Friday, January 20, 2017

SOCOTRA (The Mysterious Island) from Bobby... 6th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ...

ఇదంతా వింటున్న ఓ పిల్లడు లేచి .. తాత గారు మరి ఇప్పుడు మీరొక్కరే వున్నారు అమ్మమ్మ గారు రాలేదా అని అడుగగా… కంటి అద్దాలను తీస్తూ చమ్మగిల్లిన తన కళ్ళను తుడుచుకుంటూ పోయిన ఏడాది తను భగవంతునిలో ఐఖ్యం అయింది నాయనా.. ఈ రంగుల లోకంలో ఒంటరిగా నన్ను విడిచి వెళ్ళిపోయింది అంటూ తడిఆరి వణుకుతున్న తన స్వరంతో అంటాడు.. ఆమె విడిచిన జ్ఞాపకాలతో ఇలా వూర్లు పట్టుకొని ఈ వయస్సులో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తిరుగుతూ వున్నాను.. అంటూ చెప్పి అక్కడనుంచి వెళ్లిపోతాడు.. 

నిజంగా ఆ పెద్దాయన మాటలు నన్ను, నా హృదయాన్ని ఎంతగానో ప్రభావితం చేసాయి.. అని అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

ఈలోపు మరో 15 ఏళ్ళ యువకుడు ముందుకు వచ్చి పెదనాన్న గారు నేను మాట్లాడవచ్చా అని అడుగుతాడు.. 

ఆ పిల్లవాని కుతూహలానికి ముచ్చటపడి .. అంతకన్నా ఏం చెప్తాడా అనే ఆతురతతో దానికేం భాగ్యం నాయనా రా ఇలా వచ్చి మాట్లాడు అంటూ దారిని ఇస్తాడు ప్రసన్నకుమార్ భాటియా..

ఇంతకీ ఆ పిల్లాడు ఏం చెప్పాలని వచ్చాడు.. మరి తెలుసుకుందాం పదండి ...

6th Part

ప్రతీ ఒక్కరికి తల్లి, తండ్రి వుండే వుంటారు.. అలాంటి వాటికి నోచుకోలేని ఓ దురద్రుష్ట వంతులలో నేను ఒక్కడిని... కనీసం నాకు పేరు పెట్టే వారు కూడా లేకుండా అతి దుర్భరమైన జీవితాన్ని ఉగతెలిసిన నాటినుంచి గడుపుతూ వస్తున్నాను.. చిన్నప్పుడు బాలల వసతి గృహంలో ఎందుకున్నానో తెలిసేది కాదు.. 


ప్రతీ ఒక్కరికి వారానికొకసారి అయినా వారి వారి తల్లి, తండ్రులు వచ్చేవారు.. 

నా కోసం ఎవ్వరూ వచ్చేవారు కాదు .. అక్కడ ఉన్నవాళ్ళను అడిగితే రేపు వస్తారు, ఎల్లుండి వస్తారు అంటూ అలా అలా పదేళ్ళు గడిపించేశారు … 

ఓ రోజు నా తల్లి, తండ్రి అంటూ ఇద్దరు వచ్చారు .. 

నా ఆనందానికి ఆ రోజు ఎల్లలు లేవు, హద్దులు లేవు … 

ప్రపంచాన్ని జయించిన సంతోషం తో ఉన్న నన్ను వారితోపాటు వారి ఇంటికి నన్ను తీసుకుపోయారు.. 

తీసుకెళ్ళిన అదే రోజు నుంచి వారి ఇంటి పని మొత్తం నా చేతే చేయించే వారు.. 

వారికి మరో ఇద్దరు చిన్న పిల్లలు వుండేవాళ్ళు … 

కాని వాళ్ళకు ఏమి పని చెప్పేవారు కాదు .. 

నాకు అర్ధం అయ్యేది కాదు.. 

వాళ్ళతోపాటు నన్ను ఆడుకోనిచ్చే వారు కాదు..!!

ఒకరోజు అడిగాను నా చేత మాత్రమే ఇవన్ని ఎందుకు చేయిస్తున్నారు ?? 


