నీ
తలంపు తగిలితే చాలే
ఓ తియ్యనైన అనుభూతి నా
లోలోన దూరిపోతుంది.
రోజూ చూచే నక్షత్రాలు
ఈ రోజు మరింతగా మెరుస్తున్నాయి
ఏనాడూ కనిపించని ప్రేమ చేపలు
పడవ అడుగున తమకముతో ప్రేమించుకుంటున్నాయి
పిల్లల ముఖాలపై దోబూచులాడే నిర్మలత్వం
చూసిన ప్రతీ చోటా నాకు కనిపిస్తుంది..
ఆ రెండు జడలతో
కళ్ళముందే తోరణాలు కట్టే నీ మందహాసము
నా నరాల్లో ప్రాణాన్ని,
నా కలంలో సిరాని నింపుతూ ఉంటుంది.
నీ సమ్మోహన రూపం దర్శించిన ప్రతీ సారి
హృదయం చమర్చి
నా కళ్ళను కడుగుతూ ఉంటుంది.. !!
నీ పాదాలకంటిన నూరు అందియలలో
నేనో అందియనైనా కాకుంటినే
నీ అడుగుల సరిగమలకు
నే గమకములు పలికేందులకు.
ఓయ్
జానపద సాహిత్యం లాంటి నిన్ను
నా భావకవిత్వ సాహిత్యంతో ఏలుకోవాలని ఉంది..
అలంకారాల ముళ్ళు లేని
వాస్తవ కుసుమం లాంటి నిన్ను
నా స్వప్నాల గుండెల్లో తురుముకోవాలని ఉంది..!!
నీ పెదాల మీద నేనో కళ్యాణ రాగమై
నీ వక్ష వృక్షం పై నేనో విహంగమై
కళలు కన్నులు విప్పిన ఆ కనుబొమ్మల మధ్యన
కాంతి పుంజమై, అరుణారుణ తిలకమై,
శాశ్వతముగా నిలవాలని ఉంది.
ఓయ్ నిన్నే
వింటున్నావా.. !!
Written by : Bobby Nani
No comments:
Post a Comment