సమస్య తీరుద్దిలే ..!!” అంటూ మరో మాట చెప్పి నన్ను రమ్మని పిలిచాడు.. 

ఏమీ అర్ధం కాని అయోమయస్థితిలో ఆయన వెనుకగా నడిచాను … 

కొంతదూరం తీసుకెల్లాక అక్కడ ఉన్నటువంటి ఒక గుంత దగ్గర ఆగి ఏం అడగాలనుకుంటున్నావో ఇప్పుడు అడుగు…. నీకు సమాధానం చెప్తాను …. అని చెప్పాడు.. 

“నాకు ఒక కల" ….. అనగానే 

అదితప్ప మరేదైనా అడుగు... దానిగురించి నాకు తెలుసు .. ఏం చెయ్యాలో కూడా తెలుసు అంటాడు.. !!

ఇందాక నా ముందు వున్న నలుగురిని ఏం చేశారు అని అడిగాను ?? 

ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కో సమస్య.. 

సమస్యలను మనమే సృష్టించుకుంటాం, మళ్ళి మనమే బాధపడుతూ వుంటాం.. ఇలాంటి వలయాకారపు చట్రంలోనే నేటి మానవ జీవితాలు కొట్టుమిట్టాడుతున్నాయి.. ప్రారబ్ధ కర్మలు అనుభవించక తప్పదు .. కాకపోతే ఆ అనుభవించే బాధను మాత్రమే నేను తగ్గించే సహాయకుడను అని చెప్పాడు.. 

ఇవన్నీ వింటున్న నాకు ఏమి అర్ధం కాలేదు.. 

మళ్ళి నావంక తీక్షనంగా చూస్తూ “నువ్వు అన్నిటికీ సిద్దపడే ఇక్కడకు వచ్చావా ?? “ 

అని అడిగాడు.. కొంచం తడబడుతూనే అవును అన్నట్లుగా తల ఊపాను.. సరే.. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయాలు నీకు సమ్మతమైతేనే నేను మొదలు పెడతాను లేకుంటే ఇప్పుడే నువ్వు నిరభ్యంతరంగా వెనుదిరిగి వెళ్లిపోవచ్చు .. అని చెప్పాడు.. 


ఇక ధైర్యం తెచ్చుకొని …… చెప్పండి అని అన్నాను.. 

ఆయన ఇలా చెప్పడం ఆరంభించాడు.. 

నువ్వు ఇక్కడ మూడు దినములు ఉండాల్సి వస్తుంది.. ఈ మూడు దినములలో ఒక్కో దినం, ఒక్కో గుంటలో గడపాల్సి వస్తుంది … అలా మూడు దినములు మూడు గుంటలలో నీ దేహం ఉంటుంది .. కాని నీ ఆత్మ ఈ మూడురోజులు నీ దేహంలో వుండదు… ఈ మూడు దినాలకు, మూడు గుంటలకు, మూడు ప్రత్యేకతలు వున్నాయి.. వాటిని వివరిస్తున్నాను జాగ్రత్తగా విను.. 

మొదటిదినం : నువ్వు దాటివచ్చిన భూత కాలంలోకి నువ్వు ప్రవేశిస్తావు… నీ కష్టాలు, కన్నీళ్ళు, సంతోషాలు అన్నీ నువ్వు అనుభవించి వచ్చిన ప్రతీ విషయాన్ని నువ్వు దగ్గర వుండి చూస్తావ్.. 

రెండవ దినం : ప్రస్తుతం నువ్వు ఉంటున్న వర్తమానంలో జరిగే వాటిని, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను, నీ గురించి ఎవరెవరు ఎలా అనుకుంటున్నారో తదితర విషయాలను నువ్వు చూస్తావు .. 

మూడవ దినం : పై భూత, వర్తమానం ఆధారంగా నువ్వు భవిష్యత్తు లో ఎలా వుండబోతున్నావన్న విషయాలను స్వయంగా నీ కళ్ళతో చూస్తావు .. 

