Tuesday, December 27, 2016

భావ ప్రకంపనాలు..



భావ ప్రకంపనాలు.. 
*****************

ఆవేదనలో నుండి “కవిత్వం” పుడుతుందని కొందరి నమ్మకం.. అనుభవంలో నుండి కూడా “కవిత్వం” ఆవిర్భవిస్తుందని నేను అంటాను.. భావ ప్రాధాన్యత, వస్తు విశిష్టత, రచనకు అందాన్ని చేకూరిస్తే, పాండిత్యం పరిథులు ఎర్పరుస్తుందని నేను నమ్ముతాను.. మాన్యులనే కాదు, సామాన్యులనూ మెప్పించేది కవిత్వం... ఒక రచన కాని, కవిత్వం కాని అధికశాతం జనం చదివి అర్ధం చేసుకొని, దాన్ని తమకు అన్వయించుకొని బేరీజు వేసుకునే భావనను కలిగింపజేసేది కవిత్వం.. అంటే అనుభవాలు అక్షర రూపంగా ఆకృతి దాలిస్తే.. ఆ అనుభవం సార్వజనీకం కావాలి.. 
ఈ మధ్య చుసిన ఒక పోస్ట్ .. చాలామంది అర్ధం కాని కవిత్వం రాస్తున్నారు. కనీసం రాసేవారికైనా వాటి భావం తెలుసా అని.. ఇక్కడ రాసేవాళ్ళు ఎంతమంది వున్నారు ?? కనిపించే వారంతా రాసేవాళ్ళే అనుకోవడం పొరపాటు.. వీళ్ళంతా “అక్షర చోరులు” అందుకే వీళ్ళకు అర్ధాలు, భావాలు, అవసరం లేదు.. చెప్పలేరు కూడా.. 

ఒక “కవి” కాని “రచయిత” కాని అర్ధవంతమైన అక్షరాలతో ఎదుటివారి హృదయానికి చేరువ కావాలనే తపనతో రాస్తాడు.. అలాంటి సమయంలో కొన్ని పదాలు కొత్తగా మధురంగా ఉండేలా తను శ్రమిస్తాడు .. అంతే కాని అన్నీ అర్ధం కాకుండా రాయాలని మాత్రం ఏ రచయిత అనుకోడు.. అలా రాస్తే తప్పక భావం కూడా రాయాల్సిన భాద్యత ఆ రచయితది ... అమృతం కూడా రోజు తాగితే వెగటు పుడుతుంది.. అప్పుడప్పుడు రుచి చూస్తే ఆ మధురం, ఆ మాధుర్యము వేరు.. ఇలాంటి రుచినే నా లాంటి యువ రచయితలు కొందరు కోరుకుంటూ వున్నారు.. నేను అప్పుడప్పుడు కొన్ని ఖటినమైన పదాలను అల్లుతుంటాను .. దానివల్ల కొందరు ఆ పదాలయొక్క విశిష్టతను తెలుసుకోగలరనే ముఖ్య ఉద్దేశంతో రాస్తుంటాను.. అంతకుమించి మరో ఉద్దేశం లేదు.. 

వచన కవిత్వం వేళ్ళూనుకున్న నేటి సమాజంలో “కవి” అనేవాడు సమాజాన్ని, వర్గాన్ని ప్రశ్నించడానికే పరిమితం కాకుండా, అనురాగం, ఆప్యాయతలు, దేశభక్తి, కర్తవ్యదృష్టి కలిగించడానికి వాటిని పెంపొందించడానికి తన ప్రతిభను విస్తరించాలి.. స్వాతంత్రం కాలంనాటి రచనలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే, మన పంథాలో మార్పు, ప్రజల మనుగడలోనూ మార్పు తీసుకురాగల అవకాశం వుంటుంది.. దేశ మాతను, కన్నతల్లినీ ప్రేమించలేని వారు నా దృష్టిలో దేన్నీ ప్రేమించలేరు.. 

