Wednesday, October 26, 2016

అసలు కథలంటే ఏంటి ? ఏది కథ ? ఏది కథ కాదు ? ఈ విషయాలను ఓ సారి పరిశీలిద్దాం ..


అసలు కథలంటే ఏంటి ? ఏది కథ ? ఏది కథ కాదు ? ఈ విషయాలను ఓ సారి పరిశీలిద్దాం .. 

కొందరు విమర్శకులు, సంపాదకులూ, ఒకొకప్పుడు పాఠకులు కూడా కథంటే ఇలా ఉండాలి, ఈ లక్షణాలు ఉంటేనే కథ అవుతుంది అని నిర్ధారించి ఉన్నారు .. 
వారు నిర్దేశించిన కొన్ని ముఖ్య లక్షణాలు చెప్తున్నాను : క్లుప్తత, వాస్తవికత, సమయైక్యత, నిబద్దత, సాంద్రత.. రెండో స్థాయిలో పరిశీలించేవి : ఎత్తుగడ, నిర్వహణ లేక నడక, ఆవరణ, పాత్రపోషణ, ముగింపు, వీటికి తగినట్లుగా సన్నివేశాలు.. సంఘర్షణ ఉన్నాయా ? లేవా అన్నది పరిశీలిస్తారు ఈ విమర్శకులు ... 

నిజానికి అసలు కథకు ప్రధానాంగాలు : ఎత్తుగడ, నిర్వహణ, ముగింపు, ఉపాంగాలు, ఆవరణ, పాత్రచిత్రణ, భాష... 
ఈ భాష అనేది చాల విస్తృతమైన విషయం... 
అసలు కథ అంటే ఏమిటి ?
ఏది కథ అవుతుంది ?

మీరు ఏది మాట్లాడితే అదే కథ... లేదా కథ అవ్వడానికి కావాల్సిన లక్షణాలను కలిగివుంటాయి మీ మాటలు.. మనం ప్రతీరోజు కథలు చెప్పుకుంటూనే వుంటాం.. ఏ ఇద్దరు ఎదురుపడినా రెండోవారు చెప్పేవి కథలే.. “ఇవాళ ఏమైందో తెలుసా?” అని ఒకరు మొదలెడితే అది కథ కావచ్చు అంతెందుకు మనం లేట్ గా వెల్లామనుకోండి అక్కడ వారికి మనం చెప్పేవి కూడా కథలే.. 

ఉదాహరణకు : 

హోంవర్క్ ఏది ?
కుక్క తినేసింది .. 
ఇంటికి ఆలస్యంగా వచ్చారెందుకు ??
వానపడింది.. 
వానెక్కడ పడింది.. ఫేళ్ళున ఎండ కాస్తుంటే 
ఇక్కడ కాదు ప్రక్క వీదిలో పడింది.. 

ఆమాట నిజమే కావచ్చు.. లేదా కొంచం నిజం కావచ్చు, కాకపోవచ్చు కూడా... కానీ ఇవన్నీ కథలవడానికి అవకాశం వుంది.. 

మాట ఏనాడైతే పుట్టిందో అప్పుడే కథలూ పుట్టాయి.. ముందు కథనం, తరువాత లేఖనం, అనాదిగా జానపద సాహిత్య రూపంలో మౌఖికంగా కథలు చెప్పుకుంటూనే వున్నాం.. ఈనాడు మనం కథాంశాలు అని వేటిని చెప్పుకుంటూ వున్నామో అవన్నీ జానపదగేయాల్లో చూస్తాం.. 

పల్లెలో ఒక చిన్నవాడు కంటబడ్డ చిన్నదాన్ని అడుగుతాడు ఇలా 
ధాన్యమైనా దంచగలవా పిల్లా నీవు.. ?? అని 
ధాన్యమంటే దగ్గోస్తాదయ్యా మాకు అంటుందా చిన్నది.. 
ఇలా యేవో మూడో నాలుగో ప్రశ్నలేస్తాడు ఆ చిన్నవాడు.. 
చివరికి అంటాడు.. 
సంతకైన ఎల్లగలవా పిల్లా నీవు ?? 
సంతకంటే సంతోషమయ్యా మాకు అంటుందాచిన్నది.. 