ఈ మూడిటిని దాటితేనే నీ సమస్య పరిష్కారం అవుతుంది.. 
మరో ముఖ్య విషయం …
చాలా భయాన్ని నువ్వు అనుభవించాల్సి వుంది.. భయపడకు నీకేం కాదు.. 
పై విషయాలను నువ్వు అంగీకరిస్తే ఇప్పుడే నేను నా పని మొదలుపెడతాను.. అని చెప్పి నా వంక అలానే చూస్తూ నిలబడి వున్నాడు.. 


వణుకుతున్న నా గొంతుతో నా ఆత్మను బయటకు తీస్తున్నారా .. ??

మరి నా దేహానికి ఏం కాదా ?? 

మళ్ళి నేను మూడు రోజులు తరువాత యధావిధిగా ఉండొచ్చా ?? అని అడిగాను.. 

ఆయన చిరునవ్వు నవ్వుతూ…. అది నీ చేతుల్లోనే వుంది.. అని అన్నాడు.. 

అర్ధం కాలేదు అని చెప్పాను.. 

నీ భయాన్ని నువ్వు జయిస్తే …. విజయం తధ్యం అని చెప్పాడు.. 

ఇక ఎలా అయితే అలా అయింది అని మనసులో అనుకోని … సరే కానివ్వండి అని సిద్దం అయిపోయాను … 

సరే ముందుగా అగ్నిలో అభ్యంగనస్నాన మాచరించి రా అని చెప్పాడు.. 

అగ్ని లో స్నానం ఏంటి అని అర్ధం కాక మళ్ళి ఏంటి ?? అని అడిగాను.. 

నువ్వు విన్నది, అనుకున్నది నిజమే.. ఆ కనిపిస్తున్న మంటలో వెళ్లి నిలబడి రా... అని చెప్పాడు… 12 అడుగుల ప్రకాశవంతమైన ఎగసిపడుతున్న ఆ మంటలలోకి నేను వెళ్ళాలా.

వెళ్తే మళ్ళి రావడమా ?? 

ఇవన్నీ ఆలోచనలతో అడుగు ముందుకు పడక అలానే నిస్తేజంగా వున్న నన్ను చూసి .. 

సందేహం వున్నచోట సమస్యకు పరిష్కారాన్ని కనుగొనలేము ... అని చెప్పాడు.. 

అగ్ని ఎలాంటి దాన్ని అయినా పునీతం చెయ్యగలదు .. దానికి అంతటి శక్తి వుంది.. నీ దేహానికి మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లదు నువ్వు నేరుగా అందులోకి వెళ్ళు అని చెప్పగానే … కొంచం భయం వేసినా నమ్మకంతో వెళ్ళాను .. నిజం చెప్పాలంటే అదో అద్బుత సన్నివేశం… నా కళ్ళను నేనే నమ్మలేక పోయాను.. అప్పుడే అర్ధం అయింది ఆయన మామూలు వ్యక్తి కానే కాదు అని.. 


అందులోనుంచి బయటకు వచ్చాక వెళ్లి ఆ గుంటలో పడుకో అని చెప్పాడు.. అలానే వెళ్లి పడుకున్నాను.. ఈ మూడు దినములు నీ దేహానికి ఎలాంటి మకిలి పట్టకుండా ఆ అగ్ని ప్రతినిత్యం సంరక్షిస్తుంది… ఇక నువ్వు ప్రశాంతంగా పడుకో అని చెప్పాడు.. నేను పడుకున్న కొన్ని నిమిషాలకు … 

