సాధించాలనే తపన ఉంటే సరిపోదు .. దానికి ఒక దారికూడా కావాలి.. ఆ దారే గమ్యం వైపు అడుగులేయిస్తుంది.. ఇది చదివాక మీలో ఎక్కడో ఓ మూల ఓ ఆవగింజ లో అనుసంత అయినా మార్పు వస్తుందేమో చూద్దాం..
నేటి మన భారతదేశం ఎదుర్కొంటున్న ముఖ్య సమస్య నిరుద్యోగం. ఎన్ని డిగ్రీలు చదివినా ఫలితం మాత్రం శూన్యం. ఉద్యోగాలు దొరకడం లేదు. ప్రైవేట్ సంస్థలు ఇదే అదునుగా చేసుకొని సవాలక్ష నిబంధనలు పెడుతున్నాయి..... వయస్సు, లింగ భేదం, ఆఖరికి వర్చస్సు కూడా చూస్తున్నాయి.... పరిగెత్తండి, పరిగెత్తండి అంటూ తల్లితండ్రుల దగ్గరనుంచి పాఠశాల యాజమాన్యం వరకు చెప్పే మొదటి, చివరి మాట ఇదే.. ఎక్కడికి పరిగెత్తాలి ?? కొన్ని కోట్ల వీర్య కణాలలోనుంచి పరుగెత్తి, పరుగెత్తి అలసి, సొలసి ఇలా ఊపిరి పోసుకొని వచ్చాం.. ఇక చాలు.. నేటి కాలంలో కావాల్సింది పరిగెత్తడం కాదు.. గొడ్డులా పని చెయ్యడం కానే కాదు..
మరేంటి ??
ఏంటి ??
ఆలోచించడం .. !
అవును మీరు విన్నది నిజం ..
నేను గడచిన 8 ఏళ్ళ నుంచి కనుగొన్నది కూడా ఇదే..
ఏంటి చమత్కారం అనుకుంటూ వున్నారా.. సరే విషయం లోకి వెళ్దాం..
మన దేశంలో సగటున 40 శాతం మంది యువత ప్రతీ ఏటా చదువు పూర్తి చేసుకొని నిరుద్యోగంతో జీవిస్తున్నారు.. వారిలో కొందరు కుటుంబ పోషణార్ధం వారి చదువును, ఆశయాలను పక్కన పెట్టి ఏ ఉద్యోగమైన సరే చెయ్యడానికి సిద్దం అయిపోయి చేసుకుంటూ వున్నారు... అంతెందుకు మొన్నటికి మొన్న కానిస్టేబుల్ ఉద్యోగ దరఖాస్తుకు ఇంటర్ పాస్ అయినవారు సరిపోతారు.. కాని పి.హెచ్.డి. పాస్ అయినవారు, ఎం.టెక్, చేసినవారు షుమారు 30,000 మందికి పైగా దరఖాస్తులు పంపారు.. ఇక బి.టెక్, డిగ్రీ చేసిన వాళ్ళు అయితే కోకొల్లలు.. కేవలం 4000 ఉద్యోగాలకు వేలల్లో ఇలా దరఖాస్తులు చెయ్యడం చాలా బాధాకరమైన విషయం.. ఇక ఇంటర్ వాళ్ళను ఎందుకు ఎంపిక చేస్తారు ?? అంటే వాళ్ళు అనర్హుల క్రిందే కదా లెక్క.. ఒకరి ఉద్యోగమును మరొకరు భక్షించడం (చిన పామును పేద పాము మింగడం) లాంటిది..
బ్యాంకు ఉద్యోగాలు అయితే చెప్పనక్కరలేదు... ఆ పేపర్ చూస్తేనే దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుంది.. వాటిల్లో ముఖ్యంగా ఇంగ్లీష్ పేపర్ .. ఎక్కడో అమెరికాలో ఒక మ్యాగజైన్ లో ప్రింట్ అయిన ఒక టాపిక్ తీసుకొచ్చి ఇక్కడ ప్రింట్ చేసి వాటిల్లో 10 ప్రశ్నలు వెయ్యడం చాలా శోచనీయం... అయినా అలా ప్రిపేర్ చేసేవాళ్ళు ఏం చేస్తారు ?? పోటీ అలా వుంది.. ఐ.బి.పి.ఎస్ 8000 ఉద్యోగాలకు దాదాపుగా ముప్పై లక్షల మంది రేపు పరీక్షలు రాయబోతున్నారు అంటే మీరే ఊహించండి.. ఇంత పరుగుపందెం ఒలంపిక్ లో కూడా వుండదేమో..