వెనుకటి రోజుల్లోను, పెళ్లి చూపులలోను, ఇప్పుడు డేటింగ్లలోను జరిగేది అదే.. పెళ్ళికి ముందు పిల్లదాని అర్హతలు, అభిరుచులు కనుకోవడం.. నిజమైన డేటింగ్ అంటే ఇది.. నేటి కాలపు డేటింగ్ అలా లేదు.. దానికి అర్థాన్నే పూర్తిగా మార్చేసారు.. 
అలాగే త్రివిక్రమ్ గారు మళ్ళి చూపించినటువంటి కొన్నిటిని చూద్దాం.. 
ఓ అత్త కొత్త కోడలిని నిలదీస్తుంది.. 

పచ్చిపాల మీద మీగడేదమ్మ 
వేడిపాలలోన వెన్న ఏదమ్మా అంటూ.. 
ఆ కోడలు ఆ అత్తకు ఎదురు చెప్పలేదు .. అందుకని పొరిగింటి ఇల్లాలితో ఇలా అంటుంది.. 
మాయత్త ఆరళ్ళే గానీ చూస్తివ ఓయమ్మా ?
పచ్చిపాలమీద మీగడుంటుందా ..
వేడిపాలలోన వెన్న ఉంటుందా ..
అంటూ తన బాధ వెళ్ళబోసుకుంటుంది ...

ఇలా ఆనాటి పాటకజనం తమ కష్టం, సుఖం, మంచి, చెడ్డ, అన్నీ కలబోసుకొని ఒకరికొకరు చెప్పుకునేవారు.. అందుచేత కథ ఎప్పుడు పుట్టింది అంటే మాట పుట్టినప్పుడే అని చెప్పుకోవాలి.. ఒకరితో మరొకరు మాట్లాడినప్పుడల్లా ఏదో కథకు ఆస్కారం ఉంది .. 

కథ వ్రాతపూర్వకంగా మొదలైంది పైశాచీ భాషలో గుణాడ్యుడు రాసిన బృహత్కథ అని సాహిత్యం చెప్తోంది.. తెలుగు కావ్యాలు, ప్రబంధాలు, బృహత్కథ లోని వృత్తాలు తీసుకొని రాసినవే.. 

కథనం చెప్పిన పద్దతి – పద్యరూపమే అయినా వీటిలో కథలు వున్నాయి.. శాలివాహనుని గాధాసప్తశతి, సోమదేవుని కథాసరిత్సాగరం, ఇంకా భట్టి విక్రమార్క చరిత్ర, భేతాళపంచవింశతి ఇలాంటివన్నీ సంస్కృతమూలాలనుండి తీసుకొని తెలుగులో రచించినవి.. అలాగే సంస్కృత రామాయణం, మహాభారతాలలోనుంచి కూడా ఇతివృత్తాలను తీసుకొని తెలుగు కథలు రాయడం జరిగింది.. 

కథలు అనేవి మన భాషనుంచే వచ్చాయని మనం స్పష్టంగా నమ్మొచ్చు... కథ ఎవరైనా రాయవచ్చు.. కాకపోతే కొన్ని ప్రాస నియమాలు, అలంకారాలు, పర్యాయపదములు, అన్నిటికన్నా ముఖ్యం లోతైన ఆలోచనాధోరణి కలిగి వుంటే చాలు .. ఇలాంటివి రాయడం అలవరుచుకుంటే మన ఆలోచనా విధానం చాలా మెరుగుపడుతుంది.. నేటి కాలం పిల్లలు రాయడం అటువుంచితే చదవడమే గగనమైంది.. పిల్లల్లో మార్పు తేవాలని కోరుకుంటూ ఆ భాద్యతను తమ భుజస్కంధాలపై మోయాలని పెద్దవారికి విన్నవిస్తూ.. 

స్వస్తి ____/\____


Bobby Nani

No comments:

Post a Comment