Friday, April 21, 2017

SOCOTRA (The Mysterious Island) from Bobby... 16th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

గుడారం పూర్తి అవుతుంది.. 

అందరూ తమ తమ సామాన్లు తో పడుకోవడానికి సిద్దపడుతారు … ఆకాష్ మాత్రం తన పడక సామాన్లు ఆమెకు ఇస్తాడు.. ఇద్దరూ దూరం దూరం గా ఒకరి వైపు మరొకరు తిరిగి పడుకుంటారు .. 

ఆకాష్ లో ఒకటే ఆలోచన .. ఇంత అందమైన అమ్మాయి నా చేయి పట్టుకొని నాతొ ఇంతదూరం ఇంత రాత్రివేళలో ఎలా వచ్చేసింది.. 

ఇంత నమ్మకం నాపై ఏంటి ఈమెకు .. అని ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు ఆకాష్..

తరువాత ఏంటో చూద్దాం పదండి..
16th Part

తెల్లవారుతోంది అనగా ఒక్కసారిగా ఆ అమ్మాయి పెద్దగా గావుకేక పెడుతుంది…

ఆ దెబ్బతో అందరూ ఉలిక్కిపడి లేచి కూర్చుంటారు… 

ఆకాష్ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి 

ఆకాష్.. ఆకాష్…. 

అంటూ ఆయాసంతో, భయంతో గుటకలు మింగుతూ, 

ముఖాన అంటిన స్వేద బిందువులను తుడుచుకుంటూ .. 

అక్కడ… అక్కడ … రక్తం.. రక్తం పారుతోంది ... 

చూడు ….. చూడు .. నా నడుముకు మొత్తం రక్తమే అంటుకుంది..నాకు భయంగా వుంది అని ఆకాష్ గుండెలపై తలఆన్చి గట్టిగా హత్తుకుంటుంది.. 

ఒక స్త్రీ తనతో ఇంత చనువుగా ఉండటం మొదటిసారి.. 

అందులోనూ నిన్న తన చేయి ముట్టుకున్నందుకే ఆ తన్మయత్వం ఇంకా వదల్లేదు.. అలాంటిది 

అపురూప సౌందర్యవతి అయిన ఓ అమ్మాయి ఏకంగా ఆకాష్ ని కౌగిలించుకొని అతని గుండెలపై తలపెట్టి వుంది ఇక అతని పరిస్థితేంకాను … 

ఆకాష్ తన చేతులతో పట్టుకుంటే బాగోదు అని గ్రహించి తనని తాను నిగ్రహించుకుంటూ ఉండగా .. 

ఆ రక్తం ఎక్కడ నుంచి వస్తుందా అని మోహన్, మరియు మిగిలినవారు కలిసి వెళ్లి చూస్తారు .. …వెళ్ళిన వారు పెద్దగా నవ్వుతూ వస్తున్నారు.. అది చూసి ఊపిరి పీల్చుకున్న ప్రసన్న కుమార్ భాటియా … ఎందుకురా అలా నవ్వుతున్నారు.. అక్కడేముంది ? అని ప్రశ్నిస్తాడు.. 

మీరే ఇటు వచ్చి చూడండి అని చిన్నోడు అంటాడు.. 

అప్పటిదాకా ఆకాష్ గుండెపై వాలి వున్న పడుచుపిల్ల ఒక్కసారిగా లేడిపిల్లలా గెంతుతూ అక్కడనుంచి వెళ్ళిపోయింది.. 

ఆకాష్ కూడా అక్కడేముందో చూడాలని అటువైపుగా వెళ్తాడు.. 

ఈ “SOCOTRA” దీవిలో అతి ముఖ్యమైన వృక్షం “డ్రాగన్ వృక్షం” గా పేరుగాంచింది … 


అది చూసేందుకు ఓ గొడుగు ఆకారంలో ఉంటుంది .. కాని దానికి గాయం తగిలితే మాత్రం దానినుంచి ఓ యెర్రని రక్తం వంటి ద్రవం నిరంతరం కారుతూనే ఉంటుంది.. అలా ఆ వృక్షంలో నుంచి కారిన ద్రవం పల్లం ఇటు వైపు ఉండటం చేత అది నేరుగా ఇటు వైపు వచ్చి ఆమెకు అంటుకొని ఉంటుంది .. అని రెండవ వాడు అయిన లోకేష్ అంటాడు.. 

కాని మోహన్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తూ.. ఇలా అడుగుతాడు 

అంతా బాగానే వుంది.. కానీ ఆ వృక్షానికి గాయం ఎలా అయింది ?? అని ప్రశ్నిస్తాడు.. 

నిజమే ఈ ధోరణిలో నేను ఆలోచించనేలేదు .. అని ప్రసన్న కుమార్ భాటియా అంటాడు.. 

