Wednesday, September 28, 2016

నేటి శృంగార విషయంలో కొందరి అపోహలు, భయాలు..



నేటి శృంగార విషయంలో కొందరి అపోహలు, భయాలు.. 

ఈ పైన వున్న పంక్తిని చూడగానే మరో కోణంలో ఆలోచించకండి.. ఆధ్యాత్మిక పరంగానూ, శాస్త్రీయ పరంగాను, విశ్లేషనాత్మకమైన వివరణను రాయ సంకల్పించి గడచిన 4 రోజుల అవిశ్రాంత విరామ అనంతరం మరలా మీ ముందుకు ఇలా వచ్చాను.... ఏ వయస్సు వారు అయిననూ ఇది నిరభ్యంతరం గా చదివేలా కొంచం సమయం తీసుకొని మరీ ఇలా రాసాను.. ఇందుకోసం ఎన్నో సూచనలు చదివాను.. వికీపీడియాను చూసాను, మహాత్ముల రాతలు పరిశీలించాను వారి ఆలోచనలను పరీక్షించాను.. నిజా నిజాలు ఏంటి అనే వాటికోసం వాటి మూలాలలోకి ప్రవేశించాను.. ఎట్టకేలకు ఎన్నో సుధీర్గ అన్వేషణల అనంతరం అన్నీ మిశ్రమం లా చేసి ఒక ఆర్టికల్(వ్యాసం) రాసి కొందరి అపోహలను, ఆలోచనలను సరైన దిశ, నిర్దేశాన్ని కలిగించే చిరు ప్రయత్నమే ఇది.. 

నేటికాలపు విచ్చలవిడి శృంగారాన్ని ఆస్వాదిస్తున్న మానవ యంత్రాలకు అసలైన శృంగారం అంటే ఏంటో దాని పవిత్రత ఏంటో తెలియజెప్పే వ్యాసం ఇది.. అందరూ చదవమని అభ్యర్ధన.. 

శృంగారం పేరెత్తగానే కొంతమంది ఉలిక్కిపడతారు .. మరికొంతమంది కలవర పడతారు.. ఇంకా కొందరు సిగ్గుతో మెలికలు తిరిగిపోతారు.. కొద్దిమంది ఉబ్బి, తబ్బిబ్బు అవుతారు .. తతిమ్మావారు భయంతో వొణికి పోతారు.. ఇది ఈ నేటి స్త్రీ ల స్థితి.. 

శృంగార విషయంగా స్త్రీలు ఇలా భిన్న వైఖరులు ప్రదర్శించడానికి వారు మనుగడ సాగిస్తున్న ఈ సమాజం, చుట్టూ వున్న పురుష ప్రపంచం కారణ భూతాలు .. స్త్రీని జీవంలేని వస్తువులా చూడటం, ఒకవేళ మనిషిగా చూచినా స్వేఛ్చ ఇవ్వకపోవడం, కాస్తో, కూస్తో స్వేచ్చ ఇచ్చినా పురుషునితో సమాన ప్రతిపత్తి ఇవ్వకపోవడం ఇవన్నీ కలిసి స్త్రీని న్యూనతపరిచినాయి. శృంగార అనుభవం తనకవసరమా ?? కాదా ... అని తేల్చుకోవడం, అందులో ఆనందానుభూతిని పొందడానికి ఆశించడం, అందుకనువైన మార్గాలను అన్వేషించడం, ఈ పనులు స్త్రీ కనుక చేపడితే తోటి స్త్రీలు తనని అవహేళన చేస్తారు.. పురుషులు నిందిస్తారు.. శృంగారం విషయం లో సమాజం యొక్క వైఖరిని అందులో స్త్రీ ల దృష్టిని పొరపాటుగా నిర్ణయించుకోవడం వల్ల ఇలా జరుగుతోంది .. 

