నా గుండెను పారేసుకున్నాను.. (ఎవరికైనా కనపడితే కాస్త తెచ్చి పెట్టరూ ...)
******************************************************
గులాబీ, టొమాటోవంటి
గుప్పెడు గుండెను పారేసుకున్నాను....
జ్ఞాపకారణ్యం యెంత వెతికినా
దాని ఆచూకి తెలియటం లేదు..
కుటుంబంలో అందరినీ అడిగాను ..
దిగులుగా తెలియదన్నారు..
వీల్లలాగే అది నన్ను నమ్ముకుంది..
ఎక్కడ పడిందో దొరక్కుండా వుంది..
గుండె లేకపోయినా
నాకు ఊపిరి ఆడుతూ,
లోకం నడక సాగుతూ,
పెట్రోలు నాగరికత పెరుగుతూ వుంది..
సుమతీ శతకంలో
నెమలీకలా దాచానో..
ఎక్కాల పుస్తకంలో
రంగుల పట్టుదారం ముక్కలా వుంచానో..
బడికిపోతూ వస్తూ రైలుకట్ట గులక రాళ్ళలో
బలపంలా పారేసుకున్నానో ..
ఎండిన చెట్టు మీంచి
ఏటవాలుగా శూన్యంలోకి పోయే పక్షిలా..
పగిలిన బాడవ పొలం నెర్రెల్లోకి
పరారయ్యే తొండలా ..
నాగరిక జీవిత ధ్వని చేలంలో
నిశ్శబ్దపు చిగురుల్లోంచి పోయివుంటుంది..
గుండెను కుంకుముగా అమ్మ నుదుట పెట్టలేక
ఆమె గాజు పూసతో పారేసుకున్నానో..
అమ్మి వేసిన ఇంటిలో అన్నీ ఇటుకలతో
గుండెను కూడా వదిలేసి వచ్చానో..
వర్తమానం లాల్చీ తొడుక్కుంటూ..
గతం చొక్కాతో వదిలేశానో..
భవిష్యత్తు ధోవతి ఇస్త్రీ చేసుకుంటూ కాల్చుకున్నానో..
స్మృతిటార్చితో అనుభవాల చీకటి గది వెతికితే
నోటినిండా విషాద సంగీతం..
బస్టాప్ దుమ్ముల్లో బోర్లుతూ వుందో..
రైల్వే స్టేషన్ డస్ట్ బిన్ లో కూరుకుపోయిందో..
కాలేజి ప్లే గ్రౌండ్ లో పరుగెడుతూ వుందో..
లైబ్రరీ దుమ్ము పుస్తకాల వెనుక ఇరుక్కుపోయిందో..
డిగ్రీ కోసం నిద్రపోని పుస్తకాల కట్టలలో పడిందో..
గాలికి దొర్లి,
ఎండకు ఎండి,
వానకు తడిసి,
చలికి వణికి
వీధిలో కేక పెడుతూ వుందో..
మహాకవి కవ్యంలోంచి చినిగిన కాగితంలా
మహా గాయకుడి గొంతులోంచి రాలిపడ్డ రాగంలా..
చివికిందో, చితికిందో, చిద్రుపలయిందో..
ఎక్కడుందో, ఏమైందో, ఎలావుందో..
పనిషి తిరిగే చోట పడివుంటుంది..
వచ్చే పొయ్యే ప్రతీ మనిషిని అడుగుతూ వుంటుంది..
గుండె భాష అర్ధమయివుంటే నాకిచ్చెయ్యండి..
మీరు తొక్కితే పగిలే, తన్నితే దొర్లే దాన్ని
నేను చూళ్ళేను, అది లేకుండా ఉండలేను..
నేను పోయినా మిగిలేది నా గుండె మాత్రమే..
నేను నడిచి వచ్చిన రోడ్లన్నీ దాటుకుంటూ..
పుట్టినచోటికి పోయేలోగా
నా గుండెను వెతుక్కుంటాను..
అనుభవాల తెరలు తీసి జ్ఞాపకాల తలుపులు తెరిచి
గతంలో ప్రయాణం చేసి
నా గుండెను కలుసుకుంటాను...
నాకు తెలుసు
ఒకనాటికి నేను నా గుండెను కలుస్తాను ..
లోకానికి మిగులుతాను..
Bobby Nani
soo nice babu garu
ReplyDeletethank u soo much andi
Delete