Tuesday, June 13, 2017

జీవితంలో వేకువ, సంధ్య..



జీవితంలో వేకువ, సంధ్య..
*******************

చెప్పలేని
దిగులు వ్యధతో
చలిని కప్పుకు వణికిన
ఒక ఎండు చేతుల రాత్రి..!

ఎర్రెర్రగా తొంగిచూస్తున్న
చెట్ల చిగుళ్ళ చిరునవ్వులను
కాలాన్ని వెనక్కి జరిపి
కౌగిలించుకుంటుంది..!

మంచు మైదానమై
పరుచుకున్న
శశిర చీకటిలోనుంచి
ఒక ఆకుపచ్చని గడ్డిపూల మొక్క
బంగారు రెమ్మల కళ్ళతో
తొట్టతొలి కిరణాన్ని
ముద్దాడుతోంది..!

క్రూరమైన దినచర్యలో
ఒళ్ళంతా కమిలిన
ఆకాశం..!

తళుక్కున వేళ్ళాడే
నెలవంక చిరునవ్వుని
ఆప్యాయంగా అక్కున
చేర్చుకుంటుంది..!

వెన్నెల రజనుతో మెరిసే
ఒక స్వేచ్చా సాయంకాలం
వళ్ళు విరుచుకుంటున్న
వేకువతో
కరచాలనం చేస్తుంది..!

పూడుకుపోయిన గొంతుల
మౌన సంభాషణలని
బరువెక్కిన గడియారం
ముండ్ల గుస గుసలు మోస్తాయి..!

తడి ఆరని మెరిసే కళ్ళని
కలిపేందుకు
ఆకాశం చుక్కల చాపలా
చుట్టుకుంటుంది..!

సాయంత్రంలో మునిగిపోయే పగలూ,
ఉదయమై ఎగసిపోయే రాత్రి...!

జీవితమనే పరిమళంలో
ఒక కొత్త రోజుగా
విచ్చుకుంటూ, మిగిలిపోతుంటాయి.. !!

Written by : Bobby Nani

1 comment: