Saturday, February 9, 2019


రాయకపోవడం అనేదానికన్నా 
సమయం లేక రాయలేకపోతున్నాననే చెప్పొచ్చు 
రాసేందుకు ఏమీ లేదు అని అనడం మాత్రం నేరమే అవుతుంది 
తనది కాని వాక్యంలో మోము వెతుక్కునే 
పరాయితనాన్ని, ఉదయ సంధ్యల విషాదాన్ని, 
పొద్దు పుచ్చిపోతున్న రెండుకళ్ళ కిరాయితనాన్ని, 
నిశ్శబ్ద నిస్పృహల కేసి ఉరితియ్యడం విచారమే మరి..!!

తవ్వి, తవ్వి తలకెత్తుకునే దుఃఖంలో 
ఎగురుతున్న కాగితమే ఓ కందకం కాగా 
కాల్జారిపోతున్న పరాధీనతకి 
పట్టుదొరక్క పోవడం దుర్భరమే అవుతుంది..!! 

మైళ్ళకొద్దీ వ్యాపిస్తూ, 
పూలవూసుల నిట్టూర్పునీ, 
గాలి తరగల కన్నీటినీ 
తపనగా తడిమి తడిమి చూడాల్సిన అయిదు వేళ్ళూ,
కణుపులు కణుపులుగా విరిగి మోపు కట్టెల వేటుగా 
పుట్టి పెరిగిన అరచేతుల పునాదుల్లో బిక్కటిల్లిపోవడం దైన్యమే 

భరించలేని అవ్యక్తాల బరువు క్రుంగదీస్తుంటే 
వ్యక్తమై వున్న వాక్యాల బోలుదనం సిగ్గుపడేలా చేస్తుంటే 
కాలాన్ని ద్రవ్యీకరించడం లోనూ, 
ద్రవీకృతం కానున్న పరిసరాల్ని గడ్డకట్టించడం లోనూ 
చేయి తిరిగిన వంచనా శిల్పం 
అన్నీ భాయోత్పాతాల భీభత్సాల ఆత్మ నిమజ్జనాన్ని 
కదిలి కదిలి వింటున్నట్లు వినిపించే యంత్ర లోలకమై 
సరిహద్దులు దాటదు 

ప్రగల్భాల శుష్క ప్రియాల సుఖలాలసల మోహాన్ని 
అలుపు తెలియకుండానే విరామ సంగీతాలు వినడాన్ని 
ఒక అగాధపు అభివ్యక్తితో తూకం వేయాల్సి వుంది 
నిన్న పకపకలు తొణికినప్పుడు 
ఇవాళ నిశ్శబ్ధమై రోదించినప్పుడు 
ఒకే స్తబ్ధతలు వీస్తున్న ఈ వానకారు మధ్యాహ్నపు 
చీకిచెట్టు చిటారు కొమ్మెక్కడుందో, 
ఎన్ని తుఫాన్లతో అది ఓడి వేసారిందో, 
మనసు చిక్కబట్టుకుంటే తప్ప భావరశ్మి దొరకదు 
బ్రతకడం మానేసినట్టనిపించే 
ఈ భయానకమైన నా సందేహపు ఆకలి ఎన్నటికీ తీరదు..!!

Written by: Bobby Nani

No comments:

Post a Comment