వారి ఇద్దరి చేత చేయ్యించట్లేదు ఎందుకని ? అని .. 

వారు చిన్న పిల్లలు కదా…!

నువ్వు వారికన్నా పెద్ద కదా..!

“పెద్దవాళ్ళు పని చెయ్యాలి, చిన్న పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలి” అని సమాధానం ఇచ్చారు ... 

నిజమే అనుకొని ఎన్నోసార్లు నా మనసుకు నేనే సర్ది చెప్పుకున్నాను.. 

నేను చేసేది ఎవరికోసం ?? 

నా అమ్మ, నాన్న, తమ్ముళ్ళ కోసమే కదా..!

ఏం కాదు అనుకొని…. అలా చేస్తూ మరో నాలుగు ఏళ్ళు తెలియకుండానే గొడ్డులా చాకిరీ చేసేసాను ... 

ఒకరోజు వారు మాట్లాడుకుంటుంటే అనుకోకుండా విన్నాను.. 

వాడికి ఇప్పుడిప్పుడే ఉగతెలుస్తోంది మనం నిజమైన తల్లి, తండ్రులం కాదని తెలిస్తే వెళ్ళిపోతాడేమో కదండీ .. ! 

అప్పుడేం చేద్దాం..?? 

అని మా అమ్మ... అనుకుంటున్న ఆమె అనగానే తెలియకుండానే కళ్ళలో ప్రవాహ ధార ఆగలేదు.. 

తల్లి, తండ్రి అనే బంధంతో నన్ను ఇన్నేళ్ళు వాడుకున్నారా ?? 

అంటే ఈ లోకంలో తల్లి, తండ్రి అనే బంధాలు కూడా కలుషితం అయిపోయాయా … !

అని వెక్కి వెక్కి రోదించాను .. 

ఈ ప్రపంచంలో నా కన్నీళ్ళు తుడిచేవారు ఎవ్వరూ లేనందుకు మరింత బాధ కలిగింది ఆ సమయంలో... 

నేను ఒక్కడినే ఈ ప్రపంచంలో ఒంటరిగా ఉన్నట్లు ఆ క్షణం అనిపించింది.. ఇక ఈ మనుషులకు దూరంగా ఉండాలని ఆనాడే నిర్ణయం తీసుకొని అందుకోసం అన్నీ దిగమింగుకొని వేచి వేచి చూసాను.. 

సరిగ్గా ఈ రోజుకు నాకు 15 ఏళ్ళు వచ్చాక ఆ అవకాశం దొరికింది .. కుటుంబం మొత్తం విదేశాలకు తినింది అరిగించుకోవడానికి వెళ్ళారు.. ఈ సమయం నాకు అనుకూలం... అందుకే అక్కడ నుంచి ఇలా ఈ లాంచీ ఎక్కి వచ్చేసాను…. 

నాకు ఇష్టం వచ్చిన ప్రదేశానికి నేను వెళ్లి ఒంటిరిగానే జీవితాన్ని గడపాలని ఎవ్వరిని నమ్మకూడదు అని వెళ్తున్నాను.. ఈ పదిహేనేళ్ళ నా జీవితం నాకు నేర్పిన పాఠంలో నా మిగిలిన సంపూర్ణ జీవితాన్ని నేను లాక్కోరాగలననే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాను.. 

ఎందుకో మీ లాంటి పెద్దల మాటలు, మీరు పడిన కష్ట, సుఖ, దుఃఖాలు విన్నాక వాటితో పోల్చుకుంటే … నావి పెద్ద కష్టాలే కాదని అనిపించింది.. నా ఈ బాధను మీతో పంచుకోవాలనిపించింది…

అని అంటూ నాకు ఈ అవకాశం కల్పించిన వారికి, అన్నీ విన్న పెద్దలకు నా నమస్కారములు తెలియజేస్తున్నాను … అని తన రెండు చేతులు జోడించి ఆ రాయి దిగి నిలబడ్డాడు... ప్రసన్నకుమార్ భాటియా ఆ పిల్లాడిని కౌగిలించుకొని ఆశీర్వదించి పంపుతాడు.. 

