Thursday, February 9, 2017

యుగాలనుంచి కాదు.. నీ ఊపిరికి ప్రతి ఊపిరినై పెనవేసుకుంటూ.. పుడుతూనే ఉంటాను .. !!!




అదేంటో ఈ కోమలాంగిణి చూస్తే కోటి పూలు ఒక్కసారిగా వికసించినట్లు ఉంటుంది ..
చెంగు చెంగు మంటూ గంతులేసే ఆ అల్లరి వనితను చూస్తుంటే లేడిపిల్ల గుర్తుకువస్తుంది.. 
అమాయకమైన ఆ బెదురు, అదురు చూపులలో అరణ్య కుందేలు కనిపిస్తుంది.. 
ఏది ఏమైనా అన్నీ నీకే చెందునులే .. !!
నవరసాలను పండించగల పుష్కలాక్షిణివి.. !!
“శృంగారం” లో ఎత్తుకు పై ఎత్తును అందించే రతీదేవి లా.. 
“శౌర్యం” లో ఖడ్గం పట్టిన నీరజాక్షి లా.. 
“కరుణ” లో ప్రేమగా దీవించే ధవళాక్షి లా.. 
“అద్బుతం” లో ఆనందాన్ని నింపే అంబుజవదన లా.. 
“హాస్యం” లో చిరునవ్వును అందించే కిన్నెరకంఠి లా.. 
“భయానకం” లో ఎరుపు వర్ణపు నేత్రాలతో ఊగిపోయే ఉజ్జ్వలాంగిణి లా.. 
“బీభత్సం” లో అలుపెరగని పోరాట ప్రతిమ కనపరిచే తాటంకవతి లా..
“రౌద్రం” లో పాపాత్ముల రక్తాన్ని జుర్రుకునే వరారోహిణి లా.. 
“శాంతం” లో అమృతాన్ని పంచె శాతోదరి లా .. 
సమయాన్ని బట్టి లతలా అల్లుకుపోయే “స్త్రీ”తత్త్వం నీదైతే.. 
ఆ “స్త్రీ” తత్వాన్ని అందుకునే “పౌరుష” తత్వం నాది..
పద్మిణి, చిత్రిణి, హస్తిని, శంఖిని లా 
సాత్వికం, ప్రచోదకం, భయానకం లా 
నీ వెలా ఉన్నా ... 
నా నేత్రములకు వయ్యారాలు వొలకపోసే వగలాడివే ... !
అందని ద్రాక్షలు నీ పరువాలైతే .. 
వాటిని అందుకొనగ వచ్చిన చిత్తేశుడను నేను.. 
ఏనాటి బంధమో ఇది.. 
అలసిన ఈ నా హృదయం నీ 
కౌగిటను జేరి సేద తీరఁగ తహతహ లాడుచున్నది .. 
తెలుసు అలా జరిగిన మరు గడియలోనే నా ప్రాణం ఆగిపోతుందని.. 
ఆ ఒక్క గడియ కోసం ప్రాణాలేంటి.. వేల జన్మాలనైనా వదిలేస్తా.. !!
హృదయం ఆగిన చోటునుంచి నీ ప్రేమకై మరలా జనియిస్తూనే ఉంటాను ... 
యుగాలనుంచి కాదు.. నీ ఊపిరికి ప్రతి ఊపిరినై పెనవేసుకుంటూ.. పుడుతూనే ఉంటాను .. !!!

Written by : Bobby

No comments:

Post a Comment