శృంగారం గూర్చిన విషయం మాట్లాడరాదు, వినరాదు, చర్చించరాదు.. నిజానికి స్త్రీ జీవితంలో శృంగారానికి స్థానం లేదా ?? యుక్త వయస్సు వచ్చినప్పటినుంచి ఆమెకు శృంగారం ఈ సమాజం అనుక్షణం గుర్తు చేయుట లేదా ? అమ్మాయి రజస్వల కాగానే యెంత సంరంభం, యెంత హడావిడి.. ఇరుగుపొరుగు వారిని, భందువర్గాన్ని పిలిచి పంక్తి భోజనాలు సాగిస్తారు.. శృంగార జీవితాన్ని గుర్తుచేసే వేడుకలూ జరుపుతారు.. పెళ్లితంతు సరే సరి .. గర్భాదానపు మంత్రాలలో శృంగార జీవిత చిత్రణ ఎబ్బెట్టుగా వుంటుంది.. గర్భదారణ జరగగానే సూడిదలు, సీమంతాలు .. ప్రసవం కాగానే భారసాల మహోత్సవాలు.. ఇలా స్త్రీ జీవితంలో శృంగారమును అనుక్షణం ఆమెకు గుర్తు చేసేది ఈ సంఘటనలే, క్రతువులు ఎన్నో వుంటాయి.. ఉదాహరణకు : రజస్వల అయిన నక్షత్రం చెడ్డది అయితే గుండపు శాంతులు చేయిస్తారు.. తనేదో దోషం చేశాననే భావాన్ని ఇలాంటి క్రతువుల ద్వారా స్త్రీకి కల్పిస్తుంది ఈ సమాజం ఆమెకు పిన్ననాటనే.. 

శృంగారం ద్వారా ఆనందాన్ని పొందాలని స్త్రీ కోరుకోవడం తప్పని, సంతాన ప్రాప్తి కోసం మాత్రమే స్త్రీ శృంగార జీవితాన్ని గడపకూడదు అని కొందరు నీతి బోధ చేస్తున్నారు, చేస్తూనే వున్నారు.. అలాంటి వారిలో మహాత్మాగాంధీ గారు కూడా ఒకరు .. పితృరుణం తీర్చడానికి పురుష సంతానాన్ని కని భర్తకు సమర్పించిన తర్వాత ఇల్లాలు బ్రహ్మచర్యం అవలంభించాలనే వారు వున్నారు.. వీరి దృష్టిలో స్త్రీ పురుష లైంగిక సంబంధం సంతానం కొరకు మాత్రమే ఉద్దేశించబడింది.. అది లేని వారికి శృంగార జీవితం వింద్యం, గర్హ్యనీయము కూడాను.. అయితే ఇలాంటి వైఖరిని మన పూర్వీకులు ప్రదర్శించినట్లు ఎక్కడా దాఖలాలు లేవు.. ఋషుల కాలంలో శృంగారాన్ని నీచంగా చూడలేదు.. వారు శృంగార జీవితానికి తగినంత ప్రాధాన్యత ఇచ్చారు.. ఒక రకంగా ఆలోచిస్తే ఋషులు ఆనందోపాసకులు. జీవితాన్ని సుఖ ప్రదము, ఫల ప్రదము చేసుకోవడానికి వారు కృషి చేసారు.. శృంగారాన్ని శాస్త్ర విషయంగా గ్రహించి అధ్యయనం చేశారు .. వాత్సాయనుని కామ శాస్త్రం దీనికి తార్కాణం.. కాని ఇటీవల వేయి సంవత్సరాల నుండి వచ్చింది ఈ నాటి వక్ర భాష్యం.. శృంగార జీవితాన్ని చేజేతులా వొదులుకున్న స్త్రీ పురుషులు ఇంద్రియ నిగ్రహం చెయ్యలేక ఎన్ని వెతల పాల్పడుతున్నారో.. ఎన్ని సంకటస్థితులలో చిక్కుకుంటున్నారో, ఎన్ని రకాల మానసిక క్లేశాన్ని అనుభవిస్తున్నారో .. వైద్యులకు, మానసిక శాస్త్రజ్ఞులకు తేటతెల్లమైన విషయమే.. ఈ సిద్దాంతాలతో మానవ ప్రకృతిని, మానవ నిజాన్ని చిదిమేస్తున్నారు.. కొందరు పండితుల అజ్ఞానంతో, అయోమయంలో ఒక వర్గం ప్రజల్ని తమ తప్పుడు ఆలోచనల ద్వారా హింసిస్తుంటే.. మరికొందరు చిత్తశుద్ధి లేని వారై ద్వంద్వ నీతితో కృత్రిమ జీవితాన్ని గడుపుతున్నారు.. ఇలా సమాజాన్ని వక్ర మర్గాన పట్టిస్తున్నారు.. 