అనుకున్నదే తడువుగా ఆ వృక్షం దగ్గరకువెళ్ళి తీక్షణంగా పరీక్షిస్తాడు ప్రసన్న కుమార్ భాటియా .. 

ఆ వృక్షం మీద వున్న గాట్లను చూస్తుంటే జంతువుల దంతాల గుర్తులు లా లేవు, 

అలానే కొండలనుంచి జారిపడిన రాతి గుర్తుల్లా కూడా లేవు.. అని అనుకుంటూ 

మరికాస్త దగ్గరగా చూస్తూ ..ఇది ఖచ్చితంగా ఎవరో ఆటవికులు తమ కత్తితో పెట్టిన గుర్తులు అని నిర్ధారిస్తాడు.. 

ఎలా చెప్పగలరు?? అని మోహన్ మరలా ప్రశ్నిస్తాడు.. 

నేను విజ్ఞాన శాస్త్ర అధ్యాపకుడను అని మర్చిపోతే ఎలా ?? అని చమత్కారంగా అంటూ.. 

ఇక్కడ బాగా దగ్గరగా వచ్చి చూడండి ఈ గుర్తులు వేరు వేరు ఆకారాలలో కాకుండా ఒకేలా వున్నాయి.. వ్యతిరేక దిశలో చూడండి మీకు అర్ధం అవుతుంది అని అంటూ .. ఆ గుర్తులనుండి ఓ మూడు అడుగుల పై నుంచి మీ తలను ఆ చెట్టుకు ఆనించి క్రిందకు చూడండి అని చెప్తాడు.. 

మోహన్ వెళ్లి చూడగానే నాకేమి అర్ధం కావట్లేదు .. ఏంటి ఆ గుర్తులు అని ప్రశ్నిస్తాడు.. 

ఆ గుర్తులన్నీ వారి చుట్టూవున్న పరిసరాలు, ప్రాంతాలు వారు కొత్తదారిని అన్వేషిస్తూ వచ్చినప్పుడు ఆ గుర్తులను వారు ఇలాంటి వృక్షాలపై పొందుపరుస్తారు.. ఈసారి వాళ్ళు ఇటువైపు వచ్చినప్పుడు దారి తప్పిపోకుండా అవి వారికి మార్గదర్శకాలుగా ఉంటాయి .. అంతే కాకుండా మరో తెగవారు ఇటువైపు వచ్చినా ఇక్కడ వారు వుండకూడదు ఈ ప్రాంతం మాది అనే సంకేతాలకు కూడా అవి ముఖ్య కారకాలుగా ఉంటాయి.. అందుకే వారు ఇలాంటి మార్గాన్ని అనుసరిస్తున్నారు అని ప్రసన్న కుమార్ భాటియా అంటాడు.. 

అద్బుతం అండి ప్రసన్న కుమార్ గారు అని మోహన్ ప్రశంసిస్తాడు.. 

ఒక్క విషయం అంటూ ప్రసన్న కుమార్ భాటియా మరలా మొదలు పెడతాడు.. 

ఇక్కడ ఆటవికులు ఉన్నారంటే ప్రమాదం పొంచి ఉందనే అర్ధం.. అందువల్ల మనం వేసే ప్రతీ అడుగు జాగ్రత్తగా వెయ్యాలి.. అందరూ కలిసే ఉండాలి అని అంటాడు.. 

ప్రమాదం అంటే ?? ఎలాంటిది అని చిన్నోడు ప్రశ్నిస్తాడు.. 

ఇక్కడ Man Eaters అంటే మనుషుల మాంసానికి రుచిమరిగిన భయంకరమైన వ్యక్తులు కొందరు వున్నట్లు నేను విన్నాను అని ఆ పిల్లాడు అంటాడు.. 


భగవంతుడా … ఇది నిజమా ?? అని భయపడుతూ అడుగుతుంది ఆ అమ్మాయి.. 

నిజమే అని నా నౌకలోని వారు అన్నారు .. అందువల్ల మనం మరికాస్త జాగ్రత్త వహిస్తే మనకే మంచిది అని ఆ పిల్లాడు అంటాడు.. 

ఈ సాయంత్రానికల్లా మనం ఓ సురక్షితమైన ప్రాంతాన్ని వెతకాలి అని మోహన్ అంటాడు.. 

ఇక అందరూ అక్కడనుంచి “SOCOTRA” దీవిలోకి ముందుకు కదులుతారు.. 

