Wednesday, May 24, 2017

\\\\నెలవంక అందాలు..////



మధురమైన భావ కవిత్వం రాసి చాలా రోజులు అయిందబ్బా ... అందుకే ఈరోజు ఎలా అయినా మిమ్మల్ని అక్షర తాండవంలో నర్తింపజెయ్యాలనుకుంటున్నాను.. 


\\\\నెలవంక అందాలు..//// 
*******************

ఆకాశం నుండి 
విద్యుత్తేజాల మేఘాల నుండి, 
భూమ్యాకర్షణ ఉపగ్రహాల నుండి,
జల్లు జల్లుల హాశాతిరేకం..!!
ధ్వనించే హృదయ రాగం ..!!
మనసు, మనసు అనుసంధానం 
ప్రపంచం ఒక పూలతీగై, 
ప్రతిధ్వనించినప్పుడల్లా సంతోషం జల జలా కురుస్తుంది..!! 
భూమి – ఆకాశం
చెట్టూ – కోనా 
సుమాలూ – ప్రవాహాలు 
గాలీ – గుండే సవ్వడులను వినండి..!! 
మీ నిశ్శబ్దాన్ని విడిచి నాతో రండి..!! 
ఒక వంక “నెలవంక”, 
మరో వైపు జలపాత ఝురీ.. 
పాదం చివర కలువలు సుతిమెత్తగా నిమిరి 
వెన్నెల్లో స్నేహాన్ని ప్రేమగా గుక్కెట నింపుతున్నాయి..!! 
ధ్వని – ధ్వని గల గలా చెవుల్ని ఆప్యాయించే 
మాధుర్య స్వరధుని ఈ ధ్వని.. నా 
చుట్టూ మలయమారుత నేస్తాలు చుట్టివున్నాయి ..! 
ఒక్కాసేపు అవి చెప్పే మాటల్లో వరదయ్యే ఉత్తరాలు...!
ఇవన్నీ చుసిన నాకు.. 
ఎటు చూస్తే అటు 
తెరలు తెరలుగా వేల అక్షరాలు 
నా నించి అటు,
అట్నించి ఇటు, 
ప్రవహించే ఆత్మీయ వారధిలా నా 
చేతి మునివేళ్ళ నుంచి జల జలా రాలుతున్నాయి.. !!
ఓ మేఘమా...
ఓ ఆకాశమా.. 
మీకు కృతజ్ఞతలు..
నాలో ఆగని ధ్వనించే హృదయం, 
హృదయానికందని అతీత సౌందర్యం, 
క్షణాలకు జీవంపోసే ఒకే ఒక శబ్దం, 
నిశ్శబ్దమై పోయినా మారుమ్రోగే నిరంతర స్నేహం... 
మీ వల్ల బావుకత రూపంలో నను కౌగిలించుకొని వుంది .. !!!!


అసలు కవిత్వం అంటే ఏంటి ?? నిగూఢతను కలిగి, సాధారణ వాక్యానికి మాములుగా కాకుండా భిన్నంగా ఉండి చదువరుల మనసును రంజింపజేసే, ఆలోచింపజేసే రచనను కవిత్వం అంటారు. కవిత్వం ఒక సృజనాత్మక సాహితీ ప్రక్రియ. కవిత్వం ఒక నిరంతర సాధన. ఈ సాధన ద్వారా మన కవిత్వాన్ని మనమే మెరుగు పరుచుకోవచ్చు. కవిత్వం అంటే అక్షర హింస కాదు.. అక్షరాల కుంటి నడక అంతకంటే కాదు. కవిత్వం అంటే అక్షర తాండవం, నిరంతరం కవి హృదిలో జ్వలించే జ్వాల, కవిత్వం అంటే ఒక అన్వేషణ, ఒక తీరని వేదన. సంకోచాలు, మొహమాటాలు కవిత్వానికి తీరని హాని చేస్తాయి. కవిత్వంలో చెప్పేదేదైనా బలంగా ఉండాలి... నిజం ఉండాలి ... నంగి మాటలు, నత్తి చేష్టలు, వెటకారపు అక్షరాలు ఉండకూడదు. కవిత్వం రాసేవారిలో ఇక ఈ క్షణంలో ఈ కవిత రాయకపోతే చచ్చిపోతాం అన్నంత ఆవేశం వస్తేగానీ ఒక మంచి కవిత జన్మించదు. కవిత పాఠకుడిని కదిలించడానికి ముందు కవిని కదిలించాలన్న విషయం మర్చిపోకూడదు. రసమయ ఘడియల్లో సృజించిన కవిత కొన్నాళ్ళాగి చదివితే రాసినప్పటి మానసికస్థితిలోకి తీసుకువెళ్తోందో లేదో చూసుకోవాలి. అలా తీసుకువెళ్ళినట్లైతే అది నిక్కార్సైన కవిత అయినట్లే... మీరు విజయం సాధించినట్లే.. 

Written by: Bobby Nani

No comments:

Post a Comment