శృంగారాన్ని మోక్ష సాధనంగా అభివర్ణించి ప్రచారం చేసే ప్రబుద్దులు లేకపోలేదు.. మన దేశంలో ఆశ్రమాలు నెలకొలిపి కాముక క్రీడద్వారా మోక్ష ప్రాప్తికి సోపానాలు నిర్మించిన కొందరు గురువులు కోకొల్లలు.. తాంత్రిక పద్దతుల్లోని పాంచరాత్ర విధానంలో శృంగారానికి విపరీత స్థానం కల్పించబడింది.. ప్రస్తుత సమాజంలో మోసం, కృత్రిమం, విశ్వాస రాహిత్యం, నిజాయితీలేమి గూడుకట్టుకొని వున్నాయని తలపోస్తూ ఈ సమాజం నుంచి పారిపోదామని ప్రయత్నించే హిప్పీలు శృంగారాన్ని కేవలం సంతోష సాధన మార్గంగానే వాడుతున్నారు..మత్తు పదార్ధాలను సేవించడం, వావి వరసలు లేకుండా లైంగిక స్వైర విహారం చెయ్యడం వీరి నిజంగా మారింది.. దాహం వేస్తే నీరు త్రాగినట్లు శారీరక ఉద్రిక్తతను తొలగించుకోవడానికి, కామ దాహం తీర్చుకోవడానికి నీతి, నియమాలు సమాజం అడ్డురారాదని వాదించేవారూ వున్నారు.. దీనినే Drink of Water Theory అని పిలుస్తారు.. ఇలా వెఱ్ఱితలలు వేశారు విపరీత మనస్కులు.. 

స్త్రీ పురుషుల జీవితంలో శృంగార పాత్రను సరిగా మదింపు చెయ్యాలంటే సామజిక చరిత్ర అవగాహన అవసరం అవుతుంది.. శారీరక శాస్త్ర జ్ఞానాన్ని సంతరించుకోవాల్సి వుంటుంది.. మానసిక శాస్త్ర సిద్దాంతాలను అవగతం చేసుకోవడం ఆవశ్యమౌతుంది... ఇంత విషయ జ్ఞానం అవసరమైనప్పుడు అదేమి పట్టించుకోకుండా మౌడ్యంలో తలమునకలు వెయ్యడం విజ్ఞతకు లక్షణం కాదు.. శృంగార అనుభవం శారీరక సుఖాన్ని చేకూరుస్తుందని, మనసికానందానుభూతి మరో జీవితపు విలువ. స్త్రీ, పురుషులు తమ తమ స్థాయీ భేదాల్ని బట్టి వీటిలో ఒక దానివైపు మొగ్గు చూపించవచ్చు.. మానవుని జీవితంలో శృంగారం ప్రాధాన్యత వహిస్తుందనేది నగ్న సత్యం కాగా శృంగార పరమైన మానసికానందాన్ని ఆవలకు నెట్టి మరో రకంగా మనస్సుకు ఆహ్లాదాన్ని ఆశించేవారూ వున్నారు.. కాగా దరహం మీద చూస్తే మానవులు శరీర సుఖాన్ని, మానసిక సంతోషాన్ని వాంచిస్తున్నట్లు తేలుతుంది.. ఆదిమ సమాజంలో స్త్రీ, పురుషుల మధ్య శృంగార సంపర్కం సాగేది.. దరిమిలా సంఘ పరిణామంలో శృంగార జీవితాన్ని క్రమబద్దం చెయ్యడానికి, సంతానం యొక్క తల్లితండ్రులను నిర్ధారణ చెయ్యడానికి వివాహ వ్యవస్థ ఉద్భవించింది.. దాంతో సంతానానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.. సంతానప్రాప్తి మాత్రమే వివాహ లక్ష్యంగానూ, శృంగార జీవిత ఆదర్శంగానూ చిత్రించబడింది. శృంగారం సహాయంతో ఆనందాబ్దిలో ఓలలాడవలసిన భార్య, భర్తలు ఈ విచిత్ర నియమాలకు బలైపోతున్నారు.. ఇది శోచనీయం .. 

