Tuesday, September 6, 2016

ఓ అసాధారణమైన రచయిత....



ఓ అసాధారణమైన రచయిత గురించి నా మాటల్లో మీతో నేను పంచుకోవాలనిపించింది .. 

నేను చదివిన ఆయన రచనలను బట్టి, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ఏదో నాకు తెలిసిన నాలుగు మాటలు చెప్తూ వున్నాను.. యెంత చెప్పినా ఆయనగురించి అవన్నీ తక్కువే అవుతాయి.. చలనం లేని రాతి సైతం ఆయన రాతలకు చలించిపోతుంది.. ఆయనే ఓ అసాధారణమైన రచయిత “ చలం” (గుడిపాటి వెంకట చలం) గారు.. చలంగారిని పోలిస్తే ఒక నిర్ణిద్ర సముద్రంతో పోల్చాలి.. ఒక మహా జలపాతంతో పోల్చాలి.. లేదా ఒక ఝంఝూనిలంతో నైనా పోల్చాలి... 

చలం గారి అస్తమయంతో ఒక సముద్రం స్తంబించినట్లు, ఒక జలపాతం నిశ్చలమై పోయినట్లు, ఒక ఝంఝూనిలం శాంతించినట్లు అయిపోయింది.. గుడిపాటి వెంకట చలం గారు ఆంధ్ర సాహిత్యంలో ఒక సుడిగాలి వలె, ఒక పెద్ద వరద వలె ప్రవేశించారు .. సంఘంలో, సాహిత్యంలో, ప్రజల ఆలోచనల్లో తర తరాలుగా పేరుకుపోయిన కశ్మలాన్ని కడిగిపారేశారు .. చెత్తా, చెదారం, దుమ్మూ, దూగర ఎగరగొట్టి చైతన్య వంతమైన క్రొత్త గాలులకు తలుపులు తెరిచారు.. క్రొత్త భావాలకు లాకులు ఎత్తివేశారు.. 

ఓకే గొప్ప రచయిత ప్రవేశం తరువాత ఏ సాహిత్యం యథాతథంగా మిగలదు.. దాని స్వరూపం మారిపోతుంది.. దాని స్వభావం మారిపోతుంది.. సాహిత్యంపై ఆయన తన ప్రభావాన్ని ఎన్నటికీ చెరగని విధంగా ముద్రించారు.. తెలుగు వచనా స్వరూపాన్ని, తన రచనా స్వభావాన్ని పూర్తిగా మార్చివేశారు.. సమకాలిక రచయితలపైన, తరువాత తరం వారిపైనా తన ప్రభావ ముద్ర వేశారు.. 

ఆనాడు ఆయనను గురించి రెండే రెండు అభిప్రాయాలు ఉండేవి.. అవి : విమర్శిస్తే అతి తీవ్రంగా విమర్శించడం, లేదా అంతే ఘాడంగా అభిమానించడం ...ఫరవాలేదు బాగానే రాస్తాడు అనో, లేదా ఏమి వ్రాసాడు లెద్దూ అనో చప్పరించి వెయ్యడానికి వీలులేని రచనలను ఆయన చేసారు.. మరొక అభిప్రాయానికి తావులేకుండా రాసేవారు.. 

చలం ఏంటి ఇలా వ్రాసాడు ? ఇంత పచ్చి బూతులా ? ఇంత బరి తెగింపా ? అవినీతిని, విశృంఖలత్వాన్ని భోదిస్తున్నాడే ! సంఘాన్ని, ముఖ్యంగా వివాహ వ్యవస్థను కూకటి వేళ్ళతో సహా కూలద్రోయడానికి యత్నిస్తున్నాడే ! హిందూ సంప్రదాయాన్ని, ఆచారాలను, విశ్వాసాలను, కుల భేదాలను మంట గలుపుతున్నాడే ! ఇలాంటివి ఎన్నో ఆయనను ద్వేషించిన వారి విమర్శ ఇది.. కాని ఈ విమర్శలకు చలంగారు చలించలేదు... తాను నమ్మిన సిద్దాంతాలకోసం సంఘానికి, వ్యక్తులకు ఏది శ్రేయస్కరమని తాము భావించారో ఆ విలువల కోసం ఆయన పుంఖానుపుంఖంగా రచనలు చేస్తూనే పోయారు.. 

