కొందరి ఆకతాయిలను ఉద్దేశించి మాత్రమే వ్రాసాను.. ఆఖరికి గుడిలో కూడా అపవిత్రం చేస్తున్న నేటి యువతను చూసి బాధ పడాలో, అసహ్యించుకోవాలో, జాలి పడాలో అర్ధం కావట్లేదు..
మారండ్రా మూత్ర చోరులారా..
పైత్యపు మరకలు
*************
లేలేత కరాల కంకణాల నిక్వణాల మీద మోజు గానీ
దైవంతో మనకు పనేంటి.. ??
నాజూకు చరణాల నూపురాల నిస్వనాల మీద దృష్టి గానీ
అర్చకుని మంత్రోచ్ఛారణా గోల మనకెందుకు.. !!
అసభ్య కూనిరాగాలాపన చేస్తూ అందాల్ని ఆఘ్రాణిద్దాం..
జారుపైటల రెపరెపలనూ,
పట్టు చీరల పరపరలనూ,
కామ జీరలల్లుకున్న కళ్ళారా జుర్రేద్దాం..
స్తంబాల మీది బొమ్మల విన్యాసాల ముందు మ్రోకరిల్లుదాం...
“రా..రా” బావా గుళ్ళోకెడదాం అంటూ
వరస తీరిన వయ్యారాల్ని
ముందునుంచీ, వెనుక నుంచీ
పరికించి పరీక్షించి వికారంతో వంకర్లు పోదాం..
జడకుచ్చులు తగిలో,
చీర చెంగులు తాకో,
పులకించి, పులకించి పిచ్చెక్కి గింగిరాలు తిరుగుదాం..
ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు పడి పడి
పళ్ళికిలించి ఇకిలించి చొంగ కార్చుకుందాం..
మూర్చరోగిలా తప తపా మనసుని
శరీరాలతో బాదుకుందాం ..
రా...రా బావా గుళ్ళోకెడదాం
వాళ్ళలో మన అక్కా లేదు.. ఆలీ లేదు..
వాళ్ళలో మన చెల్లీ లేదూ ... తల్లీ లేదు..
వాళ్లతో మనకు బంధుత్వమూ లేదు... స్నేహమూ లేదు..
గంట కొడుతున్నప్పుడైనా – కించిత్
పైట తొలుగుతుందేమోనని దొంగ చూపులు చూద్దాం..
కళ్ళెర్ర చేస్తారంటావా – సారీ చెప్పేద్దాం..
చెంపలు వాయిస్తారంటావా – నమస్కారం పెట్టేద్దాం..
మన సిగ్గుని చిముడ్చుకొని
మన బుద్దిని బూడిద చేసుకొని..
నాగరికతకు నవ్యార్ధాలు చెబుదాం..
అబ్బా.. ఇప్పుడు
సంస్కారం సభ్యతల సంగతులెందుకురా బావా....
నిజమే ..
వాటిని కొబ్బరి చెక్కల కిందో
అరటి తొక్కల కిందో
తొక్కేద్దాం .. !!
మనకూ అక్క ఉంటుందనీ అమ్మ ఉంటుందనీ
మనకూ ఆలి ఉంటుందనీ, అత్తా ఉంటుందనీ
మరిచిపోయి మరిచిపోయి మరచిపోదాం..
మన సంస్కృతి మీద మనమే గాండ్రించి ఉమ్మేసుకుందాం..
మనల్ని మనమే ఛీత్కారం చెప్పులతో కొట్టుకుందాం..
అటూ, ఇటూ చూడకు..
గుడి గుమ్మం ముందే
దీనంగా, హీనంగా, హేయంగా అసహాయంగా
ఆకలి వల విసురుతూంది బిచ్చగత్తే
మన కంటి కటకటాల మీద నల్లని మచ్చ.. !!
ఒరేయ్ బావా నిజం చెప్పనా..
మానవ చరిత్ర పుస్తకం పై మనమేరా
నల్లని యెర్రని సిరా మరకలం..!!
ఇది చదివాకైనా మనం మారకపోతే
ఇంకెందుకురా బావా ఈ జీవితం..
వ్యర్ధం తప్ప.. !!!
Written by : Bobby Nani
No comments:
Post a Comment