వివాహం యొక్క లక్ష్యాన్ని సరిగా, స్పష్టంగా నిర్దేశించాలి.. స్త్రీ, పురుషులిద్దరూ ఒకరిపై ఒకరు అభిమానాన్ని, ఆప్యాయతను, మొహాన్ని, ప్రేమను పెంచుకున్నప్పుడు మాములుగా వివాహమాడతారు.. కొంతమంది వివాహ ప్రక్రియ లేకుండా దాంపత్య జీవితం సాగిస్తుంటారు .. ఏ పద్దతి అవలంబించినా ఆ సంబంధానికి ప్రధాన లక్షణం నా దృష్టిలో సాన్నిహితత్వం.. ఒకరికొకరు మానసికంగా, సామాజికంగా చేరువైనప్పుడు వారి ఇరువురూ శృంగార అనుభవాన్ని పొందడం విడ్డూరంగా కనపడదు.. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే .. శృంగార అనుభవం సన్నిహితత్వాన్ని అనుసరించి పోవలెనా లేక దానివల్ల సన్నిహితత్వం ఏర్పడుతుందా అనేది ప్రశ్న.. నిజానికి రెండూ పరస్పరాశ్రయాలె .. అవినాభావ సంబంధం కలవి.. లైంగికానుభూతి సన్నిహితత్వాన్ని చరమదశగా పేర్కొనవచ్చు.. అదిలేని సన్నిహితత్వం పరిపూర్ణత్వాన్ని పొందదు ... అట్లే దాంపత్య జీవితం సన్నిహితత్వాన్ని దృడతరం చేస్తుంది.. 

సతీ పతులు విభిన్న మనస్తత్వాలను కలిగి వున్నా, ఇద్దరిమధ్యా వున్న విశిష్ట సంబంధం వల్ల ఒకరికొకరు చాలా దగ్గరి వారౌతారు.. అలాంటప్పుడు వారు దాంపత్య జీవితం గడపకుండా ప్రేయసి, ప్రియురాలిగా తమను చిత్రించుకుంటూ కాలం గడుపుతుంటే వారి జీవితం నిస్సార మౌతుంది.. ఉత్తరోత్తరా వారు మానసిక క్లేశానికి గురిఅవుతారు.. శృంగారం అచ్చంగా శారీరక ప్రక్రియ అని అనుకోవడం పొరపాటు.. అది మనసుకు, శరీరానికి రెండిటికీ సంబంధించిన విషయం.. మనస్సులేని శృంగార అనుభూతి పశుప్రయంతో సమానం.. 

మోక్షసాధన కోసం శృంగారాన్ని పరిహరించి బ్రహ్మచర్యాన్ని పాటించడం, సంతాన ప్రాప్తికోసం మాత్రమే దాంపత్య జీవితాన్ని గడపపూనటం, మోక్షసాధనకు లైంగికానుభూతిని సోపాన మార్గంగా ఎన్నుకోవడం, మనస్సుతో సంబంధంలేని కామ క్రీడను అభిలషించడం ఇవన్నీ పెడ మార్గాలు.. స్త్రీ, పురుషుల సన్నిహితత్వానికి శృంగారం ఉపకరిస్తుందని గ్రహించడం, కాముక క్రీడను ఒక స్థాయిలోని విలువలుగా గుర్తించడం సవ్యమైన ఆలోచనా విధానానికి ప్రతీకలు.. ఈ విషయాలను స్పష్టంగా గ్రహించ గలిగిన నాడు శృంగారాన్ని నిందించడంగాని, అతిగా స్తుతించడం గాని జరగదు.. సమతుల్య భావనతో, వాస్తవదృష్టితో హేతుబద్దంగా ఆలోచిస్తే శృంగారాన్ని గురించిన గందరగోళం మటుమాయం అవుతుంది.. అలాంటి దశకు మానవజాతి అందులో ముఖ్యంగా భారతీయులు త్వరితగతిన చేరుకుంటారని ఆశిద్దాం.. శృంగార అపోహలను పోగొట్టుకొని, స్వంత ఆలోచనలో నిబ్బరంగా తమ జీవితాలలో దాని పాత్రను సరిగా అర్ధం చేసుకొని మనుగడను స్త్రీలు సుఖవంతం చేసుకునే కాలం వస్తుందని అభిలాషిద్దాం .. 

స్వస్తి ___/\___

Bobby Nani

1 comment: