Tuesday, September 20, 2016

ఈ రోజు చాలా బాధాకరమైన రోజు..




ఈ రోజు చాలా బాధాకరమైన రోజు.. 

17 మంది వీర జవాన్లను కోల్పోయాము.. తెలియకుండానే కళ్ళలో నీరు వచ్చేస్తున్నాయి.. మనకు ఎమౌతారని మనకోసం ప్రాణాలను లెక్కచెయ్యకుండా వారి ప్రాణాలను కోల్పోయారు .. తల్లిదండ్రులను, కన్న బిడ్డలను, కట్టుకున్నవారిని, విడిచి ఒంటరిగా నిలబడి కునుకువెయ్యక నీ ప్రాణాన్ని పనంగాపెట్టి మరీ కాపలా కాస్తున్నావు... పుడమితల్లి రక్షణకోసం, దేశ సంరక్షనే నీ ధ్యేయంగా భవభందాలను పక్కనపెట్టి నీ ఆఖరి శ్వాస వరకు మాకు ఊపిరిపోస్తున్నావు.. ఏమిచ్చి తీర్చుకోగలమయ్యా నీ ఋణం.. కన్నీటి అశ్రువులు తప్ప... 

నాలుగు దిక్కులనుంచి తుపాకీ తూట్ల వర్షం, మందుగుండ్లు దూసుకువస్తుంటే... ఈ బంగారు దేశాన్ని దోచుకోవాలని చుస్తుంటే... గుండే నిండా ధైర్యం తో, అచంచల అత్మ విశ్వాసంతో, భరత మాతను కాపు కాస్తున్నావు.. భగ భగ మండే ఎండల్లో, గడ గడ వణికించే చలిలో... రేయి, పగలూ తేడా లేక ధైర్యంగా నిలుచున్నావ్ ... నీ కోసం బతికే తల్లి తండ్రులను విడిచి, నిన్నే నమ్ముకున్న వారిని వదిలి కర్తవ్యం కొసం బరిలో నిలిచావు ... భార్యా బిడ్డల సంరక్షణ భరతమాతకొదిలేసి దేశ రక్షణలో నిమగ్నమైన ధీరుడవై బుల్లెట్ల వర్షంలో, బాంబుల భీభత్సంలో మరణాన్ని కౌగిలించుకుని ముందుకు సాగుతున్నావ్ .... ఏంటయ్యా నీ ధైర్యం.. 

ఎప్పుడొస్తావని పాప అడిగితే కంట నీరు కార్చి సమాదానం చెప్పలేని నిస్సహాయునిలా నువ్వు మారితే...వదిలి వెళ్ళకు నాన్నా అంటూ ఆ చిన్నారి రెండుకాళ్ళు గట్టిగా పట్టుకుంటే మాయ మాటలు చెప్పి విధి నిర్వహణకై, దేశ సంరక్షణకై ముందుకు కదిలే నీ ఆత్మస్థైర్యాన్ని ఎలా ప్రశంసించాలి.. 

పేపర్ చదువుతూ, టీవి చుస్తూ, సోషల్ నెట్వర్క్స్ లో కాలయాపన చేస్తూ, కుటుంబంతో నిశ్చింతగా గడుపుతున్న మాలాంటి వారికి ఈ స్వేచ్ఛను కల్పించి, నీ స్వేచ్చలన్నీ మాకోసమే విడిచేశావ్ కదయ్యా ... మేము ఇలా వున్నామంటే నీ వీరత్వ త్యాగఫలమే కదా ... సందేహం లేదు ఓ వీర సైనికుడా ఏమిచ్చి తీర్చుకోగలం నీ ఋణం..... వెలకట్టలేనిది నీ ధీరత్వం... జయహో వీర సైనికుడా జయహో... 

ఓ విధినిర్వహణ కర్తకు, 
ఓ అసమాన ధీర మూర్తికి, 
ఓ అజేయ నాయకుడకు, 
ఓ నిర్భయ హృదయుడకు,
ఓ సాహసికుడకు, 
ఓ పరాక్రమవంతుడకు,
మనము విలువ కట్టలేము.. కాని మన గవర్నమెంట్ మాత్రం విలువ కట్టేసింది.. తలో ఐదో, పదో ఇచ్చి కొంచం రిబ్బన్ ముక్క తగిలించి, కొన్ని రౌండ్స్ గాలిలో కాల్పులతో సత్కరించడం.. వహ్ శబాష్ ... 