మొదటి రోజు : నా చిన్నప్పుడు నేను చదువుకున్న స్కూల్ దగ్గర నేను నిలబడి వున్నాను… నాతోపాటు చదువుకునే నా స్నేహితురాలు నాకు కనపడుతోంది.. ఆమెపేరు కల్యాణి .. రెండు జడలు వేసుకొని చాలా అందంగా వుంది.. క్లాసురూములో తన వెనుకనే నేను ఎప్పుడూ కూర్చుని వుంటాను.. తనని చాలా రకాలుగా విసిగిస్తున్నాను… 

తన రెండు జడలలో కాగితాలు పెట్టడం, తనపై ఇంకు జల్లడం, తన భోజనాన్ని లాక్కొని స్నేహితులకు పెట్టెయ్యడం.. ఇలా యెంతో అల్లరి చేస్తున్నాను.. ఆ కళ్ళల్లో నీరు తప్ప పెదవులనుంచి ఒక్క మాట కూడా అనదు .. తను నా ప్రవర్తనపై బాధ మాత్రమే చూపిస్తుంది.. కోపం, ద్వేషం చూపట్లేదు… ఆరోజు నాకు నిజంగా తెలియలేదు. తను యెంత బాధపడుతూ వుందో.. 

ఇప్పుడు తెలుస్తుంది.. 

ఇంటికి వెళ్లాను అమ్మ, నాన్న యెంతో ప్రేమగా చూసుకుంటూ వున్నారు..ఒక్కగానొక్క సంతానాన్ని నేను.. నేనే వారికి లోకం.. నాన్న సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే నాతో బాగా ఆడుకునేవాడు… అవన్నీ అలా కళ్ళముందు కదులుతున్నాయి… చూస్తుంటే కళ్ళల్లోనుంచి నీరు వచ్చేస్తుంది... ఇలాంటి అందమైన జీవితాన్ని నేను నా అహం వల్ల నాశనం చేసుకున్నానా ?? 

అందరినీ దూరం చేసుకొని ఏం సాధించాను ?? 

నా మీద నాకే అసహ్యం వేస్తుంది .. అని అనుకుంటూ ఆ రోజంతా అలాంటి జ్ఞాపకాలతోనే ప్రయాణించాను .. 

రెండవ రోజు : ఎప్పటిలాగానే ఉదయాన లేపలేదని ఆ పని పిల్లాడిని కాలుతో కొడుతూ లేచాను.. 

వాడేమో ఏడుస్తూ … 

నిన్న లేపినందుకు కొట్టారు కదా సర్ … అంటూ బాధపడుతున్నాడు.. అదేంటో అవన్నీ చేస్తున్నప్పుడు అనిపించని భావనలు ఇప్పుడు ఇలా చూస్తున్నప్పుడు తప్పు అనిపిస్తున్నాయి.. 

పని పిల్లాడు నా దగ్గరకు వచ్చి సర్ నేను రెండు రోజులు ఇంటికి వెళ్లి వస్తాను .. నాకు సెలవు ఇప్పించండి అని అడుగగా… 

ఎందుకురా?? 

మనం ముందే ఒప్పందం చేసుకున్నాం కదా..!!

సెలవులు పెట్టనని అన్నావ్.. అన్నిటికీ ఒప్పుకొనే కదా నిన్ను నేను చదివిస్తున్నాను, మల్లి జీతం కూడా ఇస్తున్నాను .... నిజమే సర్ కాని ఇంట్లో అమ్మ పరిస్థితి అస్సలు బాలేదంట కబురు చేసారు.. ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను సర్ .. 


అని కళ్ళలో నీరుపెట్టుకొని ప్రాధేయపడుతూ వున్నాడు.. అస్సలు కుదరదు మాట అంటే మాటే అని నిక్కచ్చిగా చెప్పేసాను.. 

సరే సర్ మీరు చెప్పినట్లే నేను వుండిపోతాను .. కాకపోతే నాకు కొంచం డబ్బు ఇవ్వగలరా ??

నా జీతంలో పట్టుకోండి … 

కనీసం డబ్బు అయినా పంపుతాను అని అనగానే … అయినా ఇది నెల మధ్యన కదా ఎలా ఇవ్వగలను?? 

