Monday, October 17, 2016

దారితప్పిన తుమ్మెద..



దారితప్పిన తుమ్మెద.. 

ఓ పచ్చని చెట్టు ఆకు క్రింద జీవం పోసుకుంటుందొక ప్రాణం.. 
తళతళమని మెరిసే గాజువంటి ఆకృతిలో... 
దుమ్ము, ధూళికి సైతం, ఎండా వానకు సైతం చెక్కుచెదరక ...!!
రోజులు గడుస్తున్నాయ్, ప్రాణం ఊపిరిపోసుకొని ఓ రూపం దాల్చుతోంది... 
ఇంతలో ఓ రోజు ఆ గాజుగూడు భళ్ళున పగిలింది ... 
చిత్రమైన రూప లావణ్యంతో, 
జుగుప్సాకరమైన ఆకారంతో,
మెల్లి మెల్లిగా బయటకు వచ్చిందో జీవి.. 
ఆకుపచ్చని రంగులో అందవిహీనంగా ఉన్న ఆ జీవి
వచ్చి రాగానే వెతుకుతోంది తనవారిని .. 
వృధా ప్రయాస అని తెలియడానికి కొంచం సమయమే పట్టింది.. !!
మెరుపువంటి వేగంతో, నిప్పు కణిక వంటి నేత్రములతో,
మరో జీవి మీద మీదకొస్తోంది ... 
కదలడానికి ఇన్ని కాళ్ళు వున్నా, వేగంలేని కదలికతో ముందుకు వెళ్తోంది.. 
నివాసం నుంచి క్రిందపడి తప్పించుకోగలిగింది ఆ క్షణమున ... 
భయం, భయం .. ఈ భయంతోనే బ్రతుకుపోరాటం చేసింది కొన్ని రోజులు.. 
ఓ రోజు విశ్రాంతి సమయంలో, ప్రసవ వేదన మొదలైంది అనుకోకుండా.. 
వస్త్రములు వేరు అయినట్లు తన చర్మం కోసుకుపోయి విడిపోతుంది..
కొన్ని నిమిషాల వేదన అనంతరం .. 
తోలిసంధ్యా కాంతి లే లేత వెలుగులలో, 
రంగు రంగుల రెక్కలు పొదిగినట్లుగా, 
ఓ అందమైన తుమ్మెదలా రూపుదాల్చింది .. 
తనకే ఓ ఆశ్చర్యం, 
తనకే ఓ ఆనందం,
తనే ఓ అద్బుతం.. 
గుండెనిండా మనో నిబ్బరంతో, తన రెక్కలను రెపరెప లాడిస్తుంది .. 
మెల్లిగా తను పైకి లేస్తుంది.. .. ఎగురుతోంది.. 
ఆకలితో ఉన్న ఆ తుమ్మెదకు అప్పుడే ఓ వికసించిన పుష్పం కనిపించింది.. 
చూడగానే వేగంగా ఆ పుష్పం మీద ఆమాంతం వాలిపోయింది..
ప్రియుని కౌగిలి కోసం వేచిచూసే ప్రియురాలిలా ఆ పుష్పం, 
ఆ ప్రియురాలి మధుర మకరంద రసాన్ని జుర్రుకునే ఓ ప్రియునిలా ఈ 
తుమ్మెద రెండూ తపించిపోతున్నాయి .. 
తన ప్రియుని దాహం తీర్చేందుకు ఆ పుష్పం తన మధుర రసాన్ని విడిచింది.. 
ఊపిరాడనివ్వకుండా కొన్ని నిమిషాలు ఆ మధుర రసాన్ని అమాంతం జుర్రుకుంది .. 
ఇద్దరికీ అది తొలి అనుభవం.. ఓ మధుర అనుభవం .. 
సంధ్య వేళకు వాడిపోతుందని ఆ పుష్పానికి తెలియదు.. 
మళ్ళి మధుర రసాన్ని అందివ్వలేదని ఈ తుమ్మెదకు తెలియదు.. 
ఇద్దరూ ఘాడంగా ఒకరిలో మరొకరు ఐక్యం అయిపోయారు అలా.. 
కొన్ని నిమిషాల బిగుతు కౌగిలింతల అనంతరం విడువలేక విడువలేక విడిచిన ఓ
దారితప్పిన తుమ్మెద మొదటి మకరంద మధురమిది.... !!!!

Bobby Nani

No comments:

Post a Comment