ఈలోపల ఓ నలభై ఏళ్ళ వ్యక్తి లేచి అక్కడే నిలబడి వున్నాడు… 

(అతని గురించి చెప్పేముందు అతని బాహ్య ప్రవర్తన, బాహ్య సౌందర్యం గురించి చెప్పాలి.. అతను లాంచీ ఎక్కినప్పటినుంచి ఎవ్వరితోను మాట్లాడలేదు… ఇప్పుడేమో లేచి ఏదో చెప్పాలని నిల్చున్నాడు.. అదీ కాక తను చూడటానికి మాసిన బట్టలతో, బాగా పెరిగిన జుట్టుతో కొంచం ఇబ్బందికరంగా కనిపిస్తున్నాడు.. )

ప్రసన్నకుమార్ భాటియా చాలా ఆశ్చర్యంగా తననే చూస్తున్నాడు.. ఎవ్వరితోను మాట్లాడని ఇతను లేచి నిలబడి ఏదో మాట్లాడేందుకు చూస్తున్నాడు … ఇతను ఏం చెప్పాలనుకుంటున్నాడు ? 

అని ఆశ్చర్యంతో మనసులో అనుకుంటూ వున్నాడు ప్రసన్నకుమార్ భాటియా… 

ఇక ఆగలేక ఏమండీ లేచి నిలబడ్డారు… ఏదో మాట్లాడాలనే కదా..!! 

మరెందుకు అక్కడే ఆగిపోయారు….??

రండి ధైర్యంగా ఇలా వచ్చి మాట్లాడండి … అని ఆహ్వానిస్తాడు ప్రసన్నకుమార్ భాటియా… 

అయిననూ అతనిలో చలనం లేదు..కొన్ని క్షణాల అనంతరం మెల్లిగా అడుగులు ముందుకు వేస్తాడు ఆ అపరిచితుడు.. 

మొత్తానికి ప్రసన్నకుమార్ భాటియా దగ్గరకు చేరుకొని మాట్లాడటం మొదలు పెడతాడు.. 

Hai Everybody.. అంటూ కొన్ని మాటలు ఇంగ్లీష్ లో మాట్లాడి అందరినీ చాలా ప్రేమగా పలకరిస్తాడు.. అందరూ ఆశ్చర్యంగా అతనివైపే చూస్తున్నారు.. 

అతని మాటతీరు, ఆ కంఠస్వరం అమృతంలో ముంచి తీసిన ద్రాక్ష పండులా మధురంగా మళ్ళి, మళ్ళి వినాలనిపించేంతలా వున్నాయి.. అతని మాటలకు, రూపానికి అస్సలు పొంతనలేదు…. అని అందరూ అనుకుంటున్న సమయంలో తనే ఇలా మాట్లాడటం మొదలు పెడతాడు... 


మీరు అందరూ ఇలా అనుకుంటూ వున్నారని నాకు తెలుసు... దాన్ని నేను వివరిస్తాను.. అని చెప్పనారంభించాడు … 
మీరు చూస్తున్న ఈ రూపం, మీరు వింటున్న ఈ మాటలు మీకు వింతగానే ఉంటాయి…. దానికి కారణం తెలియాలంటే కొన్ని రోజులక్రితం ఏం జరిగిందో మీరు తెలుసుకోవాలి .. నేను ముంబై నగరంలో ఓ పెద్ద ఐ.టి కంపెనీలో సాఫ్ట్ వేర్ గా విధులు నిర్వహిస్తూ వున్నాను.. 

నాకున్న తలపొగరు, అహం, అంతా ఇంతా కాదు.. నేను చేసిన పాపాలు అన్నీ, ఇన్నీ కాదు.. 

