కవిత్వం వ్రాసి చాలా రోజులైంది అంటే.. ఈ “వచన కవిత్వం” వ్రాసి మరిన్నో రోజులైంది..
ఆనాడు పద్యాలంకరణములు ఓ వెలుగు వెలిగితే నేడు మాత్రం వచన కవిత్వం అదే స్థానంలో వ్రేళ్ళూనుకుందనే చెప్పాలి.. కాకపోతే ఈ వచన కవిత్వాన్ని కాస్త మన మోడ్రెన్ భాషలో వ్రాయడం జరిగింది.. కవిత అంటే అర్ధాలు వెతుక్కునేదే కాదు.. ఇలా మన వాడుక భాషలో కూడా ఒకసారి వ్రాయాలనిపించింది..!!
అలా వ్రాయడానికి ఓ కారణం కూడా ఉంది...
(అ)సభ్య సమాజంలో (అ)సమర్ధుల (అ)సాంఘిక చర్యల వికృతిఁ చేష్టలకు,
పాలకుల (అ)పరిపక్వత విన్యాసాలకు, (అవి)నీతి సామ్రాజ్యానికి,
ప్రజల (కు)సంస్కార జీవన విధానానికి ఓ చెంపపెట్టుగా.. వారికి అర్ధమయ్యేలా మోడ్రెన్ (ఆధునిక) భాషలో తెలియజెప్పే ఓ చిన్న కవితాలంకరణమే ఈ “భారతమ్మ బాష్పములు”...
////భారతమ్మ బాష్పములు.. \\\\
***********************
సౌభాగ్యశీలి భరతమాతా...
అతులిత భాగ్య సుజాతా...
కలకలలాడే నీ మోమున కన్నీరేమమ్మా ..!!
కన్నీటి చారికల్తో చిక్కిన చెక్కిల దేవమ్మా ..!!
ఏ రీతిగ నిను ఓదార్చేది.. !!
ఏ మోముతో నిను వీక్షించేది.. !!
గాంధీ చెప్పిన సూక్తులన్నీ,
బ్రాందీ మీద భక్తితోటి,
పట్టుదలగా కట్టగట్టి,
“కల్చరంటూ” కుదువబెట్టాం..!!
సోషలిజముతో బాస చేసి,
సెక్యులరిజము ట్రిక్సు చూపి,
అన్నీ ఇజములు మిక్సుచేసి,
సెల్ఫు ఇజములో కల్పి వేసాం..!!
దోపిడీలకు రంగుమార్చి,
పేద ప్రజలకు టోపీ వేసి,
ప్రజాస్వామ్యం పేరుబెట్టి,
ఉన్నవాళ్ళను దోచుకున్నాం..!!
బక్క ప్రజల పూరిపాకల్తో,
ఊరిఆవల పేట కట్టి,
సిక్సు స్టోరీడ్ మేడలకు,
దిష్టి బొమ్మల నిలువబెట్టాం..!!
లంచ గొట్టును పట్టలేక,
బందుప్రేమను చంపలేక,
మేము కూడా ముదముతీర,
లంచ గొండిగ మారిపోయాం..!!
మూడు అడుగుల గొయ్యి తీసి,
నిజమునెప్పుడో పాతిపెట్టి,
గజముఎత్తు సీటు చూసి,
అబద్దాన్ని ఆవిష్కరించేం..!!
అత్త సొమ్మును పట్టుకొచ్చి,
దారవోసిన అల్లునట్లు,
దేశ ప్రజల సోట్టుతోటి,
స్వంత కొడుకుల బ్రతుకులద్దేం..!!
కాని,
తల్లీ భరతావనీ .. !!
ఎన్ని చెప్పిననూ..
ఎవ్వరు చెప్పిననూ..
గాడిద కొడుకుల కుటిల బుద్దులు,
మారనుగాక మారవు..!!
నీ నగు మోమును ఇకనెన్నటికీ కాంచబోము.. !!!
Written by : Bobby Nani
చాలా బాగా చెప్పారు. ఎప్పటికేనా ఆ మోములో చిరునవ్వు కనిపిస్తుందని ఆశిద్దాము.
ReplyDeletefor Self Employment visit: *** www.indiaonlines.in **** www.4job.in
ReplyDelete