మరో 10 రోజులు ఆగు అప్పుడు ఇస్తాలే అని చెప్పి అక్కడనుంచి వచ్చేసాను… కార్ డ్రైవర్ ని పెద్ద పెద్దగా తిడుతున్నాను…

తను చేసిన తప్పు ఓ ఐదు నిమిషాలు లేట్ గా రావడం.. అందుకు గల కారణం తన పిల్లల్ని స్కూల్ లో వదిలి వచ్చేసరికి 5 నిమిషాలు ఆలస్యం అయింది. 

కార్లో ఆఫీస్ కి చేరుకున్నాను.. 

అప్పటివరకు నవ్వుకుంటూ వున్న పనివారు నేను వచ్చేసరికి మొహాలు చాలా అసహ్యంగా పెట్టి వచ్చాడు “శని గాడికి పనిగాడు” అని తిట్టుకుంటూ కోపంతో నన్నే ఉరిమి చూస్తూ వున్నారు.. 

నిజంగా నాకు అప్పుడు ఇవన్ని తెలియలేదు.. నేను గమనించలేదు కూడా.. 

ఆఫీస్ కి రావడం రావడమే అక్కడ పనిచేసే సర్వెంట్ ని అరుస్తూ వచ్చాను.. నా క్యాబిన్ లో సరిగా తుడవట్లేదని .. 

నేను వెళ్లి కూర్చున్న కొన్ని నిమిషాలకే డమేల్ అని పెద్ద శబ్దం తో రంగు రంగుల కాగితాలు పేల్చారు.. స్నో బాటిల్ తో ఒకరిపై మరొకరు చల్లుకుంటూ వున్నారు.. ఎవడిదో పుట్టిన రోజు అంట… కేకులు, ఆ క్యాండిల్స్, ఆ చప్పట్లు, ఆ అరుపులు, కేకలువేస్తూ తెచ్చిన ఆ కేకుని ఒకరికి మరొకరు పూసుకోవడాలు చేస్తున్నారు.. ఇవన్ని చూస్తున్న నాకు కోపం చిర్రెత్తుకు వచ్చింది.. 

లేచి పెద్దగా అరిచి ఇది ఆఫీస్ అనుకున్నారా ?? 

మీ ఇల్లు అనుకున్నారా ..?? 

మీరు అసలు మనుషులేనా ?? పుట్టినరోజు లో ఏముంది పెద్ద విషయం …. రోజులు కొన్ని లక్షల ప్రాణులు పుడుతూ ఉంటాయ్, చస్తూ ఉంటాయ్ దాన్ని ఏదో ఘనకార్యం సాధించిన వారిలా భావిస్తున్నారు.. ముందు లక్షలు సంపాదించడం నేర్చుకోండి … ఇవన్ని కాదు.. 

కూటికి లేనోడు కూడా పుట్టినరోజు ఘనంగా చేసుకోగలడు .. కాని గొప్పవాడు వుండి కూడా చేసుకోడు.. నేను అంతే .. ఎందుకంటె ఈ సరదాలు చేసుకునే సమయంలోనే మనం మన సంపాదనను కోల్పోతున్నాం.. ఈ సమయాల్లో ఇంకెంతో డబ్బును సంపాదించొచ్చు .. అని అరవగానే .. 

మీకు చెప్పాల్సిన అవసరం లేదు... మేము మేనేజ్మెంట్ ని పర్మిషన్ అడిగే ఈ సెలేబ్రేషన్స్ చేసుకుంటున్నాం.. మీకు అంత ఇబ్బందికరంగా వుంటే మీరు వెళ్లి డబ్బు సంపాదించుకోండి. మాకు అవసరం లేదు.. అని అందరూ తిరిగి అనేసరికి అక్కడనుంచి వీళ్ళు మారరు అనుకుంటూ వచ్చేసాను.. 