భయంలేని బ్రతుకును, బ్రతుకుతూ విచ్చలివిడితనానికి అలవాటుపడి కనిపించే ఈ రంగుల ప్రపంచమే నిజమనే భ్రమలో బ్రతుకుతున్న రోజులవి.. ఎవ్వరినీ మనిషిగా కూడా చూడకుండా ఆఖరికి రక్తసంబంధీకులందరినీ దూరం చేసుకొని ఒంటరిగా, ఒక్కడినే బ్రతుకుతూ వున్నాను.. నాతోపాటు ఒక పని పిల్లవాడు మాత్రమే ఉంటాడు.. 

వాడి గురించి చెప్పాలంటే వాడిని నేను ఎన్నో రకాలుగా హింసించే వాడిని .. అలా ఉంటూ వుండగా ఒకరోజు భయంకరమైన కల ఒకటి నన్ను కలవరపెడుతూ, నిరంతరం వెంటాడింది.. ఒకే కల పదే పదే వచ్చేది.. నిద్రపోతే చాలు ఎవరో డి.వి.డి. ప్లేయర్ లో ఒకే సన్నివేశాన్ని పెట్టి పదే పదే ప్లే చేస్తున్నట్లు నాకు ఆ కల ప్లే అయ్యేది.. ఇలా దాదాపుగా కొన్ని వారాలు నన్ను వెంటాడుతూనే వుంది …. 

నిద్ర పోవాలంటేనే భయపడి వణికిపోయాను.. భయం లేకుండా వున్న నన్ను ఆ కల వణికించేస్తుంది.. ఎందరినో కలుసుకున్నాను… ప్రతీ మతాన్ని ఆశ్రయించాను వెళ్ళని గుడి లేదు, వెళ్ళని చర్చ్ లేదు, వెళ్ళని మసీదు లేదు ఇలా నిద్రలేక, ఆ కలను భరించలేక ఈ భూలోకంలో ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తూ వుండగా…….

ఒకరోజు నా బాధను చూడలేక నా దగ్గర పనిచేసే పిల్లాడు ఒక సలహా ఇచ్చాడు …. 

ఆ పని పిల్లవాడి ఊరు ఒక చిన్న కుగ్రామంలో వుందట .. అక్కడనుంచి ఉత్తర దిశ వెంబడి ఓ 40 మైళ్ళ ప్రయాణించిన తరువాత “అస్తమయ పురం” అనే ఓ చిన్నగ్రామం వస్తుందట .. 


విషయం ఏంటంటే ఆ “అస్తమయ పురం” అనే గ్రామంలో ఎవరూ వుండరట.. చనిపోయిన వారిని మాత్రమే అక్కడ పాతిపెట్టి వస్తారని, అక్కడ అన్నీ సమాధులే ఉంటాయని .. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆ గ్రామం మొత్తం ఇప్పుడు వెలవెలబోతూ వుందని.. కొన్ని సంవత్సరాలక్రితం యేవో భయాల వల్ల అందరూ ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళారని చెప్పాడు.. 

ఎందుకో, ఏమిటో నేను అడగలేదు.. అక్కడకు ప్రతీ అమావాస్య తరువాత చంద్రుని నుంచి వెలువడే మొదటి రోజు (నెలపొడుపు) యవ్వన చంద్రకాంతులు ప్రసరించే ఆ రాత్రి వేళ ఒక అఘోరా వస్తాడని, తన మాటలు శూలాళ్ళలా ఉంటాయని, ఎన్నో సమస్యలను తను తీరుస్తాడని చెప్పి .. 

మరో ముఖ్య విషయం ఆ రోజు తప్పితే మరే రోజు అక్కడకు పగటిపూట కూడా వెళ్లరాదని హెచ్చరించాడు. ఇదంతా నేను ఒకప్పటిలా వుండి వుంటే మాత్రం బాగా నవ్వుకునే వాడిని .. ఇప్పుడు నాకో మార్గం దొరికిందని మనస్పూర్తిగా నమ్ముతున్నాను… 

నెలపొడుపు రావడానికి ఇంకా 10 రోజులు సమయం వుంది.. ఈ లోపు ఏర్పాట్లు చేసుకోవాలి … అని మనసులో అనుకొని ప్రయాణానికి సిద్దమయ్యాను.. 

