కొన్ని ప్రయాణాలు మనకోసమే అన్నట్లు సాగుతాయి.. ఆ ప్రయాణంలో మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది.. ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలే కాని చూసేందుకు, చెప్పేందుకు బోలెడు ఉంటుంది...
అలాంటి ప్రయాణంలో ఓ భార్యా, భర్తల మధ్యన వున్న ప్రేమను, సఖ్యతను, మరియు నేటి యాంత్రిక జీవన విధానంలో మనం అనుభవిస్తున్న లోటుపాట్లను, వాటి స్థితిగతులను రాయాలనిపించింది... అందుకోసమే కొంచం సమయం తీసుకొని ఈ టపా రాస్తున్నాను..
నిజంగానే ఈ 21వ శతాబ్దంలో మనకు తెలియకుండానే మనం యంత్రాలుగా మారిపోయాం.. ఉదయాన నిద్ర లేచిన దగ్గరనుంచి సాయంత్రం మంచం ఎక్కేవరకు అంతా పరుగులమయమే.. ఆఖరికి నిద్రనుకూడా కృత్రిమం గా అనుభవించేస్తున్నాం.. ఇంత పరుగులు తీసి మనం చివరికి సాధించింది ఏంటి ??
మనశ్శాంతిగా వున్నామా ?? లేదు..
ప్రశాంతంగా వున్నామా ?? లేదు..
ఆరోగ్యకరంగా వున్నామా ?? లేదు...
సౌకర్యవంతమైన జీవనాన్ని గడుపుతున్నామా ?? లేదు.. అన్నిటికీ సర్దుకునే బ్రతుకుతున్నాం..
అన్నిటికన్నా ముఖ్యంగా .. అసలు సంతోషంగా వున్నామా ??
అస్సలు లేము.. కృత్రిమ నవ్వును మొహానికి పులుముకొని నవ్విస్తున్నాం..నటిస్తున్నాం.. నడిచేస్తున్నాం..
ఇందుకోసమేనా మనం నిరంతరం ప్రాకులాడేది.. పరితపించేది...
అసలు మనం ఎందుకు బ్రతుకుతున్నాం ?? కాడెద్దు లా సమస్యలతో సతమతమౌతూ ఉండటమేనా జీవితం అంటే ...
దీన్ని జీవితం అనరు.. బానిసత్వం అంటారు.. కంటికి కనిపించని బానిస సంకెళ్ళు మనల్ని పాలిస్తున్నాయి.. అప్పుడప్పుడు అయినా ఈ యాంత్రిక జీవన విధానానికి ఫులిస్టాఫ్ పెట్టి మీ జీవిత భాగస్వామితో కొన్ని ప్రయాణాలు చెయ్యండి...
అలా ఓ జంట చేసిన ప్రయాణమే “కొడైకెనాల్” ప్రయాణం..
రాత్రి నుంచి ప్రయాణం చేసి చేసి చివరికి ప్రక్కరోజు మధ్యాహ్న సమయానికి వారు అనుకున్న ప్రదేశానికి మరో నాలుగు గంటలు ప్రయాణం మిగిలి వుండగా ఇద్దరిలోను ఒకటే భయం.. అనితరసాధ్యమైన ఆ కొండను ఎక్కే ప్రక్రియలో సంభవించే విపత్తులను ఎలా ఎదుర్కోవాలి అని ?? దానికి తోడు ఆ దంపతులకు ఓ 2 సంవత్సరముల చిన్నారి కూడా వుంది.. భయం భయం గానే ఓ లిమ్కా బాటిల్ పెట్టుకొని కారులో ఎక్కి కూర్చున్నారు...
మిట్ట మధ్యాహ్నం అయినప్పటికీ పళ్ళు కోరికే చలిలో ఆ కారు రయ్యి రయ్యి మంటూ కొండపై పైకి ఎగబాకుతూ దూసుకుపోతుంది.. రింగులు రింగులుగా తిరుగుతూ కారుకంటే వేగంగా వారి బుర్రలు తిరుగుతూ వున్నాయి.. ఓ ముప్పై నిమిషాలు అనంతరం ఇక ఆగలేక, తట్టుకోలేక ఆ కోమలాంగి కారు ఆపండి అని కారు ఆపించి.. బయటకు దిగి కడుపు కాళీ చేసేసుకుంది... ఆ సమయములో తన భర్త ఆమె వెనుకగా వచ్చి తన రెండు చేతులతో ఆ కోమలాంగి చెవులు గట్టిగా మూస్తూ ధైర్యం చెప్తున్నాడు.. అనంతరం ఓపక్క బిడ్డను, మరోపక్క అర్ధాంగిని తన రెండు భుజాలపై వేసుకొని నిద్రపుచ్చాడు .. మరో 2 గంటల ప్రయాణం అనంతరం ఆ చిన్నారికీ అదే పరిస్థితి కలగడం.. తన భార్య ఏమి చెయ్యలేని నిస్సహాయ పరిస్థితిలో ఉండటం తను గమనించి తనే ఆ చిన్నారిని శుబ్రం చేసి బట్టలు మార్చి నీరు త్రాగించి మరలా ప్రయాణం కొనసాగించారు.. చివరికి వారు అనుకున్న ప్రదేశానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి మూడు నక్షత్రాల హోటల్ లోకి అడుగు పెట్టారు..