స్పోర్ట్స్ లో నెగ్గినా నెగ్గకున్నా వారికి మాత్రం ఖరీదైన వసతి, ఖరీదైన భోజనం, ఖరీదైన సదుపాయం మధ్య మధ్యలో యాడ్స్ రూపంలో ఖరీదైన పారితోషికం, పేరంటాలకు, పనికిమాలిన ఓపెనింగ్స్ ఫంక్షన్స్ కు ప్రముఖుల నుంచి, ప్రముఖుల సరసన పిలుపులు వారితో ఆలింగనాలు .. ఇదే నేటి మన భారతం.. 

అక్కడ బోర్డర్ లో ఏం దొరికితే అది తిని ఒక్కోసారి మంచి నీళ్ళతో కూడా సరిపెట్టుకొని నిలబడేవాడు మన జవాన్.. అతనే నిజమైన మా హీరో.. 

ఆ 17 మంది లో ఓ వీర జవాన్ చివరగా తన తల్లికి ఫోన్ చేసి అమ్మ నేను బోర్డర్ కి వెళ్తున్నా ఎందుకో నీతో కాసేపు మాట్లాడాలని వుంది కాసేపు మాట్లాడమ్మ అంటూ తన తల్లితో చాలా సేపు మాట్లాడి ఆ మాటలే తన చివరివి అయిపోయాయే అని ఆ తల్లి కన్నీళ్ళకు, రోదనకు మనసు చెలించి పోతుంది.. 

మరో జవాన్ తన సోదరికి పెళ్లి పెట్టుకొని నేను బోర్డర్ నుంచి వీలైనంత త్వరగా వస్తాను చెల్లి పెళ్లి చాలా బాగా చెయ్యాలి అని చెప్పి తిరిగిరాని లోకాలకు పయనమైపోతే ఆ కుటుంబం కార్చే కన్నీటి ప్రవాహానికి అడ్డుకట్ట కట్టేదెలా.. 

నా కన్నీటి అశ్రునివాళి తో వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను..

BOBBY NANI

8 comments:

  1. సరిహద్దుల్లో జవాను ప్రాణాలొదులుతుంటే కనీసం స్పందించలేకపోతున్నారే!

    ReplyDelete
    Replies
    1. ఎందుకు స్పందిస్తారు సర్.. చనిపోయినవాళ్ళ వల్ల వీళ్ళకు ఏమి లాభం లేదు కదా.. అందుకే స్పందించరు .. ఒకవేళ లాభం వస్తుందంటే మాత్రం శవాన్ని కూడా వదలరు.. ఇదే నేటి రాయకీయం..

      Delete
    2. ఈ రాజకీయ నాయకులు terrorists కంటే ప్రమాదకరమిన వాళ్ళు.

      Delete


  2. పదినోళ్ళబడుచు చంపిరి
    కుదిపిరి ముష్కరులు! వీరి కుత్సిత కుహనా
    గదమాయింపులకు బెదుర
    రు దమ్ముగల మా జవాన్లు రొమ్ముద్రొక్కున్ !

    జిలేబి

    ReplyDelete
  3. మన స్పందనలన్నీ కాలక్షేపం విషయాలకే పరిమితం ఐపోతున్న రోజులండీ. ఐతే డబ్బు లేకపోతే వినోదం. మిగతావాటి గురించి మాట్లాడుకొనే తీరికలేని వాళ్ళమైపోయాము కదా. వీరసైనికుల ఆత్మత్యాగాలను గురించి చదివి అయ్యో అనుకొని వెంటనే మరిచిపోయే మనవాళ్ళు ఒక క్రికెటర్ గురించో ఒక పొలిటీషియన్ గురించో‌ ఒక వార్త చదివి దాని గురించి రోజంతా చర్చిస్తారు!

    ReplyDelete
    Replies
    1. well said sir ... మీరు అన్నది అక్షర సత్యం.. చెడుకు వున్న విలువ ఈ రోజుల్లో మంచికి ఉండట్లేదు సర్.. మస్తిష్కాలు మరుగున పడిపోతున్నాయి.. మీలాంటి పెద్దలే ముందుండి నడపాలి సర్..

      Delete