Wednesday, January 11, 2017

నేత్ర జలము ..



నేత్ర జలము .. 
***********

ఏదో రాయాలని తపన ... !ఎన్నో చెప్పాలని భావన.. !
దేని గురించి రాయను ?? దేని గురించి చెప్పను ?? 
మనసునిండా అస్తవ్యస్తమైన ఆలోచనలు.. 
చెదిరిపోతున్న ఊహలు ..
స్థిరంగా ఒక్కటీ నిలవడం లేదు..!
పోనీ ప్రేమను గురించి రాయనా ?? 
అబ్బా .. “ప్రేమ” ఈ పదంలోనే యెంతో 
మాధుర్యం స్రవిస్తోంది కదా.. 
అయితే ఈ “ప్రేమ” ఇవాళ కొత్త కాదె..!
సృష్టి మొదలే దానికి అంకురార్పణ.. !
అప్పుడే ప్రారంభం మానవజాతి సముద్దరణ..
ఎన్ని లక్షల సంవత్సరాల క్రిందటిదో.. 
అయినా నిత్య నూతనంగా, సత్య కేతనంలా ...
కాలానికి అతీతంగా... శాశ్వతంగా ... 
ఏదీ ??
ప్రేమకు నిర్వచనం.. !
ఏది ??
ప్రేమకు వ్యాఖ్యానం ..!
అపురూపం, అజరం, అమరం అని చెప్పనా.. !
సత్యం, శివం, సుందరం అని చెప్పనా..!
భగవత్ప్రతిరూపం ప్రేమ అని చెప్పనా.. !
నిస్వార్థ భావం ప్రేమ అని చెప్పనా.. !
నిశ్చలానంద సుందర ప్రేమ అని చెప్పనా ..!
అనంతమైన ప్రకృతికి మన ఉపకృతి ఏదీ ?? 
ఆకాశం, భూమి, నీరు, నిప్పు, గాలి, పంచభూతాలు 
కురిపిస్తున్నాయి మానవకోటి మీద ప్రేమ తరంగాలు...!
ఒక్క క్షణం ఆకాశం కన్నెర్ర చేసినా,
ఒక్క నిమిషం భూదేవి ఆవులించినా, 
మరొక్క క్షణం జలధారు ఉప్పొంగినా, 
ఎక్కడ మానవ జాతి చరిత్ర.. !
ఏమౌతుంది మన నాగరికత ...!
అందుకే ప్రేమకు ప్రతిరూపం దైవం.. !
దైవమంటే చెప్పలేని పవిత్ర భావం.. 
బుద్ధి విలువలు పెరిగిన కాలం ఇది.. 
మంత్రాలు, తంత్రాలు చెల్లని రోజులివి.. 
దేవుడే దిగివచ్చినా నమ్మని ప్రపంచమిది.. 
అందుకే.. 
సువర్ణమయ కిరీటంతో, కౌస్తుభా మణిహారంతో..
చతుర్భుజాలతో, సూర్య చంద్ర నేత్రాలతో.. 
నీవే వచ్చినా నమ్ముతామా ..! మేము.. !
ముమ్మాటికీ నమ్మం...!
మా తెలివి నీకు తెలుసు..
మా కలిమి నీకు తెలుసు.. 
మా బలిమి నీకు తెలుసు.. 
మమ్ము కన్నవాడివి కదా నువ్వు.. 
నీ ప్రతిరూపాలుగా ఎందరినో పంపావు.. 
పుణ్యం, పాపం సమతుల్యం చేస్తున్నావు.. 
నీకు తెలుసు మా మనుగడ ఏమిటో.. 
ఎప్పటిదాకానో ... ఎందాకనో.. 
సృష్టికర్తవు కదా నీవు..
అనంత ప్రేమ మూర్తివి నీవు.. 
విశ్వకల్యాణ కారకుడవు నీవు.. 
ప్రతిగా ఎమిచ్చుకోగలం నీకు... 
ఏమీ లేని దరిద్రులం మేము.. 
భావ దరిద్రులం, భాషా దరిద్రులం..
నీ రూపం ఊహించగలం.. కాని భావం లేదు మాకు...
నిన్ను స్తుతించగలం.. కాని భాష లేదు మాకు.. 
అయినా నీ ప్రేమ పొందిన ఐశ్వర్యవంతులం .. 
అర్పిస్తున్నాం కానుకగా నేత్ర జలము .. 

Written by: Bobby Nani
11th Jan 2017

No comments:

Post a Comment