Saturday, October 23, 2021

అవ్యక్త ప్రభాత సూర్యోదయం ...



నా ఇంటి బాల్కనీలో
ఉదయిస్తున్న సూర్య కిరణం..!

దూరంనుంచి వినిపిస్తున్న
రెహమాన్ సంగీతం..!

సాదరంగా ఆహ్వానం
పలుకుతున్న పడక కుర్చీ..!

గుప్పుమని వాసనలతో
పొగలు కక్కే చేతికందిన కాఫీ..!

ఊగుతూ పలకరిస్తున్న
కుండీలోని మందారాలు..!

అలజడి విశ్రమించిన వేళ
మది అంతా
ఒక పరాగ సౌఖ్యం ముసిరిన వేళ
ప్రభాతమొక స్వర్ణ హంసమై
రాగమొక ప్రత్యూష పవనమై
హృదయమొక గాలిపతంగమై
స్వేచ్చగా విహరించు సమయాన
రాలుతున్న పూలు రహస్యంగా
గుసగుసలాడటం నే వింటున్నా..!!

ఎండిన చెట్ల కొమ్మల మధ్యన
వసంతం విడిచిన గుర్తులు
ఏ బుడ్డోడో ఎగరవేసిన గాలిపటం
రంగులన్నీ వెలిసి ఇంకా
ఆ కొమ్మల్లో వేలాడుతోంది..

కాళ్ళు బారా జాపి కులాసాగా వాలుకుర్చీలో
కాఫీ తాగుతున్న నాకు ఎన్ని దృశ్యాలో
జీవిత సన్నివేశాలను అద్దంలా చూపించే
అవ్యక్త ప్రభాత సూర్యోదయాలు
ఎంత గమ్మతైనవో..కదా...!!

Written by: Bobby Aniboyina
Mobile: 9032977985

1 comment:

  1. రాలుతున్న పూలు రహస్యంగా
    గుసగుసలాడటం నే వింటున్నా..!!

    ఎండిన చెట్ల కొమ్మల మధ్యన
    వసంతం విడిచిన గుర్తులు
    ఏ బుడ్డోడో ఎగరవేసిన గాలిపటం
    రంగులన్నీ వెలిసి ఇంకా
    ఆ కొమ్మల్లో వేలాడుతోంది..

    👌👌👌

    ReplyDelete