Tuesday, October 3, 2017

మరణం ఇంత సులభమా.. ???



నిన్న సాయంత్రం సమయం షుమారు ఆరుంపావు .. అప్పుడే ఆఫీస్ పూర్తి అయ్యి బయటికి వస్తున్న సమయం.. జేబులో ఫోన్ రింగ్ అవుతూ ఉంది.. లిఫ్ట్ చేసి “హలో” అనగానే ... “A” Positive బ్లడ్ అర్జెంట్ గా కావాలి ఎవరన్నా వున్నారా ?? ఉంటే చెప్పమని అవతలివ్యక్తి అభ్యర్ధన.. ఎవరో ఎందుకు నేనే వున్నాను.. నాది అదే గ్రూప్ అని నేను అన్నాను... సరే మీరు ఎక్కడ వున్నారో చెప్పండి నేను పికప్ చేసుకుంటానని ఆ వ్యక్తి అన్నాడు.. అదంతా అవసరం లేదు.. నేను ఎక్కడికి రావాలో చెప్పండి.. వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతాను.. ఎలాగో ఆఫీస్ కూడా అయిపోయింది.. నేరుగా ఇంటికే వెళ్ళాల్సింది అని చెప్పాను.. సరే అయితే మీరు బొల్లినేని హాస్పిటల్ కి వచ్చెయ్యండి అని చెప్పి కాల్ కట్ చేసాడు.. 

బండి స్టార్ట్ చేసి వెళ్తూ వున్నాను... ఓ 5 నిమిషాలు సమయం అనంతరం మరో నెంబర్ నుంచి మరో కాల్.. 
ఓ అమ్మాయి... 
సర్ మీరు బ్లడ్ ఇవ్వడానికి వస్తున్నారా ?? అంటూ అడిగింది.. 
అవును అండి.. బయలుదేరాను మరో 10 నిమిషాలలో అక్కడ ఉంటాను అని చెప్పాను.. 
సర్ మాకు కావాల్సింది బ్లడ్ కాదు.. ప్లేట్ లెట్స్ అని ఆ అమ్మాయి చెప్పింది.. 
హా తెలుసు అండి.. నేను బ్లడ్ ఇస్తాను అందులోనుంచి ప్లేట్ లెట్స్ తీసి పేషంట్ కి అందిస్తారు అని చెప్పాను.. 
అంత టైం లేదు సర్.. మీ నుంచి నేరుగా అప్పటికప్పుడు ప్లేట్ లెట్స్ తీసి ఎక్కించాలి అని చెప్పింది.. 
అది చాలా పెయిన్ ఫుల్ కదండీ.. రెండు హాండ్స్ కి నీడిల్ పెడతారు.. దాదాపుగా 3 గంటలు సమయం పడుతుంది.. అని చెప్పాను.. 
ఆ తరువాత ఆమె అన్నమాటకు కళ్ళు చమర్చాయి.. ఎంత పెయిన్ అయినా భరించేద్దాం అనిపించింది.. 
ఇదే ఆమె చెప్పిన మాట ..
అప్పటివరకు సర్ అంటున్న ఆమె ఒక్కసారిగా 
“అన్నా మా పిన్నికి ప్లేట్ లెట్స్ తగ్గిపోతున్నాయి.. ఉదయంనుంచి తిరగని హాస్పిటల్ లేదు.. వెతకని బ్లడ్ బ్యాంకు లేదు.. ఎక్కడా దొరకలేదు.. నిమిష నిమిషానికి డెంగూ జ్వరం వల్ల ప్లేట్ లెట్స్ పడిపోతున్నాయి.. ఇందాక చెక్ చేస్తే 85 శాతానికి పడిపోయాయి.. ప్రాణం 85 శాతానికి పడిపోయింది అన్నా.. మిగతా 15 శాతమే ప్రాణం కొట్టుకుంటుంది రండి అన్నాత్వరగా” అంటూ తన బాధను వ్యక్తపరిచింది.. 
తెలియకుండానే కళ్ళలో నీరు.. పేషంట్ ఎవరో కూడా తెలియదు.. మరి ఈ కన్నీరేంటి ?? ఎందుకు వస్తున్నాయో కూడా అర్ధం కాలేదు.. ఇక ఆలస్యం చెయ్యకుండా బయలుదేరాను.. 
హాస్పిటల్ కింద బండి పార్క్ చేసి పైకి వెళ్లబోతుండగా మరో కాల్.. 
బ్లడ్ ఇవ్వడానికి వస్తుంది మీరేనా అంటూ..
హా అవును ఆల్రెడీ వచ్చేసాను... పైకి వస్తున్నాను.. అని అన్నాను.. 
లేదండి ఆమె చనిపోయారు.. పిలవగానే స్పందించి వచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పి కాల్ కట్ చేసారు.. 
ఓ పదినిమిషాలు అలానే మౌనంగా అక్కడే ఉండిపోయాను.. ఏ శబ్దాలు శబ్దం వినపడటలేదు.. నిశ్శబ్దం ఆవరించింది.. ఏమి అర్ధం కాలేదు.. 
మరణం ఇంత సులభమా.. ??? అనిపించింది.. 
ఏదో పోగొట్టుకున్న కున్న ఫీల్.. 
మనసంతా శోకంతో మునిగిపోయింది.. 
ఇప్పటివరకు నేను 10 సార్లు దాకా అపాయ పరిస్థితిలో ఉన్నవారికి అందించాను.. కాని ఇలా ఎప్పుడూ జరగలేదు.. మొదటిసారి కళ్ళముందే రక్తం అందక ఓ ప్రాణం రెప్ప వాల్చింది.. 
ఈ సంఘటన నాకు మింగుడు పడట్లేదు.. 

