ప్రణయ మంత్రం
***********
చెలియా..
నీ నఖశిఖ పర్యంతం
నాకో సౌందర్య కళా పుస్తకం
ఎన్నిమార్లు చదివిననూ
తనివితీరని చాపల్య కేంద్రము..!!
నవరస నాట్య భంగిమలలో
సుధా రసంబు చిందించు శిల్ప సుందరిలా,
గానకళా రసమయ మనోహర సౌగంధి
అపురూప చిత్ర కళా ముగ్ధరూపిణిలా
అసాధారణ హృదయ సౌందర్య కళారాజ్ఞిలా,
చుక్కలనే వెక్కిరించు, ఆ
చూపులు రువ్వే కళ్ళు ..!
వేయి వసంతాల రవళిని,
వ్యంజించే సుమధుర గళము..!
కలబోసిన నిన్ను అలా చూస్తూ
కవితా మాలలు అల్లుతున్నాను.. !!
వసంతఋతువున ఘుమఘుమల పొంగు
శశిరేఖ తళుకు బెళుకుల సొగసు,
హిమాద్రి శిఖరాగ్రి నుండి జలజలా పారు
గంగా సముత్తుంగ తరంగ విభ్రమ లావణ్య
మలయమారుతా వీచికా శీతల సౌరభగంధి
సుప్రభాత సముజ్జ్వల సూర్యకిరణ సౌందర్య స్వరూపిణీ
ఏమని వర్ణించను,
మరేమని కీర్తించను..!
చంద్రోదయ వేళ పాలసముద్రపు
ఉత్తుంగ విన్యాస విభ్రమ వసంత
పుష్పమాలికా సౌందర్య రసోద్బవ మాలికలా
నను సమ్మోహన పరుస్తుంటావు
కటిక చీకట్లను సిగలో ముడిచి
కలువ కన్నులు వెలిగిస్తావు..
మేను మీద స్వర్గాలను దాచిపెట్టి
కొంటెనవ్వును కోమలివై విసురుతావు
తడబడినట్లే అడుగులు వేస్తూ,
వెన్న చిలుకు కవ్వములా నీ
నడుమును కదిలిస్తూ, నడుస్తావు
కులుకుతావు, ఉలుకుతావు
ఓపలేని నా చూపుల ఊహలెన్నో చిలుకుతావు
మౌనంతోనే నాకు ప్రణయ మంత్రం నేర్పుతావు
ఓ చెలీ
నా మరణం ఎక్కడో లేదు
నీవు విడిచే ఒక్క కన్నీటి బొట్టులోనే ఉంది..!!
Written by: Bobby Nani
ఏమని వర్ణించను..))
ReplyDeleteఇంత కంటే బాగా ఎలా వర్ణిస్తారు ....ఎవరైనా..
బాగుంది మీ చెలి..