జీవితం అంటే లేక్కలేనివారికి, జీవితం అంటే వ్యర్ధం అనుకునేవారికి అసలు జీవితం విలువ తెలుసా ??
ఒక బిడ్డకు జన్మనిచ్చేందుకు ఆ తల్లి పురిటి నొప్పులు దాకా ఎంత నలిగి ఉంటుంది.. దానితో పోల్చుకుంటే జీవితంలో మీరు నలిగేది ఒక లెక్కా..
జ్ఞానం లేని చీమలు సైతం తమ తమ సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటున్నాయి.. ఇంత జ్ఞానం, ఇంత అవకాశం వున్న మానవుడెందుకు పిరికివాడైపోయి, ఆత్మహత్యను శరణువేడుతున్నాడు .. ఓ చిన్న ప్రేరణ ఒక్కరికైన వసంతాన్నందివ్వగలదనే నమ్మకంతో వ్రాసాను.. చదివి మీ అభిప్రాయం చెప్పండి.. __/\__
జీవితమనే భారీ రధ చక్రాల క్రింద
నిరంతరం నలిగే ఘర్మజల శ్రామికులం..!!
మన జీవితాల్లో మార్పు ఉండదు, ఉండబోదు
అవకాశాలు అరుదుగా వస్తుంటాయి... కానీ
వాటిని అందుకునేందుకు ఊతము దొరుకుటే కష్టం.. !!
ఎవరూ ఎత్తుకుతీసుకుపోయి కూర్చో పెట్టరు
ప్రతీ మెట్టూ నువ్వే ఎక్కాలి..
ప్రతీ చెమట చుక్కకూ సమాధానం చెప్పి తీరాలి.. !!
తూర్పు, పడమరల మధ్యన
సూర్య, చంద్రుల ప్రయాణాలు సాగుతూనే ఉంటాయి..
వెలుగు, చీకట్లు నేల రాలుతూనే ఉంటాయి..
అమాస, పున్నమిలు వస్తూ, పోతూనే ఉంటాయి..
కానీ
నీలో,
నీ జీవితంలో
అదే ఓటమి,
అదే నిస్సహాయత
పాదాలు భూమిలో కూరుకుపోతున్నట్లు,
బాహువులపై గోవర్ధనగిరి మోస్తున్నట్లు,
కదలకుండా ఒకేదగ్గర సంకెళ్ళేసి నిను బంధించినట్లు,
గుర్తుతెలియని వ్యక్తి ఎవరో నీపై పడి తొక్కుతున్నట్లు అనిపిస్తుంది
నీ ఊపిరే నీకు భారమై తోస్తుంది.. ఆ సమయంలో..!!
రక్తం సలసలా కాగుతోంది..
స్వరం ఒక్కసారిగా మూగబోతుంది..
కళ్ళలో ఎరుపు ఎకసెక్కాలాడుతుంది ..
విశృంఖల వీర విహారం చేసే
అమానుష, అమానవీయ రాక్షసత్వానికి లొంగి
సలాములు చేసే దశ నీలో వచ్చిందనిపిస్తుంది..
కానీ
లొంగిపోకు,
వంగిపోకు,
ఎదురులా నిక్క నీల్గి ఎదుర్కో.. !
ఆకాశం కాని సముద్రం కాని అలసిపోయినట్లు కనిపించట్లేదు..
మరి నీలో ఎందుకీ అలసట .. !
జీవితం ఒకే రాట్నం చుట్టూ దారప్పోగులా తిరుగుతూనే ఉంటుంది..
ప్రస్తుత సమయం నీది కాదు అంతే... !
నీ జీవితంలో వసంతం దానంతట అదే రాదు
ఉగాదుల్ని నీవే ఆర్జించుకోవాలి,
బ్రతుకు పోరాటాల్ని ఎదుర్కొని,
నీకు నీవే విజయాన్ని సాధించుకోవాలి..!!
లే
పైకి లే
రాలుతున్న కన్నీటి చుక్కలే రేపటి నీ
విజయ గర్వానికి ములకలవ్వాలి..!!
Written by : Bobby Nani
No comments:
Post a Comment