స్త్రీ, పురుషుల సంభోగం తో సహా అన్నీ విషయాలలోనూ స్త్రీ కి పురుషునితో సమాన హక్కులు వుండాలి .. యుగ యుగాలుగా పురుషుడికి స్త్రీ బానిసగా పడి వుంది.. పురుష సమాజం స్త్రీ ని అణగద్రొక్కి వేసింది.. ఆమె ఒక వ్యక్తి అని, ఆమెకొక వ్యక్తిత్వం ఉంటుందని, ఆమెకు కూడా సొంత ఇష్టా, ఇష్టాలు, అభిరుచులు, స్వేచ్చానురక్తి ఉంటాయని ఊహించలేదు.. కేవలం పిల్లలను కని, వంట చేసి పెట్టే మరబొమ్మగానే స్త్రీ ని పురుషుడు పరిగణించాడు.. ఇది అన్యాయం. పురుషునికున్న స్వేఛ్చ స్త్రీ కి వుండాలి.. అప్పుడు గాని ఆమె వ్యక్తిత్వం పరిపూర్ణం చెందదు అని చలం గారు ఆనాడు ఘోషించారు.. కాలానికి ఎదురీదుతూ, గొప్ప ఆత్మ విశ్వాసంతో, అంచలంచల ధైర్య సాహసాలతో ఆయన తన భావాలను ప్రచారం చేసారు.. తన మొత్తం సాహిత్యాన్ని తన సాంఘిక విశ్వాసాలకు అంకితం చేసారు.. 

ఎన్ని రచనలు ?? ఒక పెద్ద ఉప్పెన వలె చలం గారి రచనలు ఆంధ్రదేశంపై విరుచుకు పడ్డాయి.. ప్రేమ లేఖలు, మ్యూజింగ్స్ , దైవమిచ్చిన భార్య, శశాంక, చిత్రాంగి, పురూరవ, మైదానం, బ్రాహ్మణీకం, అమీనా, అరుణ, ఇంకా ఇంకా ఎన్నో అసంఖ్యాకమైన నవలలు, నాటకాలు, కథలు, ఇతర రచనలతో వాటిలో అసాంప్రదాయక భావాలతో ఆయన తెలుగువారిని ఉక్కిరిబిక్కిరి చేసారు.. 

తన భావాలను కాదంటూ, ఎవరైనా తన వచనా శైలిని మెచ్చుకుంటే ఆయన సహించే వారు కాదు.. “నా భావాలనుంచి, నా ఆవేశాల నుంచి నా శైలిని విడదీయోద్దు” అవి పరస్పరాశ్రితాలు అని ఆయన అనేవారు.. అయినా తెలుగులో వ్యవహారిక వచనాన్ని తీర్చిదిద్దిన కొద్ది మందిలో ఒకరుగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు.... ఒకసారి ఆప్యాయంగా కబుర్లు చెప్పుతున్నట్లు, మరోసారి ఆదలిస్తున్నట్లు, ఒకసారి మృదువుగా, మరోసారి తీక్షణంగా వుంటుంది ఆయన భాష.. తెలుగుదేశపు ప్రకృతిని అంత అందంగా, అనురక్తితో వర్ణించిన మరొకరు లేరనడం అతిశయోక్తి కాదు.. దాశరధి గారు కూడా ఈ కోవలోకే వస్తారు కాని నా వరకు ఇద్దరూ ఇద్దరే .. చలం గారు ఛందోబద్దంగా వ్రాయలేదు కాని వచనంలోనే కవితా సౌరభాన్ని గుబాళింప చేసారు.. 

చలంగారిని తెలుగువారు చిరకాలం జ్ఞాపకం పెట్టుకుంటారు కాని ఆయన ప్రయోగించిన ఆవేశాస్త్రాలను మాత్రం గుర్తుంచుకోవట్లేదు .. ఇదే ఈ సామాన్యుని ఆవేదన... ఆయన అందించిన అమృతతుల్యపు మాటలను కేవలం విని వదలకుండా పాటించమని అభ్యర్ధనతో.. కేవలం చలం గారే కాదు . దేశ మహోన్నతికి పాటుపడిన వ్యక్తులు అంతరించినా వారి జ్ఞాపకాలు మనతోనే వుంటాయి.. కాని అది మాత్రమే సరిపోదు. వారిబాటలో పయనించాలనే కాంక్ష తో ఈ టపా రాయాలనిపించింది .. 

స్వస్తి.. __/\__

Bobby Nani

No comments:

Post a Comment