అప్పటికి తన అర్ధాంగికి ఓపిక వచ్చి మీకు తిప్పలేదా ఆ ప్రయాణంలో అని అడుగగా... ఎందుకు తిప్పలేదు ?? చాలా నిగ్రహించుకున్నాను.. ఆ సమయంలో మీరిద్దరే కళ్ళముందు కనిపించారు.. మీకులాగా నాకు అలా అయితే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అనే ప్రశ్న నన్ను పదే పదే గుర్తు చేసింది.. అందుకే నేను ఉండగలిగాను అని చెప్పాడు ఆ భర్త...
ఆ కోమలాంగికి ఒక్కసారిగా అనిపించింది..
ఆయన ఆఫీసులో ఉన్నప్పుడు లేవలేని పరిస్థితిలో నేను ఉంటే నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అని అనుకునే దాన్ని కాని ఆయన వెళ్ళేది నా కోసమే అని అర్ధం చేసుకోలేక పోయాను.. ఆయన నన్ను ఆ పరిస్థితిలో ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నారు అని నేను అర్ధం చేసుకుని ఉంటే బాగుండేది... అయినా నాకు అన్నీ సమకూర్చి వెళ్ళేవారు... తప్పు చేసాను.. నన్ను వదిలి ఆయన అక్కడ ఎలా వుద్యోగం చేసేవారో తలుచుకుంటేనే చాలా కష్టం గా వుంది.. ఆయన ఉండాల్సిన సమయంలో ఎప్పుడూ వుంటూనే వున్నాడు.. అయినా నేను ఎందుకు అలా ఆలోచించాను అనే ఆలోచనలతో ఆ కోమలాంగి తన భర్తపై మరింత ప్రేమ కనపరిచింది...
ఆ రాత్రి ప్రశాంతమైన నిద్రను అనుభవించిన తరువాత ప్రక్కరోజు ఉదయాన్నే .. రెండు కాఫీ కప్ లతో ఆ కోమలాంగి దర్శనమిచ్చింది.. ఇద్దరూ కలిసి బాల్కనీలో కూర్చుని వణుకుతున్న చలితో వేడి వేడి కాఫీ జుర్రుకుంటూ చూట్టూరా కనపడే పచ్చని తివాచి కప్పిన కొండలను, లోయలను, పక్షుల కిల కిలా రావాలను వింటూ ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు.. వాహన శబ్దాలకు, రేడియో ధార్మిక సిగ్నల్స్ కు, యాత్రిక జీవనానికి దూరంగా ఇద్దరు మాత్రమే ఒకరికొకరు ఉన్నట్లుగా ఉద్యోగం, ఇల్లు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు ఇవేమీ ఇప్పుడు వాళ్ళ మధ్య లేవు.. ఉన్నదల్లా ఆకాశమంత ప్రేమ వారి మధ్యన ఓ వృత్తాకారపు వలయంలా దృడంగా వుంది.. ఆ ట్రిప్ తరువాత వారు చాలా దగ్గరయ్యారు...తెరిచిన పుస్తకంలా వారి జీవితాలు సాగుతున్నాయి...
ఇదెలా సాధ్యం.. అదే భార్య, భర్తలు కదా .. అప్పుడు కనిపించని ప్రేమ ఇప్పుడెలా ??
ప్రేమ ఎప్పుడూ దంపతుల మధ్య వుంటూనే ఉంటుంది.. కాని ఆ ప్రేమను చుట్టూ వున్న సమస్యలు ఎప్పటికప్పుడు బలహీన పరుస్తూనే వుంటాయి.. ఆ సమస్యలను ఎప్పుడైతే అధిగమిస్తామో .. ముందు మన భాగస్వామి .... తరువాతే ఏదైనా అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడే వారి మధ్య ప్రేమ నిరంతరం చిగురించే సంజీవనిలా ఉంటుంది.. అంతే కాదు... నిత్యం నూతనత్వంతో శోభిల్లుతూనే ఉంటుంది...
ప్రేమ గుండెల్లో ఉంటే సరిపోదు.. అది మీ భాగస్వామికి పంచండి.. అప్పుడే దానికి నిండుతనం వస్తుంది.. ముందు నేను చెప్తే తక్కువ అయిపోతానే అనే ఆలోచనలు రానివ్వకండి.. ప్రేమలో తక్కువ, ఎక్కువ లు ఉండవు ... ఆనందం, ఆప్యాయతలే వుంటాయి.. కళ్ళు వుండి కూడా చూడలేని అంధకారంలో మనం ప్రస్తుతం బ్రతుకుతున్నాం.. ఇలాంటి ప్రయాణాల వల్ల అయినా మీరు మీ ప్రేమను గుర్తించాలని ఆశిస్తూ ఉన్నాను ...
ఇలాంటి ప్రయాణంలో భర్త భాద్యతాయుతంగా వ్యవహరిస్తాడు.. కాపుకాసే కంచెలా కనిపిస్తాడు.. భార్య తనతో తోడుగా తనని నమ్మి నడిచే ప్రేమమూర్తిగా కనిపిస్తుంది.. అలాంటప్పుడు వారు ఇద్దరు మాత్రమే ఈ లోకంలో వున్నట్లు వారు భావిస్తారు... వాళ్ళకన్నా ఏది ఎక్కువ కాదు అని గ్రహిస్తారు.. అందువల్లే ఇలాంటి అద్బుతాలు జరుగుతాయి.. ఇది ఇంట్లో ఉంటే సాధ్యం కాదు.. ప్రేమ పునరావృతం కావాలంటే ప్రదేశం మారాల్సిందే ...
కావాలంటే మీ అర్ధాంగితో ఓ లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసి చూడండి .. పోయి వచ్చాక ఆ తేడా మీరే గ్రహిస్తారు...
Written by : Bobby Nani
No comments:
Post a Comment