“ఉయ్యాలూపే ఒయ్యారి చెయ్యి”...
**********************
“అమ్మ” ఈ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేనే లేదు .. ఎందుకంటె నాటి నుంచి నేటి వరకు ఎందరో మహానుభావులు అక్షరాలను మాలలుగా గుచ్చి అందించి వున్నారు.. అయినప్పటికీ ఎప్పుడూ మనసుకు హత్తుకుంటూనే ఉంటుంది ..
అమ్మతో అనుబంధంలేని జీవితం వుండదు.. ప్రతీ సమయంలోనో, ఏదో ఒక సందర్భంలోనో గుర్తు చేసుకొనే తియ్యటి జుంటితేనే అమ్మ.. అమ్మ గురించి ఏమి రాయాలనే సందేహం కలిగిన వాళ్ళు వున్నారు.. పూర్తి వ్యక్తిగతాన్ని అమ్మకోసం మన ముందు పరిచిన వారూ వున్నారు.. జ్ఞాపకాల పొరల్లోనుంచో, అనుభూతుల గురుతుల్లోనుంచో, గుండెలో దాచిన అల్మరాలోంచో “అమ్మా !! నిన్ను ప్రేమిస్తున్నాను “ అని చెప్పడంలో వున్న ఆనందం మాటలలో ఏ రచయిత, ఏ కవి వర్ణించలేని నగ్నసత్యం అది..
అందుకే నా పరిభాషలో నేను చెప్పాలంటే “ఉయ్యాలూపే ఒయ్యారి చెయ్యి” అమ్మది అంటాను..
అమ్మంటే ఓ అద్బుతం..
అమ్మంటే ఓ అపురూపం..
అమ్మంటే ఓ అద్బుత కావ్యం..
మురిపాలు, జ్ఞాపకాలు,
లాలిపాటలు, గోరుముద్దలు,
అక్షరాలు, ఆలింగనాలు,
నడక, నడత,
అనురాగాలు, ఆత్మీయతలు,
ఆనంద సమయాలు,
కన్నీళ్లను వర్షించే క్షణాలు
ఇంకా..ఎన్నో ఎన్నెన్నో..
అందమైన అనుబంధం,
అంతేలేని అనురాగం
వెరసి ఓ మరుపురాని జ్ఞాపకం..
నన్ను గెలిపించడానికి తను ఓడిపోతుంది..
అలా ఓడిపోవడమే గెలుపనుకుంటుంది..
ఒకసారి నన్ను కొట్టింది..
అయినా ఏం లాభం ?
నాకంటే ముందే ఏడ్చింది..!!
నేను గుక్క పెట్టేలోపే
గుండెల్లోకి లాక్కుంది..
తెరలు తెరలుగా
తన కౌగిళ్ళలో కప్పుకుంది..
కళ్ళే కాదు.. తనువులోని
ప్రతీ అణువు చెమరించేలా ఏడ్చింది..
ఇంకెప్పుడూ అమ్మకు కోపం తెప్పించకూ !! అంటూ
నను బహిరంగంగా బతిమాలింది..
మన అల్లర్లు వెయ్యి భారించాక ఒక్కటి చెబుతుంది..
అదే అమ్మంటే..
స్వస్తి ___/\___
Bobby Nani
No comments:
Post a Comment