కలలు కనడం మానవ నైజం.. ఆ కలల్లో కొన్ని భయాన్ని కలిగిస్తే మరికొన్ని సంతోషాన్ని కలిగిస్తాయి.. మరికొన్ని అందంగా, అపురూపంగా, అపూర్వంగా కూడా వుంటాయి.. అలాంటి అందాలలో జనియించినదే నా ఈ ఊహా సుందరి.. సాధారణంగా కలలు కొన్ని గుర్తుండవు ప్రక్కరోజు సరిగ్గా అలాంటి సన్నివేశాన్ని కాని లేదా ఆ కలలో కనిపించిన వస్తువులను, రంగులకు, మరేవైనా చూసినప్పుడు ఆ కల మళ్ళి మన మస్తిష్కంలో పునరావృతం అవుతుంది.. అలా మర్చిపోయిన ఊహా సుందరిని ఈరోజు ఓ భూలోక సుందరి పునరావృతం చేసింది.. ఆ నెల్లూరు నెఱజాణ గురించి ఈ చిరు మధుర మందార ధార ..
నా ఊహా సుందరి..
*****************
నా కలల రూపమా...
నా బ్రతుకున కర్దమా..
కావ్య కథానాయికల
కలబోసిన అందమా.. !!
ఊహల ఉయ్యాలలో ఊగించుట న్యాయమా ?
నీ తలపుల తరంగాల తేలించుట ధర్మమా ?
ఊహల వుచ్చులనుండి ఎప్పటికి విముక్తి ?
ఆలోచన అలలనుండి ఏనాడు తీరానికి తాకేది ?
నీ కొరకై వేచిచూసి, నిరీక్షించి, నీరసించి
కనులు మూత పడగానే కనుల ముందు మెరిసేటి నా
కలల ఊహాసుందరివే ..
మధురమైన నీ ఊసులు వీనులకు విందులు..
నీ అధరామృత సుధలు సంజీవని సమంబులు ...
నీ సాంగత్యం నాకు ఇంద్రలోక సమానం..
నీవులేని ప్రతీ నిమిషం కర్కశ నరక ప్రాయం...
నీ కొరకై నిత్య జపము తపము చేసి శుష్కించి
కనులు మూతపడగానే కనుల ముందు మెరిసేటి నా
కలల ఊహాసుందరి...
నీ సుకుమారము చూసిన మరుమల్లియ తెల్లబోయే..
నీ నడకల హొయలు గన్న మయూరము చిన్నబోయే ..
అందానికి అందమా.. గగనమందు చంద్రమా..
ఆమనిలా అరుదెంచి పులకరింపచేయుమా..
చకోరమై ఎదురుచూసి అలసిపోయి సొమ్మసిల్లి
కనులు మూతపడగానే కనుల ముందు మెరిసేటి నా
కలల ఊహాసుందరి నీవే కదా..
(మీరు చుస్తున్నటువంటి ఈ అద్బుత కళా ఖండం విశాలేంద్ర గారు గీచినటువంటి చిత్రం.. ఆయన ఇలాంటి ఎన్నో చిత్రాలకు జీవం పోశారు..)
Bobby Nani
No comments:
Post a Comment