దారి పొడవునా వింత వింత ఆకారంగల జీవులు, విచిత్రమైన వృక్షాలు దూరాన కనిపిస్తున్న ఎన్నో ఏళ్ళ సంవత్సరాలనుంచి ఆకాశమంత ఎత్తుకు ఎదిగి కాపలా కాస్తున్న పెద్ద పెద్ద వృద్ద పర్వతాలు… నిజంగా భూమి పైనే వున్నామా ?? లేక ఏదైనా గ్రహం మీదకు వచ్చిపడ్డామా … అనేంతలా ఉన్నటువంటి ఈ దీవిని కళ్ళు, నోరు రెండూ పెద్దవిగా చేసి చూస్తూ ముందుకు కదులుతున్నారు.. 20 మిలియన్ సంవత్సరముల వంటి చరిత్ర కలిగిన “డ్రాగన్ వృక్షాల” మధ్యన నడుచుకుంటూ వెళ్తున్నారు.. భానుడి వేడి కిరణాలను వారిపై పడకుండా ఉండేందుకు ఛత్రము వలె తెరిచి వారి తలపై పెట్టినట్లుగా కనపడుతున్నాయి ఆ వృక్షాలు.. 


ఇప్పటివరకు వారు చుసిన జీవరాసి ఒక్కటి కూడా ఇక్కడ కనిపించట్లేదు …. ప్రతీ జీవి అక్కడ ప్రత్యేకమైనదిగా, భయంకరమైనదిగా కనపడుతోంది .. 

ఏంటి ఈ ప్రాంతం ఇంత భయంకరంగా ఉంది … 

ఇలాంటి దీవిలో మనం మనుగడ సాగించగలమా ?? అని ఆకాష్ అంటాడు.. 

మనం ఈ సాయంత్రానికల్లా ఆ కనిపిస్తున్న కొండల ప్రాంతానికి కనుక చేరుకోగలిగితే అప్పుడు ఆలోచించవచ్చు.. ప్రస్తుతానికి అయితే నాకేమి అర్ధం కావట్లేదు అని మోహన్ అంటాడు.. 

మనం అనుకున్న దానికన్నా ఈ దీవి చాలా దారుణంగా ఉంది అని ప్రసన్న కుమార్ భాటియా అంటాడు.. 

అందుకే నేను వద్దు అని వారించాను అని రెండవ వాడు అయిన లోకేష్ అంటాడు.. 

అబ్బా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ?? ఇక్కడకు ఎలాగోలా వచ్చేసాం కదా.. ముందు ఇక్కడ ఎలా బ్రతకాలో ఆలోచించండి అన్నయ్యలు అని చిన్నోడు అయిన సంతోష్ అంటాడు.. 

మోహన్ అన్న చెప్పింది అక్షరాల నిజం .. 

ముందు మనం ఆ పర్వతాల దగ్గరకు వెళ్ళాలి .. అక్కడే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని మా నౌక లో మాట్లాడుకునే వారు .. మనం అక్కడకు వెళ్తేనే మనకో ప్రణాళిక, మార్గం, అన్ని తెలుస్తాయి అని నౌకనుంచి వచ్చిన పిల్లాడు అంటాడు.. 

ఇక వారికి గల ఏకైక మార్గం ఆ పర్వతాల వైపుగా వెళ్ళడం.. అలానే వారి ప్రయాణం సాగుతుంది.. 

సూర్యుని ఉష్ణ తాకిడికి వారు విల విల లాడుతూ, కాళ్ళు ఈడుస్తూ, నడవలేక నడుస్తూ వెళ్తుండగా .. ఆకాష్ వద్ద గల మ్యాప్ లో కనిపించిన విధంగా అక్కడో పెద్ద రాతి గుట్ట కనిపిస్తుంది.. వెంటనే ఆకాష్ తన వద్దగల మ్యాప్ తీసి అందరికీ చూపిస్తాడు .. ఇదిగోండి ఈ మ్యాప్ లో ఉన్నట్లుగా ఆ రాతిగుట్ట అదే.. అక్కడకు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్దాం పదండి అని ఆకాష్ అంటాడు.. ఆకాష్ ఆ మాట అన్నదే ఆలస్యం అందరి అడుగులు అటువైపు నడిచాయి.. 

ఓ వీళ్ళు బాగా అలసిపోయినట్లు ఉన్నారే ...అని ఆకాష్ అనుకొని... తనుకూడా ఆ రాతి గుట్ట వైపుగా కదలసాగాడు.. 

ఆ రాతి గుట్ట లోపల మొత్తం సున్నపురాయితో నిర్మాణాలు చేసున్నారు.. లోపల చాలా బొరియలు ఉన్నట్లుగా అక్కడక్కడా గుంటలు ఏర్పడి వున్నాయి.. అందరూ అక్కడ వున్న ఓ పెద్ద రాతి మీదకు వచ్చి కూర్చుంటారు.. ఆ సున్నపురాతి వల్లనేమో ఆ ప్రదేశం అంతా చల్లగా ఉంది .. భానుడి ఉష్ణ తాకిడి ఆ సున్నపురాతి గుట్టను ఏమి చెయ్యలేక పోతోంది. 