డెంగూ జ్వరం .. ప్రాణాంతకమైనది.. దయచేసి దాన్ని చిన్నవిషయం గా తీసుకోకండి.. సరైన సమయంలో తెలుసుకొని చికిత్స అందిస్తే తప్పక నయం అవుతుంది.. జ్వరం రాగానే దగ్గరలో వున్న వైద్యుని వద్దకు వెళ్ళి తగిన సూచనలు, సలహాలు తీసుకోండి .. స్వంత ప్రయోగాలతోనూ, నిర్లక్ష్య ధోరణితోనూ వ్యవహరించకండి.. ఇప్పుడు వచ్చే జ్వరాలు ఇంతకుముందులాంటివి కాదు.. ప్రాణాంతకమైనవి.. కాస్త జాగ్రత్త వహించండి.. 

అన్నదానం, విద్యాదానం మొదలగు ఏ దానం చేయాలన్నా ప్రాణమున్న మనిషికే చేస్తాం. అలాంటి ప్రాణాలనే నిలబెట్టే మహత్తర మైన దానం రక్తదానం. రక్తదానం సేవ మాత్రమే కాదు, ప్రతి పౌరుడు బాధ్యతగా భావించాలి, దాన్ని స్వీకరించాలి... ప్రాణాపాయస్థితిలో వున్న వ్యక్తికి రక్తం ఇచ్చి ప్రాణం కాపాడడమంటే... అంతకన్నా పరోపకారం ఏముంటుంది?

యువత అంతా కలిసికట్టుగా వ్యవహరించి రక్తదానానికి ముందుకు రావాలి.. మీరు ఇచ్చే ప్రతీ రక్తపు బొట్టులో ఒకరి ప్రాణం, ఓ కుటుంబ జీవితం ఉందని గ్రహించండి.. 

ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కన్నీటిపర్యంతమై .... __/\__

స్వస్తి ...

2 comments:

  1. చాలా విచారం కలిగింది. మీ ప్రయత్నం మీరు చేసారు. మీరు అందించిన సందేశం అమూల్యం!

    ReplyDelete
  2. చదువుతుంటేనే ఇంత బాధగా ఉంది. ఇక మీకెంత బాధగా ఉందో ఊహించగలము

    ReplyDelete