2 రోజులకు మునుపే నా ప్రయాణాన్ని కొనసాగించి అక్కడకు చేసుకున్నాను.. చంద్రుని నుంచి వెలువడే ఆ మొదటి రోజు యవ్వన చంద్రకాంతికోసం ఎదురు చూస్తూ వున్నాను.. నా సమస్య పరిష్కారం కోసం వేచి వున్నాను… 

ఇంతలో ఆ రోజు రానే వచ్చింది… 

ఈ ఊరు నుంచి నలభై మైళ్ళు వెళ్ళాలి నాతో పాటు చిత్రమైన సమస్యలు వున్నవారు మరో నలుగురు వున్నారు.. 

మేము ఐదు మందిమి మాత్రమే అక్కడకు వెల్లబోతున్నాం.. మిగతా ఎవరూ అక్కడకు రాకూడదు అనే నిబంధన వుంది.. 

“అస్తమయ పురం” గ్రామానికి 5 మైళ్ళ దూరం వరకు ఒక ఆటో అతను మా ఐదుగురిని దించి... ఇక ఇక్కడనుంచి కాలి నడకనే వెళ్ళాలి మీరు తప్ప మరెవ్వరూ మీ వెంట రాకూడదు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు.... 

భయపడుతూనే ఆ రాత్రివేళ అక్కడనుంచి కాలినడక మొదలు పెట్టాం.. 

చుట్టూరా ఖటిక చీకటి, టార్చ్, మొబైల్, కెమెరా తీసుకురాకూడదు అని హెచ్చరించి వున్నారు ఆ గ్రామస్తులు .. కేవలం ఎవరికి వారు లాంతర్లు పట్టుకుని వెళ్తున్నాం.. ఎదురుగా ఏముందో కూడా కనిపించని దట్టమైన చీకటి దుప్పటి కప్పినట్లు వుంది .. 

కిందేమో అడుగు అడుగుకీ ఎండుటాకుల శబ్దం…

నరాలు చిట్లేలా చలి, ఒళ్ళు ఝల్లుమనేలా దూరాన నుంచి వస్తున్న తోడేళ్ళ కూతలు… 

ఆ ప్రదేశం అంతా మరణం కోసం వేచి చూస్తున్న మృత్యువులా మారి వుంది..

ఇన్నిరోజులు నన్ను భయపెట్టిన కలను వెతుక్కుంటూ నిజంగానే ఆ భయంకర ప్రదేశానికి కావాలనే నాకు నేనుగా వెళ్తున్నానా ? అనే సందిగ్ధంలో పడిపోయి వుండగా.. 

దూరాన ఒక పెద్ద మంటను మేము గమనించాం.. ఆ మంట దాదాపుగా 12 అడుగుల ఎత్తుకు ఎగసి మండుతోంది..

 
దగ్గరకు వెళ్ళే కొద్ది ఊపిరి భారంగా మారిపోతోంది.. 

అప్పటికే సమయం రాత్రి పదకొండుంపావు .. 

ఆ మంటకు దగ్గరౌతున్న కొద్ది గుండె వేగం పెరుగుతోంది.. 

చివరికి ఎలాగోలా దగ్గరకు చేరుకున్నాం .. 

కాని అక్కడ ఎవరూ లేరు..!!

ఆ అఘోరా కోసం మా కళ్ళు వెతుకుతున్నాయి.. 

ఎక్కడికి వెళ్ళాలో తెలియక అక్కడే నిలబడిన మాకు ఒక ఖఠిన స్వరం వినిపించింది … 

అది ఎక్కడనుంచి వినిపిస్తుందా అని చూస్తే ..! 

సరిగ్గా మాకు రెండు అడుగుల దూరంలో వున్న అప్పుడే పూడ్చిపెట్టినటువంటి గుంటలో నుంచి అని గ్రహించాము.. 

అంత చలిలో కూడా మాకు చెమటలు పడుతున్నాయి .... 

భయంతో కాళ్ళు, చేతులు వణికిపోతున్నాయి…. 


To be continued …

Written by : BOBBY

6 comments: