పసిడిమనస్సులు
************
ఎత్తుగా,
ఒత్తుగా,
పెరిగిన పంటచేలలో..
గుంపులు గుంపులుగా పనిచేస్తున్న
ఆడ కూలీల రంగు రంగుల చీరలు, రవికలు
పాలపిట్టల్లా ఎగురుతున్నాయి..
రకరకాల పిట్టలు, పిచుకలు,
పంట గింజలను నోట కరవాలని
కూని రాగాలు తీస్తూ,
పంట చేలను కోచే గాజుల గలగలలకు
శ్రుతులు కలుపుతూ కొత్తరాగం వినిపిస్తున్నాయి
చుట్టూ గట్లపై పెరిగిన చెట్లు పూలతో, కాయలతో,
వంగి వంగి పంటకాలువతో ఊసులాడుతున్నాయి
చెట్ల కొమ్మలకు కట్టిన ఊయలలోని పసిపిల్లలు
ఎగిరే పక్షుల పాటలతో కేరింతలు కొడుతున్నారు
శ్రమకు పట్టిన చెమట గుత్తులు చల్లగాలికి ఆరుతూ
పంటచేల కొత్త వాసనలతో కలిసి
నవీన పరిమళములు విరజిమ్ముతున్నాయి
వంకా, వాగు నిత్యం వారివెంటే కదులుతుంటాయి
కష్టంతో సగం కడుపు నిండుతున్నా,
మిగిలిన సగం విచ్చుకున్న పంటచేలు నింపుతున్నాయి
సూర్య చంద్రులు నిత్యం వారి గుడిసెలు మీదగానే
పయనించి మంచీ, చెడులను తెలుసుకుంటూ ఉంటారు
సూలింతలకు రుచి చూపించే చింతా, మామిడి
బాలింతకు పథ్యంగా నిలుస్తాయి
వారి శ్రమకు పల్లవించిన ప్రకృతి
పంటపొలమై వారివెంటే కదులుతుంది
ఆడకూలీలని జీతం తక్కువిచ్చినా
పనిలో బేధం చూపని పసిడిమనస్సు వారిది
రేపటి పొద్దులో ఆ బేధం కరిగిపోతుందనే చిరు ఆశతో
నిత్యం కాలిబాటలో వారు వేసే అడుగులకు
పులకించిన నేల రాత్రి అయితే జీవన రాగం పాడుతూ వుంటుంది..!!
Written by : Bobby Nani
No comments:
Post a Comment