Saturday, July 28, 2018

చల్లారిపోతున్న ప్రేమలు..




చల్లారిపోతున్న ప్రేమలు.. 
***************** 

మీరు మీ పిల్లలకోసమే జీవిస్తున్నానని అంటున్నారు.. 
వారికోసమే ఇంత కష్టపడుతున్నామని, వారికోసమే ఇదంతా చేస్తున్నామని అంటున్నారు.. 

నిజంగానే వారికోసమే మీరిదంతా చేస్తున్నారా.. ?? 
నిజంగానే వారు మీ భవిష్యత్తా ?? 
ఓసారి ఆత్మపరిశీలన చేసుకోండి.. 

ఉదయం పిల్లలు నిద్ర లేవకమునుపే ఉద్యోగానికి వెళ్లే తండ్రి .... రాత్రి వారు నిద్రపోయాక వస్తే వాళ్ళు ఎలా సంతోషంగా ఉంటారు ?? 

శుక్రవారంనాడు కలర్ డ్రెస్, శనివారంనాడు తెల్ల యూనిఫారం వెయ్యాలన్న సంగతి కూడా మర్చిపోయి ప్రతీరోజూ యూనిఫారంలో తమ తల్లి పంపుతుంటే ఎదుటి పిల్లలను చూస్తూ పసి మనసులు ఎంతటి గాయాలౌతున్నాయో ఊహించారా.. ?? 

దొరికిన ఒక్క ఆదివారాన్ని తండ్రి స్నేహితులతో బయట గడిపేస్తూ, 
తల్లేమో సీరియల్స్, మొబైల్ అంటూ వాటితోనే సంసారాలు నెట్టుకొస్తుంటే, 

ప్రేమ లేని వారి భవిష్యత్తు సమాజంలో ఇమడలేక, వారి బాధేంటో వారికే అర్ధం కాక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఒంటరి జీవితానికి అలవాటుపడి, చెడు వ్యసనాలకు బానిసపడి మార్గదర్శి లేని జీవితాన్ని, భాద్యతారాహిత్యపు మనుగడను అలవరుచుకుని సమాజానికి ప్రమాదకారులుగా మారుతారు.. మారుతున్నారు.. 

బాగా చూసుకోవడం అంటే అన్నీ కొనిచ్చి పడెయ్యడం కాదు.. 
ఒడిలో కూర్చోబెట్టుకుని ఓ ముద్ద తినిపించడం, ఏది మంచి, ఏది చెడు అని ప్రేమగా వారికి తెలియ చెప్పడం, 
వాళ్ళకు మీ దగ్గర ఏదైనా చెప్పే స్వేచ్చ కల్పించడం, వారితో కలిసి అల్లరి చెయ్యడం, 
వారిలో ప్రతిభను ప్రోత్సహించడం, అభినందించడం ... 
మానవ మనుగడకు అంతిమ దశలో ఉన్నామనడానికి ముఖ్య సంకేతం ఏంటో తెలుసా.. 
బంధాలు, బంధుత్వాల మధ్యన ప్రేమలు చల్లారిపోతాయి.. 
వావి వరుస మరిచిపోవడం, ఒకరికొకరు కొట్టుకు చావడం .. వాటిలో అన్నీ దాదాపుగా జరిగిపోతున్నాయి.. అంటే దాని అర్ధం మానవ మనుగడ త్వరలోనే తుడిచిపెట్టుకుపోతుందని.. 

రెప్పపాటు జీవితం మనది.. రాత్రి పడుకుంటే తెల్లవారున లేస్తామో లేదో తెలియని పరిస్థితి. 

ఉన్నంతలో మీ పిల్లలతో, మీ కుటుంబంతో గడపండి.. అవసరం మేరకు వస్తువులను వినియోగించండి.. మనుషులతో ఎక్కువ మాట్లాడండి.. మీ ఎదుటి మనిషితో మీరెంత మాట్లాడితే అంత ఎక్కువ కాలం బ్రతికేస్తారు.. ముఖ్యంగా మీ పిల్లలతో.. వారేంటో మీరు తెలుసుకోండి.. !!

Written by : Bobby.Nani

1 comment:

  1. అవును సార్..ఉజ్జ్వల భవిష్యత్తు కోసం బంగారు కలలు కనాల్సిన కళ్ళు తల్లి దండ్రుల ఆప్యాయత కోసం కూడా ఎదురు చూడాల్సి రావడం అన్యాయమే..

    ReplyDelete