ఎక్కడ చూసినా పోటి.. ఉరుకులు, పరుగులు.. ఉద్యోగం కొట్టాలనే తపన వాళ్ళను తారాస్థాయికి తీసుకువెళ్తుంది.. ఈ నేపధ్యంలో వారిలో కొందరు స్ట్రెస్ కు లోనై రాబోయే రోజుల్లో భారీమూల్యాలను చెల్లించుకోవాల్సి వస్తుంది.. మీరు పడే ఇంత స్ట్రెస్ లో ఓ పావు వంతు ఆలోచిస్తే మీ జీవితం మరోలా వుంటుంది ..
ప్రస్తుతం మీ ఆలోచనలు గొంగళిపురుగులా మందంగా ముందుకు సాగుతున్నాయి.. ఒక గొంగళిపురుగు ఒక చెట్టు పైనుంచి మరో చెట్టు పైకి వెళ్ళాలంటే యెంత శ్రమ పడాలి, యెంత శక్తి ఖర్చు చెయ్యాలి.. అన్నిటికన్నా ముఖ్యం సమయం చాల వృధా .. సరిగ్గా ఇలాంటి పోటీలోనే కొందరు యువత ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు.. మీ గొంగళిపురుగు ఆలోచనలను రంగు, రంగుల సీతాకోకచిలుకలుగా మార్చండి ... వేగం, సమయం, శ్రమ, శక్తి ఇవన్ని మీకు ఖర్చు కాకుండానే నచ్చిన చెట్టుపైకి క్షణాల వ్యవధిలో వెళ్లి అమాంతం మకరందాన్ని యెంత కావాలంటే అంత జుర్రుకోవచ్చు.. ఇవన్ని ఏదో చెప్పాలని నేను చెప్పట్లేదు.. ఎన్నో రోజులనుంచి మీతో పంచుకోవాలని అనుకుంటూ వున్నాను.. ఇప్పటికి సమయం ఆసన్నమైంది.. దానికి కావాల్సింది మీరు స్వతహాగా ఆలోచించడం..
"Not Hard Work, please do smart work.. " ఈ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను..
ఈరోజుల్లో కావాల్సింది ఏదైనా కొత్తగా చెయ్యడం ... దానికోసం పదును పెట్టండి మీ మస్తిష్కాలకు .. మొన్నటికి మొన్న ఓ పదునెనిమిది ఏళ్ళ బాలుడు కేవలం కొబ్బరి బొండాల వ్యాపారం మీద నెలకు 40 వేలు ఆదాయం అర్జిస్తున్నాడు.. ఇదెలా సాధ్యం.. ?
గ్రాడ్యుయేట్లు చేసిన మనం కనీసం కుటుంబ పోషణను కూడా సక్రముగా నిర్వర్తించలేక పోతున్నాం.. లోపం ఎక్కడ ? మనలోనే.. నిస్సందేహంగా మనలోనే..
నేను గ్రహించింది కొన్ని చెప్తున్నాను..
1. మనం చెయ్యాలనుకున్న పని సమయానికి ముందే చెయ్యడం..
2. వేగంగా చెయ్యడం..
3. చేసేపని వేగంతోపాటు నాణ్యతగా ఉండేలా చూడటం..
4. ఆ పనిలో (Honest) నిజాయితీ ముఖ్యంగా వుండటం..
సహనం, ఓపిక, శ్రద్ద, ఇంద్రియ నిగ్రహం, చిరునవ్వు, వాక్చాతుర్యం, బట్టల విషయంలో శ్రద్ద, ముఖ్యంగా మన (attitude) పద్దతి వక్రం గా లేకుండా చూడటం. ఇదే (success) విజయానికి బెత్తెడు దూరంలో ఉంచుతుంది.. ఆ బెత్తెడు ఎందుకంటార ...! విజయం అందుకున్నాక విశ్రాంతి కావాలనిపిస్తుంది.. అది మనకు వద్దు.. దానికి సమయం చాలానే వుంది.. ఇప్పుడు కాదు..
ఇదే నేను అవలంబించే పద్దతి.. ఇలాంటి ఆశయాలతో ఇవే ఆలోచనలతో ఎవరన్నా ఉంటే సభాముఖంగా తెలియచేస్తున్నాను.. నాకు పర్సనల్ మెసేజ్ చెయ్యండి.. అందరం కలిసి ఆరోగ్యవంతమైన చర్చ జరిపి ముఖపుస్తకానికి ఓ కొత్త నాంది పలుకుదాం.. అందరం కలిసి ఆలోచిద్దాం.. కొత్త కొత్త ఆలోచనలతో మన పని మనమే చేద్దాం.. అందరి ఆలోచనలు యెంతో అమూల్యమైనవి.. అవి అద్బుతాలు సృష్టించగలవు.. చేతులు కలపండి..
Bobby Nani
No comments:
Post a Comment