Thursday, December 21, 2017

చిన్న విషయమే.. కాని దాని మూల్యం ఓ నిండు ప్రాణం..



చిన్న విషయమే.. కాని దాని మూల్యం ఓ నిండు ప్రాణం.. 
****************************************

చాలా చిన్న విషయం అనుకునే ఎంతో పెద్ద పెద్ద విషయాలు మన ముందు చాలానే ఉన్నాయి.. కానీ వాటిని మనం లెక్కే చెయ్యం.. అలాంటి వాటిల్లో ఒకటే ఇప్పుడు మనం చర్చించబోయే విషయం.. 

మనం చేసే అనేక తప్పిదాల వల్ల ఈ భూమికే కాకుండా, మనతో జీవించే సమస్త జీవరాశికి కూడా ఆటంకం కలుగుతూ ఉంది.. మానవుడు చేసే ప్రతీ పనిలో ఏదో ఒక రకంగా నలిగేది, నలుగుతున్నది మనతో జీవిస్తున్న ప్రాణులే .. 

విషయంలోకి వెళ్తే.. 

ప్రతీరోజు ఓ చెత్తకుప్పకు దగ్గరగా కొన్ని కుక్కలు ఉమ్మడిగాజీవిస్తూ, ఆ చెత్తకుప్పలోని ఆహార పదార్ధాలను ఆరగిస్తూ జీవనం సాగిస్తూ ఉండేవి.. ఆ ప్రదేశానికి అవి రుణపడినట్లు భావిస్తూ ఎంతో విశ్వాసంగా ఉంటూ ఉండేవి.. తెల్లవాదులూ తిరుగుతూ కొత్తవాళ్ళను రానివ్వకుండా ఆ ప్రదేశానికి రక్షలా కాపలా కాస్తూ ఉండేవి.. అలా ఉండగా ఆ ప్రదేశానికి ఓ కుటుంబం తాత్కాలిక నివాసం కొరకు వచ్చారు.. 

వారి ఇంటికి చేరువలోనే ఉన్నటువంటి ఆ చెత్త కుప్పలోకి ఈ ఇంటివాసులు రకరకాల తినుబండారాలను, వారి పిల్లలు సగం సగం తిని పారేసిన ఆహారపదార్ధాలను ప్లాస్టిక్ కవర్ లొ కట్టి అందులోకి విసిరే వారు.. అలా ఉండగా ఓ రోజు .. ఎంతో ఆకలిమీద వున్న ఓ కుక్క ఆతురతతో ఓ కవర్ని పెరికేసి తినడం మొదలెట్టింది.. కొన్ని క్షణాల్లోనే తన గుంతుకేదో అడ్డుపడి నోటినుంచి అధిక రక్తస్రావంతో, గట్టిగా దగ్గలేక దగ్గుతూనే రెండు పగలు, ఒక రాత్రి నరకయాతన అనుభవించి చనిపోయింది.. 

అలా ప్రతీ పది రోజులకు ఓ కుక్క చనిపోతూ వస్తుండేది.. ఆ ప్రాంతం వారంతా చనిపోయిన ఆ క్షణం అయ్యో పాపం అనుకుంటూ మరుసటి క్షణం మర్చిపోయి ఎవరి పనుల్లో వారు ఉండిపోయేవారు.. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఓ పాతిక కుక్కల దాకా చనిపోయాయి.. మున్సిపాలిటీ వారు ఈ ప్రాంతంలోని కుక్కలు చనిపోతున్నాయని ప్రభుత్వ పశువుల డాక్టర్ గారికి విన్నవించుకున్నారు.. ఆ డాక్టర్ గారు చనిపోయిన కుక్కను శవ పరీక్ష నిర్వహించిన పిదప చాలా ఆశ్చర్యానికి గురి అయ్యాడు .. 

అందుకు గల కారణం .. షేవ్ చేసిన బ్లేడ్ లు కుక్క మెడ భాగంలో ఉండిపోయి పైకి చెప్పుకోలేక.. మింగ లేక, కక్కలేక ఆ కుక్క నరకయాతన అనుభవించి చనిపోయిందని ఆయన నిర్ధారించారు.. 
షేవ్ చేసిన బ్లేడ్ లను జాగ్రత్తగా చెత్తకుప్పలొ వెయ్యడం చాలా చిన్న విషయం.. దాని వెనుక మూగ ప్రాణాలు ఇలా భరించరాని బాధతో చనిపోతున్నాయి.. 

ఆలోచించండి.. 

ఇప్పుడు కూడా ఇది చిన్న విషయమే అంటారా.. ?? 

మనలో చాలామంది షేవ్ చేసుకున్నాక బ్లేడ్స్ ని ప్లాస్టిక్ కవర్ లలో పెట్టి చెత్త కుప్పల్లో వేస్తున్నారు.. ఆ చెత్త కుప్పల్లో ఈ బ్లేడ్ లతో పాటు వ్యర్ధ ఆహార పదార్ధాలు కూడా ఉంటాయి.. ఆ ఆహార పదార్ధాలకు అలవాటు పడిన కొన్ని కుక్కలు అక్కడ తినేందుకు వచ్చి మృత్యువాత పడుతున్నాయి.. 

దయచేసి మీరు వాడిన బ్లేడ్ లను కాస్త శ్రమ అనుకోకుండా కాస్త గుంత తీసి పూడ్చి పెట్టండి.. కాలానుగుణంగా అవి తుప్పుపట్టి మట్టిలో కలిసిపోతాయి.. ఏ ప్రాణికి హాని జరగదు.. 

దయచేసి ఈ విషయాన్ని తేలికగా తీసుకోవద్దని మనవి చేస్తూ.. !
మీ వంతు బాధ్యతగా మూగ జీవాల ప్రాణానికి సంరక్షణకు బాధ్యతవహించండి.. !!

Written By: Bobby Nani

No comments:

Post a Comment