రోడ్ లో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు .. వీరి తల్లిదండ్రులు అంత భాద్యతారహితంగా వీళ్ళను ఎలా ఆడుకోనిస్తున్నారు.. 

ఆడుకుంటే ఏం వస్తుంది?? 

చదువుకుని మంచిగా ఫారెన్ లో స్థిరపడమని ఏ ఒక్కరు ఎందుకు చెప్పట్లేదు… అందుకే ఇక్కడ మనుషులు ఇలా వున్నారు.. సర్దుకుపోయే ఈ బానిస మనస్తత్వాల మధ్యన నేను నలిగిపోతున్నాను… అని అనుకుంటూ, నసుక్కుంటూ, తిట్టుకుంటూ … 

మరో రెండు సంవత్సరాలలో వీళ్ళను, ఈ దేశాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోయి అక్కడే స్థిరపడిపోతాను .. అప్పటివరకు భరించాలి వీళ్ళందరినీ .. తప్పదు .. అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను … అలా ఆ రోజంతా అలాంటి జ్ఞాపకాలతోనే ప్రయాణించాను .. 


మూడవ రోజు : నా మంచం పై నేను పడుకొని వున్నాను… టైం ఉదయం 10 అవుతోంది.. కాని ఎంతకీ లేవట్లేదు.. పనిపిల్లాడు వచ్చి పనులు చక చకా చేసేసి నాకు తినడానికి టేబుల్ మీద పెట్టి లేపడానికి వస్తున్నాడు..

To be continued …

Written by : BOBBY

10 comments:

  1. Very intresting .....suspence latho champestunnaru.....but aa matram twist lu lekapote story chadivevariki trill undadu...

    ReplyDelete
    Replies
    1. Avunu andi.. anduke prathee paragraph lo oka malupu raasthoo vasthoonnanu.. chaduvarulanu balavanthamgaa kakundaa istamgaa koorchopetti chadinchalani raasthunnaanu.... (*_*)

      Delete
  2. Antandi suspence lo aapesaru.malli 1 week aagalaaa

    ReplyDelete
    Replies
    1. hahahahaha mari aa tension vuntene kadandi chadavalanna mee korika.. chadivinchaalanna naa korika teeredi.. (*_*)

      Delete
  3. Antandi suspence lo aapesaru.malli 1 week aagalaaa

    ReplyDelete
  4. చాలా బాగా వ్రాస్తున్నారు.. అస్తమయ పురం.. అఘోరా... అగ్నిస్నానం... మూడు గుంటలు... చాలా బాగా వివరించారు.. అన్నీ కళ్ళ ముందు జరిగినట్లు అనిపిస్తోంది... keep it up bro...

    ReplyDelete
    Replies
    1. thank u bro...
      “అస్తమయపురం” ఆ పేరు పెట్టడానికి నాకు కొన్ని గంటల సమయం పట్టింది.. మొదటి అక్షరం “అ" ఈ అక్షరం ఉచ్చరించేటప్పుడు మన కంఠం మొదలు నుంచి నాభి దగ్గర దాకా ఒక బిలం తెరుచుకుంటుంది.. ఇది శబ్ద శాస్త్రం లో ఒక ముఖ్యమైన ఘట్టం.. ఆ స్వరం ఆధారంగా ఒక అనుకూలమైన శక్తి మనలో ఉద్భవిస్తుంది.. చివరన “రం” అనే అక్షరం తో ఆ బిలం మూసివేయ బడుతుంది.. ఇలాంటి ఒక పదాన్ని సృష్టించాలని చాలా తపన పడాల్సి వచ్చింది.. ఇలా ఈ కథలో చెప్పుకుంటూ పోతే .. ప్రతీ పదానికి ఒక విశిష్టత ఉంది..

      Delete

    2. వామ్మో !

      జిలేబి

      Delete