ప్రసన్న కుమార్ భాటియా దృష్టి అక్కడ గోడలపై వున్న అతిపురాతన కళాఖండాలపై పడింది..వాటిదగ్గరకు వెళ్లి వాటిని చేత్తో స్పృశిస్తూ.. ఆహా యెంత అద్బుతమైన కళాఖండాలు అని అంటూ.. ఇవి నాకు తెలిసి షుమారుగా 9వ, 10వ శతాబ్దం మధ్యలో వున్నవి అనుకుంటున్నాను అని అంటాడు.. 

అవునా..!! నాన్న గారు అంటూ చిన్నోడు అయిన సంతోష్ అమితాశ్చర్యంతో దగ్గరగా వచ్చి అడుగుతాడు.. 

మనం అందరం కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న ఈ రాతి గుట్ట ఏంటో ఎవరికైనా తెలుసా ?? అని అందరివైపుకు తిరిగి ప్రసన్నకుమార్ భాటియా ప్రశ్నిస్తాడు … 

ఈ చుట్టూ ఉన్నవాటిని గమనిస్తే ఇదొక శిధిలమైన కట్టడంలా వుంది.. ఈ కట్టడంలో సదుపాయాల్లాంటివి నాకేమి కనపడలేదు.. అప్పట్లో పరదేశీయులు ఉండటానికో లేక వర్తకులు, అమ్మకందారులు రాత్రివేళ బసచేసి తెలవారున వెళ్లేందుకు ఏర్పాటు చేసిన కుటీరంలా నాకనిపిస్తోంది. అని మోహన్ అంటాడు.. 

అలాంటప్పుడు ఈ కళాఖండాలు ఎందుకు ఏర్పాటు చేసినట్లు ?? అని ఆకాష్ అందుకుంటాడు.. 

ఇది దీవి అని కాస్త ఆలోచించండి … చుట్టూరా నీరు వున్న ప్రాంతంలో జనాలే లేకుంటే ఈ అమ్మకందారులు, కొనుగోలుదారులు ఎక్కడనుంచి వచ్చారు అని మధ్యలోవాడు అయిన లోకేష్ ప్రశ్నిస్తాడు.. 

నిజమే లోకేష్ అని మోహన్ అంగీకరిస్తాడు.. 

ఎమ్మా నీ కేమనిపిస్తుంది అని ప్రసన్నకుమార్ భాటియా ఆ అమ్మాయిని ప్రశ్నిస్తాడు.. 

అయ్యో .. నాకేమి తెలియదండి.. నాకు బయటి ప్రపంచం గురించి తెలియదు… కాని ఈ కట్టడం నాకు కోవెలలా అనిపిస్తుంది అని చెప్తుంది.. 

కోవెల.. అంటూ అందరూ వెటకారంగా నవ్వడం ప్రారంభిస్తారు.. 

నవ్వకండి అని కోపంగా ప్రసన్నకుమార్ భాటియా అందరినీ వారిస్తాడు.. 

ఆమె చెప్పింది అక్షరాల నిజం .. అని అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

ఆ మాటతో ఆశ్చర్యపోయిన వారంతా ఎలా చెప్పగలిగారు అని ఆమెను ప్రశ్నిస్తారు.. 

ఏమి లేదు ఈ ప్రదేశం చూడటానికి చాలా ప్రశాంతంగా, చుట్టూరా విశాలంగా వుంది.. అదికాక సముద్రమట్టానికి చాలా ఎత్తులో వుంది..ఇక్కడనుంచి చూస్తే చూట్టూరా చాలా మైళ్ళు దూరంవరకు మొత్తం కనిపిస్తుంది.. కోవెలను ఇలానే నిర్మించేవారు నాటి రోజుల్లో .. అన్నిటికన్నా ముఖ్యం ఆ గోడలపై మన భారతదేశం యొక్క బ్రహ్మలిపి చెక్కబడి వుంది.. ఈ లిపి కేవలం పవిత్రమైన గోడలపైనే చెక్కుతారని శాస్త్రం చెప్తోంది.. కోవెల కన్నా పవిత్రత మరేమి ఉంటుంది .. ఇలా నాకు అనిపించింది అని ఆ అమ్మాయి సమాధానం ఇస్తుంది.. 


ఇవి విన్న వారంతా కళ్ళు అలానే పెద్దవి చేసి ఆమెనే చూస్తూ ఉండిపోయారు .. 

To be continued …

Written by : BOBBY

3 comments: