Monday, March 20, 2017

ఓ రచయిత...


ఓ రచయిత...
కోమలమైన సుందరాంగిని వర్ణిస్తున్నాడంటే
ఆ అందాన్ని తను ఆరాధిస్తున్నాడనే అర్ధం.. !!
నిరుపేదల ఆవేదనను రాస్తున్నాడంటే .. 
ఆ పేదల గుండె చప్పుడు విని చలించాడని అర్ధం...!! 
పాలకుల దురాక్రమాలను ప్రశ్నిస్తున్నాడంటే..
ఆ పాలకుల వల్ల నలుగుతున్న కన్నీరుని చూశాడని అర్ధం.. !!
ప్రకృతిని ప్రేమిస్తున్నాడంటే .. 
ఆ ప్రకృతిని తల్లిగా భావించి ఆమె ఒడిలో అల్లరి చేస్తున్నాడని అర్ధం.. !!
ప్రణయ కవిత్వం రాస్తున్నాడంటే ..
ప్రేమలో పడ్డాడని కాదు.. ప్రేమపై తనకున్న గౌరవమని అర్ధం..!!
అశుర కవిత్వ పదప్రయోగాలు రాశాడంటే.. 
ఆశురుడని కాదు.. ఆశురుల వంటి నరులను ఎండగట్టాడని అర్ధం..!!
శృంగార వర్ణనలను గావిస్తే.. 
విచ్చలవిడి శృంగార పురుషుడని కాదు .. శృంగారంలో వున్న పవిత్రత తెలుసని అర్ధం..!!
హాస్యం, భయానకం, రౌధ్రం, వ్యంగ్యం, శాంతం, కరుణ, శోకం ఇవన్ని రచయిత రూపాలు కాదు.. 
కేవలం తన భావాలు మాత్రమే.. !!
వీచే గాలి కూడా స్థిరంగా ఉండదు .. 
వర్షం వచ్చేముందు పిల్ల తెమ్మెరలా ఉంటుంది.. 
ప్రళయానికి ముందు నిశ్శబ్దంగా హంతకిలా ఉంటుంది.. 
ప్రళయంలో భీకరణిగా ఉగ్రరూపం దాలుస్తుంది.. 
ప్రళయం తరువాత ఏమి ఎరుగనట్లు నంగనాచిలా ఉంటుంది.. 
అలానే రచయిత కూడా.. 
తనలో ఇమిడి వున్న శక్తిని అత్యవసరంలోనే ప్రయోగిస్తాడు.. 
తన భావాల అక్షర మాలికలకు పర్మళభావాలు అద్ది 
అత్యంత రమణీయంగానూ, అవసరమైతే మారణ అస్త్రాలుగానూ, 
సృష్టించగల నైపుణ్యం తనలో ఉంటుంది.. 
అందరూ అనుకోవచ్చు అక్షరమేంటి మరణం ఏంటి అని ?? 
అక్షరానికి ఉన్న విలక్షణం ఏంటో తెలుసా.. ?? 
చనిపోయేవరకు ఒకరు నిన్ను అన్నమాట నీ గుండెల్లోనే ఉంటుంది... 
నాలుగు దినాల్లో మానడానికి 
ఇది గాయం కాదు .. 
నిరంతరం నీ హృదయాన్ని దహించే జ్వాల.. 
అందుకే అక్షరాలు చాలా గొప్పవి 
ఆపదలో ఆదుకునే అభయ హస్తాలు.. 
ఆవేదనలో పంచుకునే నేస్తాలు.. 
ప్రేమలో అమృతాన్ని చిలికే మధు రసాలు.. 
బాధ లో భరోసా ఇచ్చే బాంధవ్య కుసుమాలు.. 
మనసును సేద తీర్చే సంజీవ అస్త్రాలు.. 
జన్మ జన్మలు గుర్తుంచుకునే రక్తాక్షరాలు..!!!!


రచయిత అంటే సమాజంలో ఓ గొప్ప భావన ఉండాలని భావించేవాడిని నేను ...కాని కొందరు రచయితలను వారి రచనలను వారి జీవితంలో జరిగే పరిణామాలు అని అనుకోని పొరపడటం ఓ రచయితగా నాకు శోచనీయం..

రచయిత స్వతంత్రుడు.. కళ్ళకు కనిపించేవే కాదు.. కనిపించనివి కూడా తన ఊహాపరిధితో చూడగలిగేవాడే నిజ రచయిత .. నిర్జీవపు కుసుమాన్ని వికసింపనూ గలడు, నవ వసంతమూ తెప్పించగలడు .. లేని అందాన్ని కూడా అపూర్వంగా మలచనూ గలడు.. తన అస్త్రాలు కర్మాగారంలో తయారయ్యినవి కాదండోయ్... స్వీయ కుటీర పరిశ్రమల్లో తయారైన నాటు అస్త్రాలు.. ఒక్కో అక్షర ప్రయోగానికి ఒక్కో పదును.. ఒక్కో ప్రయోగానికి ఒక్కో నేర్పు, ఒక్కో ఫలితం .. ఆవేశంతో జలపాతం లా దూకనూ గలడు, ఆగ్రహంతో కత్తిసాము చేయనూ గలడు, కసివస్తే త్రిశూలాలు గుచ్చనూ గలడు.. ఎదురుపడితే ఈటెలను విసరనూ గలడు.. ఎగతాళిగా వెక్కిరించనూ గలడు, వ్యంగాస్త్రాలను ప్రయోగించనూ గలడు.. సభ్యతతో సమాజాన్ని నిర్మించనూ గలడు, ప్రశ్నించనూ గలడు..

ఒక రచయిత అక్షరాల్ని పొదిగేటప్పుడు తనహృదయం మొత్తం ఆ కావ్యం మీద నిండిపోయి వుంటుంది.. మరే ఆలోచనా వుండదు.. కావ్య వస్తువు, కావ్య ఛందస్సు, కావ్య భాష, కావ్య నాయిక, నాయకుడు, కావ్య ధ్వని, కావ్య రసం, కావ్య హేతువు, కావ్య సందేశం ఇలా తన అధ్యయనంలో ఇన్నిటిపై దృష్టిసారిస్తూ వెళతాడు.. ఇది వయస్సుకు సంబంధం లేదు.. అలానే తను ఆ పరిస్థితులను అనుభవిస్తున్నట్లూ కాదు.. ఇకనైనా అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ.. సెలవు..

స్వస్తి .. ___/\___

Written by : Bobby Nani

2 comments:

  1. చాలా బాగా రాసారు.

    ReplyDelete
  2. అవునండీ. బాగా వ్రాసారు.

    ReplyDelete