నేటి కలుషిత వాతావరణంలో కక్ష్యలూ, ద్వేషాలూ, కొలువుతీరిన తరుణంలో, అకారణ, మారణ హోమగుండాలు, ప్రజలే సమిధలుగా మండుతున్న నేపధ్యంలో, మానవాళి మనుగడే ప్రస్నార్ధకమౌతున్న ఈ తరుణంలో సామరస్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని, మమతానుభందాలను, న్యాయవర్తనమును పరిరక్షించే రచనలు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది.. అలాంటి రచనలు ప్రజల జీవన స్రవంతిలో కలిసిపోవాలి.. అందుకు ప్రతీ రచయిత, కవి నిరంతరం శ్రమించాలి.. ఎందుకంటె దేశ సమగ్రతను కాపాడగలిగేది కత్తులూ, బుల్లెట్లు కాదు కేవలం కలం మాత్రమే.. అందుకే కలం కలుషితం కాకూడదు.. కరుణామయం, దేశభక్తి పూరితం కావాలి.. చైతన్యవంతమైన సమాజంలో చేతన తేవాలి.. 

ఎటువిన్నా, కన్నా, హింసారక్తపాతాలే జూలు విదిల్చి వికటాట్టహాసం చేస్తుంటే, పంజా విసిరి దేశ ఉనికికే చేటు తెస్తుంటే, సగటు మనిషి రక్షణ కరువై, సతమతమవుతున్న దయనీయ పరిస్థితుల పారద్రోలటానికి ప్రతీ కవి, రచయిత పరిక్రమించాలనే ధ్యేయంతో నా వంతు భాద్యతగా ఎన్నో రచనలు చేసాను, చేస్తూ వున్నాను.. 

అయితే నేను కేవలం వీటితోనే ఆగిపోవాలని అనుకోలేదు.. అందుకే ప్రతీ భావనతో కూడిన కవితలను నేను మీకు ఎప్పటికప్పుడు పరిస్థితిని బట్టి, పరిసరాలను బట్టి అందించడం జరిగింది.. అది ప్రకృతి మాత ఒడి కావచ్చు, కోమలాంగి కౌగిలి కావచ్చు, తల్లి మాధుర్యం కావచ్చు, తండ్రి భాద్యత కావచ్చు, ప్రళయం కావచ్చు, ప్రమాదం కావచ్చు, అతివలపై జరిగే అన్యాయాలు కావచ్చు, పసిబిడ్డ నవ్వు కావచ్చు, సమాజానికి సంధించే అస్త్రం కావచ్చు ఇలా ఎన్నో మీకు అందించడం జరిగింది.

ఇలా అందరికీ ఆ భావ ప్రకంపనాలను పట్టి కాగితంపై అక్షరాలుగా పేర్చడానికి అవకాశం రాదు, వచ్చినా సమయం వుండదు, వున్నా కొన్ని సమయాల్లో సమస్యలవల్ల చెయ్యలేరు. కొందరికి అలా కాగితంపై పెరుగెత్తించేంత పటిమ వున్నా, అవి జనబాహుళ్యానికి చేరువ కాలేక చెత్త బుట్టకో, పెంటకుప్పకో అర్పితమై పోతుంటాయి.. 

మీరు రాయాలి అనుకుంటే రాసెయ్యండి.. చెయ్యాలి అనుకుంటే చేసేయండి.. రాయాలా, వద్దా అనే ఆలోచనలతో మాత్రం రాయకండి .. అలా రాస్తే అక్షరాలు అల్లరిపాలౌతాయి .. శక్తి రావాలంటే శబ్దం కావాలి, శబ్దం రావాలంటే స్వరం కావాలి, స్వరం కావాలంటే అక్షరం చాలా ముఖ్యం.. గమనించగలరని ఆశిస్తూ...

జనవరి 1వ తేది దాకా పోస్ట్ రాయకూడదు అనుకున్నా .. ఎందుకంటె జనవరి మొదటి తేదీ నుంచి నా కథ మీ ముందుకు రాబోతుంది.. కాని ఇంతలో ఓ సోదరి అభిమానంతో ఈ పోస్ట్ రాయాల్సి వచ్చింది.. 

స్వస్తి __/\__

Bobby.Nani

No comments:

Post a Comment